Kakinada District Latest News
-
వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ● సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ సూచనసామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహించాలని అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన సూచించారు. వివిధ శాఖల అధికారులతో పంచారామ క్షేత్రంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులందరికీ దర్శనాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పారిశుధ్యం, లైటింగ్ ఏర్పాట్లను మున్సిపాలిటీ చూస్తుందని చెప్పారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తుకు అదనపు సిబ్బందిని తీసుకుంటామని సీఐ కృష్ణభగవాన్ చెప్పారు. భక్తులకు సేవలు చేసే స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఎన్సీసీ విద్యార్థుల పేర్లు ముందుగా తీసుకోవాలని సూచించారు. ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం మాట్లాడుతూ, పంచారామ క్షేత్రంలో ఈ నెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. గోదావరి కాలువ కొత్త బ్రిడ్జిపై ఉన్న మట్టిపై తరచూ వాటరింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు మాట్లాడుతూ, భక్తులు పుణ్యస్నానాలు చేసే గోదావరి కాలువలోకి కలుషిత జలాలు రాకుండా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. మాండవ్య నారాయణస్వామి కాలి బాట వంతెన ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువన ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఫణిత మాట్లాడుతూ, కాలువలోకి కలుషిత జలాలు రాకుండా పరిసరాల్లోని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. మున్సిపాలిటీ నుంచి అవసరమైన అన్ని సేవలూ అందిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య హామీ ఇచ్చారు. -
గుండెపోటు బాధితులకు ఉచితంగా ఇంజక్షన్
● కలెక్టర్ షణ్మోహన్ ● అవగాహన పోస్టర్ ఆవిష్కరణ కాకినాడ సిటీ: గుండెపోటు బాధితులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుబాటులో ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గుండెపోటు లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఎన్.స్వప్నతో కలిసి కలెక్టరేట్లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తుని ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 9 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గుండెపోటు బాధితులకు అందించే ఇంజక్షన్ అందుబాటులో ఉందన్నారు. రూ.40 వేల విలువైన ఈ ఇంజక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ గుండె పోటుకు గురైన 82 మందికి ఈ ఇంజక్షన్ అందించామన్నారు. గుండె నొప్పికి గురయ్యే వారు తొలి గంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన వైద్య సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పని చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జీజీహెచ్, ఆరోగ్యశ్రీ, ఇతర విభాగాల అధికారులతో గత నెలలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించిన అంశాల పురోగతిపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇల అంతర్వేది పురములో..
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి/మలికిపురం: తూర్పున ఉవ్వెత్తున ఎగసే సాగర కెరటాల హోరు.. పశ్చిమాన వశిష్ఠ గోదావరి గలగలలు.. ఆ నడుమ సాగర సంగమ తీరంలో వెలసిన దేవదేవుడు.. ఆ లక్ష్మీ నారసింహుడు కొలువైన అంతర్వేది పుణ్యక్షేత్రం నిత్యం ఆధ్యాత్మిక పరవళ్లతో ఇల వెలసిన వైకుంఠంలా దర్శనమిస్తోంది. భక్తకోటి నడకలు ఆ పుణ్యక్షేత్రం దారుల్లోనే సాగుతున్నాయి. స్వామి వారి కల్యాణ ఘడియలు దగ్గరపడుతున్నకొద్దీ వారి నడకల్లో వడి పెరిగింది. వేదిక సర్వాంగ సుందరమై వధూవరుల రాకకోసం నిరీక్షిస్తోంది. తారా మండలం భువికొచ్చిందా అన్నట్టు విద్యుద్దీప కాంతులతో ఆ ప్రాంతమంతా శోభాయమానమై భాసిల్లుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే లక్ష్మీనరసింహుని కల్యాణం శుక్రవారం జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ‘ధరణిలో పుణ్యధామం, దర్శించిన ఎంతో భాగ్యం’ అని నమ్మే భక్తులు అంతర్వేదికి దారి తీస్తున్నారు. కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. తరువాత రోజయిన శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రథోత్సవం కన్నుల పండువగా సాగనుంది. కల్యాణం, తరువాత రోజు సముద్ర స్నానాలు, స్వామివారి దర్శనం, రథోత్సవం తదితర కార్యక్రమాలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. రాజోలు దీవిలో కొన్ని కుటుంబాల వారు ఈ కల్యాణంలో పాల్గొనడంతో పాటు కల్యాణాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి ఘటన నేపథ్యంలో.. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతర్వేదిలో నేడు కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ వాహనంపై, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 12.55 గంటలకు స్వామివారి వార్షిక తిరు కల్యాణం నిర్వహించనున్నారు. విద్యుద్దీప కాంతుల్లో అంతర్వేది ఆలయంభద్రతా చర్యలివీ.. ఇవీ హెల్ప్లైన్లు కమాండ్ కంట్రోల్ : 08862–243500 పోలీసు డయల్ నంబర్ : 100 సఖినేటిపల్లి ఎస్సై : 9440796566 రాజోలు సీఐ : 9440796526 తహసీల్దార్ : 9849903893 వీఆర్వో : 9701835669 ఎంపీడీవో : 9491575915 అంతర్వేది కార్యదర్శి : 9493062920 డాక్టర్ యూనస్ : 8792257516 రాజోలు ఆర్టీసీ ఎంక్వయిరీ : 08862–221057 లక్ష్మీ నారసింహుని కల్యాణానికి సర్వం సిద్ధం నేటి రాత్రి 12.55 గంటలకు దివ్య ముహూర్తం రేపు మధ్యాహ్నం 2.05 గంటలకు రథోత్సవం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు తిరుపతి ఘటన నేపథ్యంలో భారీ భద్రత ఆలయ సమీపంలో పర్యాటక శాఖ అతిథి గృహం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌ను, బీచ్ వద్ద కూడా తొలిసారిగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 20 డ్రోన్లు, 100 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. భక్తుల కోసం రూట్ మ్యాప్ విడుదల చేశారు. 1,550 మంది పోలీసు సిబ్బందిని భద్రతకు వినియోగిస్తున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 1,400 మంది కానిస్టేబుల్స్, మరికొంత మంది హోంగార్డులు విధుల్లోకి రానున్నారు. బీచ్‌వద్ద భక్తుల రక్షణకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో 4 రెస్క్యూ బోట్లు, 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వన్‌వే అమలు చేస్తున్నారు. వాహనాలను కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది పంపించనున్నారు. ఆలయం నుంచి వచ్చే వాహనాలు ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా వెళ్లాలి. భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద, రథం షెడ్డు వద్ద పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాలలో 340 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. 120 మొబైల్ టాయిలెట్లు, 5 వైద్య శిబిరాలు, మూడు 108 వాహనాలు, 104 వాహనాలు అందుబాటులో ఉంచారు. 26 మంది వైద్యాధికారులు, 85 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. ఆర్టీసీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం, పాలకొల్లు నుంచి 40, కోనసీమ జిల్లా అమలాపురం, రాజోలు నుంచి 65 ప్రత్యేక బస్సులు భక్తుల కోసం నడపనుంది. కల్యాణం రోజున సాధారణ భక్తులు స్వామి కల్యాణాన్ని వీక్షించేలా 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. -
శివరాత్రి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు
అమలాపురం రూరల్: ఈనెల 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో భక్తులకు మహాశివుని దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, మందపల్లి శనైశ్చరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, అమలాపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానం, పలివెల ఉమా కోప్పేశ్వర స్వామి ఆలయం, ర్యాలి జగన్మోహిని దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానాల అధికారులతో సమీక్షించారు. ఆయా ఆలయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, అదనపు సిబ్బంది, వసతుల కల్పన వంటి సహకారానికి ముందుగానే ప్రతిపాదనలు పంపితే అందుకు తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం సమకూరుస్తుందన్నారు. స్నాన ఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, దేవదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ డీఎల్వి రమేష్, వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎన్ఎస్ చక్రధరరావు, ద్రాక్షారామ, భీమేశ్వరస్వామి దేవ స్థానం కార్యనిర్వాహక అధికారి ఏవీ దుర్గా భవాని, అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి దేవస్థానం, అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానం కార్యనిర్వహక అధి కారి ముదునూరి సత్యనారాయణ రాజు, వివిధ దేవస్థానాల ఈవోలు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.పలు ఆలయాల ఈఓలకు, అధికారులతో జేసీ నిశాంతి సమీక్ష -
కూటమికి విమానం మోత
● విమానాశ్రయంపై తలొక ప్రతిపాదన ● నేతల మధ్య ఆధిపత్య పోరు ● అన్నవరం ఎయిర్‌పోర్టు సాధ్యం కాదన్న ఏఏఐ ● సాల్ట్ భూములపై తాజా ప్రతిపాదనసాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందో’ అంటూ పల్లవి అందుకుంటున్నారు కూటమి నేతలు. గాలిలో మేడలు కట్టడం, లాండ్ అవ్వని విమానాలను.. వచ్చేస్తున్నట్టు బిల్డప్‌లు ఇవ్వడం చంద్రబాబు సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాష్ట్రంలో ఆరు ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. అందులో ఒకటి కాకినాడ జిల్లాకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కోల్‌కతా – చైన్నె జాతీయ రహదారికి సమీపాన అన్నవరం – బెండపూడి మధ్య ఈ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి సుమారు 757 ఎకరాలు అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రాథమికంగా నిర్ధారించింది. తొండంగి మండలం బెండపూడి, పీఈ చిన్నాయిపాలెం గ్రామాల పరిధిలో భూ సేకరణకు ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు, భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై ఇటీవలే ఏఏఐ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఈ ప్రాంతంలో అంతగా సానుకూలత లేదని ఏఏఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావించారు. ఇవీ ప్రతికూలతలు ప్రతిపాదిత అన్నవరం ఎయిర్‌పోర్టుకు సేకరించే భూములకు రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేఎస్ఈజెడ్) పరిధిలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన దివీస్, ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైన లీఫియస్తో పాటు, భవిష్యత్‌లో ఏర్పాటవుతాయని చెబుతున్న ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఎయిర్ కార్గోపై అంచనాలు తప్పాయని ఏఏఐ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే, ఒకవైపు 100 కిలోమీటర్లలోపే రాజమహేంద్రవరం, మరోవైపు 150 కిలోమీటర్లలోపు విశాఖపట్నం విమానాశ్రయాలు ఉండటం కూడా ప్రతికూల అంశాలని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తుని – బెండపూడి మధ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటు టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి చిరకాల ఆశ. అక్కడ ఎయిర్‌పోర్టు వస్తే నష్టపోయే 1,200 మందీ కూడా చిన్న రైతులే. అయితే ఈ ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల యనమల అనుచరులు, బంధువులు గతంలో దండిగా భూములు కొన్నారని, అందువల్లనే ఈ విమానాశ్రయం కోసం వారు పట్టుబట్టారని అంటున్నారు. అందుబాటులో 1,195 ఎకరాలు అన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి ఏఏఐ సానుకూలంగా లేకపోవడంతో కాకినాడ శివారు చొల్లంగి – గురజనాపల్లి మధ్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాల్ట్ కమిషనర్ భూములను తెర మీదకు తీసుకువచ్చారు. కత్తిపూడి – దిగమర్రు హైవేకు ఆనుకుని.. పెనుగుదురులో 566.50, గురజనాపల్లిలో 560.50, చొల్లంగి పరిసరాల్లో 68 కలిపి మొత్తం 1,195 ఎకరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉప్పు సాగు కోసం ఈ భూములను లీజు ప్రాతిపదికన ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని అప్పటి లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి మూడు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఈ భూములను అప్పగించే ప్రతిపాదనను అప్పట్లోనే ఆయన సాల్ట్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. ఎయిర్‌పోర్టు అథారిటీతో పాటు సాల్ట్ కమిషనర్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నారు. ఈ క్రమంలో పైసా పరిహారం ఇవ్వనవసరం లేకుండా భూ సేకరణ పూర్తి చేయవచ్చునని కాకినాడ సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. అయితే, ఎయిర్‌పోర్టుకు భూములు సేకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందువలన సాల్ట్ భూములు కేటాయిస్తే.. దానికి సంబంధించిన సొమ్మును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. సాల్ట్ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే ఇటు కాకినాడ జిల్లాతో పాటు అటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిసర ప్రాంతాలకు కూడా కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు ఇటా అటా అనే దానిపై కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అసలు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేక.. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుప్పిగంతులాడుతున్నారా అనే చర్చ నడుస్తోంది.సాల్ట్ కమిషనర్ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రూపొందించిన మ్యాప్ -
సూర్యనారాయణుని కల్యాణానికి సర్వం సిద్ధం
భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీపెదపూడి: వైష్ణవ సంప్రదాయంలో పూజాదికాలు చేసే ఏకై క సూర్యదేవాలయం ఉన్న మండలంలోని జి.మామిడాడ స్వామివారి కల్యాణానికి సమాయత్తమైంది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళా శాసనాలతో ఏకాదశి శనివారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. బాణసంచా పోటీల్లో గెలుపొందిన వారికి కాసు బంగారం బహుమతి ఇవ్వనున్నారు. రథసప్తమితో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్స వాలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్నాయి. శనివారం వారి కల్యాణం సందర్భంగా ఉదయం 5 గంటలకు నిత్యోపాసన, విశేషహోమం, బలిహరణ, 8 గంటలకు ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో భారీ అన్న సమారాధన, 12.30 గంటకు శ్రీవారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుంది. -
అయినవిల్లి విఘ్నేశ్వరునికి రూ.1,08,774 ఆదాయం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి గురువారం ఒక్క రోజు వివిధ పూజ టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.1,08,774 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రదానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు ఒక జంట, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 18 మంది, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో ఆరు జంటలు, స్వామివారికి గరిక పూజల్లో 36 మంది భక్తులు పాల్గొన్నారు. ముగ్గురు చిన్నారులకు అన్నప్రసాన, తులాభారం నిర్వహించారు. 14 వాహన పూజలు జరిపారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని 1060 మంది స్వీకరించారు. -
ముద్రగడపై దాడి పిరికిపందల చర్య
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, అమలాపురం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కాపు జేఏసీ నాయకులు గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనకు, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి ముద్రగడ గిరిబాబుకు సంఘీభావం తెలిపారు. తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే అంకింతం చేసిన ముద్రగడను అవమానించడానికే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున్న కాపునాడు ఉద్యమం చేపట్టిన వ్యక్తిపై దాడి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడంలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా పదేపదే దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని, ఇప్పటికై నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించి దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కాపులకు పెద్ద అన్నగా ఉంటానన్న పవన్ కాపుల కోసం పోరాడిన ముద్రగడ దాడి జరిగితే కనీసం ఖండించలేదని కాపు జేఏసీ నేతలు వాపోయారు. ముద్రగడకు సంఘీభావం తెలిపిన వారిలో చినిమిల్లి వెంకట్రావు, నల్ల విష్ణు, తోట రామకృష్ణ, దుర్గారావు, ఉమామహేశ్వరీ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం మీడియాతో వైఎస్సార్సీపీ నాయకులు -
చదువును చాలించకూడదని..!
ఐ.పోలవరం: విద్యార్థులంతా తాము చదువుకునే పాఠశాలకు నిత్యం గోదావరి నదీపాయ దాటి వస్తుంటారు. సముద్ర సంగమ ప్రాంతం దగ్గర కావడం వల్ల పోటు, పాటు సమయంలో ఇక్కడ నదీపాయల్లో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ చదువుపై మక్కువతో వారు పడవలపై వస్తున్న విషయాన్ని గుర్తించిన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వారికి గురువారం లైఫ్ జాకెట్లు అందజేశారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం ఉన్నత పాఠశాలకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి నిత్యం 95 మంది విద్యార్థులు వస్తుంటారు. వీరంతా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నారు. వీరిలో అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందినవారే అధికం. గోదావరికి పోటు సమయంలో వీరి కష్టాలను చూసిన పాఠశాల హెచ్ఎం కొమ్మన జనార్దనరావు ఇదే విషయాన్ని వాట్సప్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషాకు వివరిస్తూ తమ విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందించి రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన డీఈవో ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ వివరించారు. దీనికి స్పందించిన రెండు మూడు రోజుల్లో 95 మంది విద్యార్థులకు ‘లైఫ్’ జాకెట్లు అందజేశారు. అలాగే స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైతం లైఫ్ జాకెట్లు ఇప్పించాలని అక్కడ హెచ్ఎం కోరడంతో వారికి కూడా వాటిని అందజేశారు. ఫలించిన ఉపాధ్యాయుని ప్రయత్నం వాట్సప్ సందేశానికి విశేష స్పందన సహకరించిన డీఈఓ.. స్పందించిన కలెక్టర్ విద్యార్థులకు లైఫ్ జాకెట్ల అందజేత -
పరిహారం చెల్లించాకే పనులు
● పోలవరం కాలువ నిర్వాసితుల డిమాండ్ ● రెండో రోజూ పనుల అడ్డగింపు తుని రూరల్: చట్ట ప్రకారం తమ భూములకు, ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేపట్టాలని కుమ్మరిలోవ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆర్వీఆర్ సంస్థ సిబ్బంది రెండో రోజైన గురువారం కాలువ పనులకు ఉపక్రమించగా బాధిత రైతులు, నిర్వాసితులు అడ్డుకున్నారు. జేసీబీ పైకి ఎక్కి ఆందోళన చేశారు. కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సర్వేయర్ జాగారాలు, పోలవరం ఇరిగేషన్ డీఈ మురళి, ఏఈలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తాండవ నది, కంట్రాళ్ల కొండ మీదుగా పోలవరం కాలువ తవ్వి, అక్విడెక్టు నిర్మించేందుకు అడ్డంకిగా ఉన్న కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లు, 46.92 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ఇళ్ల సేకరణ ప్రక్రియ 90 శాతం పూర్తవగా భూసేకరణ సందిగ్ధంలో ఉంది. తుని పట్టణాన్ని ఆనుకుని ఉన్న విలువైన భూములపై తమతో సంప్రదించకుండా అధికారులు రూ.1,87,580 చొప్పున కోర్టులో అవార్డు జమ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎకరా రూ.3 కోట్లు పైగా పలుకుతోందన్నారు. నిర్వాసితుల కోసం కిలోమీటరు దూరంలో సేకరించిన భూములకు ఎకరాకు రూ.20 లక్షలు పైగా చెల్లించిన అధికారులు.. పట్టణాన్ని ఆనుకుని ఉన్న భూములకు విలువ కట్టడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. అలాగే, జిరాయితీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మరి కొంత మందికి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందాల్సి ఉందన్నారు. తమకు పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని సర్వేయర్ జాగారాలు, డీఈ మురళి చెప్పారు. జక్కాన రామునాయుడు, జక్కాన రామచంద్రరావు, పోతల రాంబాబు, బాధితులు, నిర్వాసితులు తమ డిమాండ్లను రాతపూర్వంగా సర్వేయర్, డీఈలకు అందజేశారు. -
రేపు, ఎల్లుండి నామినేషన్లకు సెలవు
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి శని, ఆదివారాల్లో నామినేషన్లు స్వీకరించబోమని రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు.కుంభమేళాకు రేపు ప్రత్యేక రైలు కాకినాడ: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రైల్వే శాఖ కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి శనివారం మరో అదనపు రైలు ఏర్పాటు చేసింది. 07095 నంబర్‌తో నడిచే ఈ రైలు కాకినాడలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది. రెండు రోజుల తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుతుంది. కాగా, కాకినాడ నుంచి ఏసీ బోగీలతో ఒక ప్రత్యేక రైలును ఈ నెల 20న ప్రయాగ్ రాజ్‌కు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదనపు రైలు కోసం భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు మరో రైలు కూడా ఏర్పాటు చేశారు. ఏలేరు ఆయకట్టుకు 1,600 క్యూసెక్కులుఏలేశ్వరం: రబీ సాగు నిమిత్తం ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 100 క్యూసెక్కుల చొప్పున అందిస్తున్నారు. ఆయకట్టు పరిధిలో సుమారు 54 వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, గురువారం 81.81 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 15.63 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. రేపు నవోదయ ఎంపిక పరీక్ష పెద్దాపురం: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శనివారం ఉదయం 11 గంటలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయలో పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, సెంటర్ లెవెల్ పరిశీలకులతో నవోదయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రామకృష్ణయ్య గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణకు పెద్దాపురంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిదో తరగతికి 1,451 మంది, 11వ తరగతిలోకి ప్రవేశానికి 699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బీసీ హాస్టళ్లలో సంక్షేమం అగమ్యగోచరం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బీసీ హాస్టళ్లలో సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా పెండింగ్ బిల్లు లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. అద్దె భవనాల్లోని హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారని, మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచుతామన్నారని, ఇవేవీ నెరవేరలేదని అన్నారు. బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని ఉన్నత న్యాయస్థానం చెప్పినా అమలు చేయలేదన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో హాస్టళ్లను ఇన్చార్జి వార్డెన్లు నడుపుతున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. హాస్టళ్లలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. పాఠశాల విద్యను పరిరక్షించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాఠశాల విద్యను కాపాడాలని, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యాన వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ఎదుట గురువారం ఆందోళన చేశారు. ఏపీటీఎఫ్ (1938), పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, డీటీఎఫ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. నివాసాలకు 1, 3, 5 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల నమోదు 40 శాతం దాటిన అన్ని ప్రాథమిక పాఠశాలలకు విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఆంగ్ల బోధనకు ఒక పోస్టు ఇవ్వాలని, 50 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డేవిడ్ లివింగ్స్టన్, కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయబ్రహ్మం, గౌరవాధ్యక్షుడు అప్పయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు..
గోకవరం/తొండంగి: రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని దుఃఖాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమారుడిపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. మండలంలోని బెండపూడికి చెందిన బూసాల రామకృష్ణ, గౌరీదేవిలకు కుమారుడు బూసాల సతీష్ (18), కుమార్తె మణి దీపిక ఉన్నారు. తుని మండలం తేటగుంటలో ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ ఆ పిల్లలను పోషిస్తున్నాడు రామకృష్ణ. రాజమహేంద్రవరం గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సతీష్ గోకవరం మండలం కామరాజుపేటలో ఉన్న తన అమ్మమ్మ నీటిపల్లి సత్యవతిని చూసేందుకు నాలుగు రోజుల క్రితం వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం తన స్నేహితుడితో కలసి బైక్ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కొత్తపల్లి శివారు ఆదర్శ ఫార్మశీ కళాశాల సమీపంలో భారీ మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు సతీష్‌ను గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బటయపడ్డాడు. నాలుగు రోజుల పాటు ఎంతో సరదాగా గడిపిన మనవడు మృత్యువాత పడడంతో అమ్మమ్మ సత్యవతి బోరున విలపించడం చూపరులను కలచివేసింది. మరో వైపు తన స్వగ్రామం బెండపూడిలో ఎంతో ఆల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు ప్రయోజకుడై తమకు అండగా ఉంటాడని ఆశ పడితే అందని తీరాలకు పోయి శోక ం మిగిల్చాడని తండ్రి రామకృష్ణ, తల్లి గౌరీదేవి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అందరితో సరదాగా ఉండే సతీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బెండపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం బీటెక్ విద్యార్థి మృతి కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు -
హంస వాహనా.. శేష శయనా..
సఖినేటిపల్లి: అంతర్వేదిలో లక్ష్మీనృసింహుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం సాయంత్రం హంస వాహనంపైన, రాత్రి శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అలాగే స్వామివారి సన్నిధిలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారి సన్నిధిలో పుణ్యాహవచనం, వాస్తుపూజ, గరుత్మంతుని హోమం, అంకురార్పణ, ధూపసేవ, ధ్వజా రోహణ, గరుత్మంతుని చిత్రపటం ఆవిష్కరణ నిర్వహించారు. ఏడు రోజుల పాటు విష్ణుదీక్ష గురువారం నుంచి పౌర్ణమి వరకూ ఉత్సవాల నిర్వహణకు అర్చకులు ఏడు రోజులు పాటు విష్ణుదీక్ష తీసుకున్నారు. ఏటా ఈ దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ దీక్షా వస్త్రాలను అందజేశారు. భక్తి శ్రద్ధలతో అంకురార్పణ స్వామివారి దీక్ష తీసుకున్న అర్చకులు భక్తిశ్రద్ధలతో అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించారు. నవధాన్యాలను పుట్టమట్టిపై చల్లి, సర్వ దేవతలను ఆవాహన చేసి, ఏడు రోజుల పాటు అర్చనకు శ్రీకారం చుట్టారు. ఈ నవధాన్యాల నుంచి మొక్కలు ఎంత ఏపుగా ఎదిగితే అంతమేర గ్రామాలు పాడిపంటలతో సుభిక్షంగా ఉంటాయని పురాణ ప్రతీక. ధ్వజారోహణ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేయడమే ధ్వజా రోహణ అని ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ తెలిపారు. కల్యాణ మహోత్సవాలకు దుష్ట శక్తుల వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ధ్వజారోహణను చేస్తామని అన్నారు. ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్భలను కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగురవేశారు.ధవళేశ్వరం: నవ జనార్దునులలో ప్రథముడైన ధవళగిరి వాసుని కల్యాణానికి ధవళేశ్వరం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న కల్యాణోత్సవాలు ఈ నెల 13 వరకు వైభవంగా సాగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది రథ, కల్యాణోత్సవాలకు తరలి రానున్నారు. ఇందుకు దేవదాయ, ధర్మదాయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుంది. రథంవీధి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్ వరకు రథోత్సవం కన్నుల పండగగా సాగి రాత్రి 9.30 గంటలకు కల్యాణం నిర్వహించనున్నారు. ఈ రథానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 40 అడుగులు పొడవైన రథాన్ని ఒకే చెట్టు కలపతో నిర్మించారు. గ్రామ ఆడపడుచులు ఎక్కడున్నా ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. ర థంపైన కట్టే గొడుగును భక్తులు అరటిపండ్లతో కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గొడుగుకు అరటిపళ్లు తగిలితే శుభమని గ్రామస్తుల విశ్వాసం. ధవళగిరిపై ఉన్న జనార్థన స్వామి ఆలయంధవళగిరిపై లక్ష్మీజనార్దనం రేపటి కల్యాణానికి సర్వం సిద్ధం వేలాదిగా తరలి రానున్న భక్త జనం భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనృసింహుడు కనుల పండగగా గ్రామోత్సవాలు కొనసాగుతున్న విశేష కార్యక్రమాలు -
విషమ పరీక్ష
జిల్లాలో పదో తరగతి విద్యార్థుల వివరాలు పాఠశాలలు 457 పరీక్ష కేంద్రాలు 142 పరీక్షలు రాయనున్న బాలికలు 13,735 బాలురు 13,763 మొత్తం 27,498 ఒక్కో విద్యార్థికి స్టడీ మెటీరియల్ ప్రింటింగ్ ఖర్చు రూ.1,000 జిల్లా వ్యాప్తంగా విద్యార్థులపై భారం రూ.2.75 కోట్లు పిఠాపురం: ఉన్నత విద్యాభ్యాసానికి కీలకమైన 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందువలన ఈ పరీక్షలకు విద్యార్థులను అన్నివిధాలా సంసిద్ధుల్ని చేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. వచ్చే నెల 17 నుంచి 31వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో విద్యా శాఖ అధికారులు ఇప్పటికే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యా శాఖ రూపొందించింది. దీని ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా క్లాసులు చెబుతూ, సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందించాలి. అయితే ఇంతవరకూ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ఆ భారాన్ని విద్యార్థుల పైనే మోపుతోంది. వంద రోజుల ప్రణాళికలో ఇప్పటికే 60 రోజులు పూర్తయిపోయాయి. మరోవైపు టెన్త్ పబ్లిక్ పరీక్షలకు మరో 38 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. గడువు దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మాత్రం అందించలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా అక్టోబర్ నెలలోనే స్టడీ మెటీరియల్ పంపిణీ చేసేవారు. ఈసారి కూటమి ప్రభుత్వం స్టడీ మెటీరియల్ పంపిణీలో చేతులెత్తేసింది. విద్యార్థుల పైనే భారం రాష్ట్ర విద్యా శాఖ తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పీడీఎఫ్ ఫైల్ రూపంలో పాఠశాలలకు పంపించారు. ఇది అన్ని సబ్జెక్టులకూ కలిపి 500 పేజీల వరకూ ఉంది. ఒక్కో పేపర్ ప్రింటింగ్‌కు జిరాక్స్ షాపుల్లో రూ.2 ఖర్చవుతోంది. ఈ లెక్కన 500 పేజీల స్టడీ మెటీరియల్ ప్రింటింగ్‌కు రూ.1,000 వరకూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చవుతోంది. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 27,498 మంది ఉండగా.. వీరందరిపై ప్రింటింగ్ ఖర్చుల భారం సుమారు రూ.2.75 కోట్లు పడుతోంది. ఒకేసారి ఇంత ఖర్చు భరించలేక పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, సకాలంలో స్టడీ మెటీరియల్ చేతికి అందక.. పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు స్టడీ మెటీరియల్ చేతిలో లేకపోవడంతో విద్యార్థులను పరీక్షలకు ఏవిధంగా సిద్ధం చేయాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ పాఠశాలకు స్టడీ మెటీరియల్ రాలేదని చెప్పడానికి కూడా వారు భయపడుతున్నారు. ‘దయచేసి మమ్మల్ని వీధిలో పెట్టకండి. మేము చెప్పినట్లు తెలిస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు’ అని చెబుతున్నారు. విద్యార్థులపై భారాలు దారుణం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం దారుణం. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడానికే అన్నట్టుగా సర్కారు ధోరణి ఉంది. ఇలాగైతే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి? ఉచిత చదువులు అంటూ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకురావడం సిగ్గుచేటు. ఇప్పటికై నా స్టడీ మెటీరియల్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ విద్యాభివృద్ధికి తోడ్పడే తల్లికి వందనం (గతంలో అమ్మ ఒడి), ఫీజు రీయిబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఇప్పటికే మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. చివరకు టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడంలోనూ మొండిచేయి చూపుతోంది. ‘చదువుకోవాలనుకుంటే మీ డబ్బుతో మీరే ప్రింట్లు తీయించుకోండి’ అంటూ విద్యార్థులకు ప్రింట్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పీడీఎఫ్) ఫైల్స్ మాత్రమే ఆయా పాఠశాలల ద్వారా అందిస్తోంది. దీంతో, వాటిని ప్రింట్ తీయించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు చేతిచమురు వదిలిపోతోంది. ప్రతిపాదనలు పంపించాం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం. – పి.రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ ఫ టెన్త్ విద్యార్థులతో కూటమి సర్కార్ చెలగాటం ఫ పీడీఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ అందజేత ఫ ప్రింటింగ్ చేయించుకోవాలని సూచన ఫ తల్లిదండ్రులకు వదిలిపోతున్న చేతిచమురు ఫ జిల్లా విద్యార్థులపై రూ.2.75 కోట్ల భారం -
ఇంటర్లో నూరు శాతం ఉత్తీర్ణత
కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రీ ఫైనల్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా రానున్న 25 రోజులూ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులపై అధ్యాప కులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వారిని కేటగిరీలుగా విభజించి, చదివించాలన్నారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి పెట్టి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తరగతులకు సెల్ఫోన్లు తీసుకువచ్చే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఐఈవో జీజీకే నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీల హాజరు పెంచాలి రానున్న 45 రోజుల పాటు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా నిర్వహించాలని, కూలీల హాజరు పెంచాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. డ్వామా, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్లు, గోకులం పశువుల షెడ్లు తదితర పనులన్నింటినీ మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి ముమ్మరంగా నిర్వహించాలన్నారు. మంజూరు చేసిన ప్రతి పని తప్పనిసరిగా పూర్తి కావాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా కారాదని స్పష్టం చేశారు. ఈ వారం కూలీల హాజరు ఏలేశ్వరం మండలంలో బాగుందని ప్రశంసించారు. ఉపాధి పనుల అవసరం, అవకాశం ఎక్కువగా ఉన్న కోటనందూరు మండలంలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెడ్‌క్రాస్ సభ్యత్వాలు, విరాళాలు పెంచాలి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వాలు, విరాళాల సేకరణ, సేవ కార్యక్రమాలను పెద్ద స్థాయిలో చేపట్టాలని అధికారులకు కలెక్టర్ షణ్మోహన్ విజ్ఞప్తి చేశారు. రూ.లక్ష విరాళాలు సేకరించిన వారిని వెండి పతకంతో, రూ.2 లక్షలు ఆపై విరాళాలు సేకరించిన వారిని గోల్డ్ మెడల్‌తో రెడ్‌క్రాస్ సొసైటీ సత్కరిస్తుందని తెలిపారు. పక్కాగా శివరాత్రి ఏర్పాట్లు ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు, రక్షణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. భక్తులకు రవాణా, తాగునీరు, సురక్షిత స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునేందుకు రూములు, మరుగుదొడ్లు, బారికేడింగ్, లైటింగ్, సూచనలు ఇచ్చేందుకు, తప్పిపోయిన వారి జాడ తెలిపేందుకు మైక్ సిస్టమ్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవీఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి ప్రసాద్‌బాబు, ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. 10న నులిపురుగుల నివారణ కార్యక్రమం నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ నెల 10న 19 ఏళ్లలోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను కలెక్టరేట్లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ మొదటి సంవత్సరం, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య కళాశాలల విద్యార్థులకు, పాఠశాలలకు వెళ్లని పిల్లలకు ఈ మాత్రలు ఉచితంగా ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి, ఎన్సీడీ, ఆర్బీఎస్కే అధికారి ఐ.ప్రభాకర్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఫ అధ్యాపకులకు కలెక్టర్ ఆదేశం ఫ ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష -
భీష్మ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని సన్నిధికి శనివారం వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భక్తులకు నీడ కల్పించేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం ఎదురుగా ప్లాట్‌ఫామ్‌పై, భక్తులు బస్సుల కోసం వేచి ఉండే పార్కింగ్ స్థలంలో షామియానాలు వేశారు. అలాగే, భక్తుల కోసం అదనపు క్యూ లైన్లు, ప్రసాదం, వ్రతాలు, దర్శనం టిక్కెట్లు విక్రయించేందుకు అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పలుచోట్ల మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈసారి భీష్మ ఏకాదశి, రెండో శనివారం సెలవు రోజున వచ్చినందున సత్యదేవుని సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రాజగోపురం వద్ద భక్తుల కోసం కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులను ఈ కంపార్ట్మెంట్లలో ఉంచి తోపులాట లేకుండా దర్శనానికి పంపించనున్నారు. ఈ కంపార్ట్మెంట్లలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు కూడా పంపిణీ చేయనున్నారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు రత్నగిరికి చేరుకుంటారు. అప్పటి నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు శనివారం ఉదయం 8 గంటల నుంచి పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ రత్నగిరిపై భీష్మ ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు బుధవారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. గత కార్తిక మాసంలో మాదిరిగానే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తుల నుంచి విమర్శలు లేకుండా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ పలుచోట్ల షామియానాలు, అదనపు కౌంటర్లు ఫ పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్టుమెంట్లు ఫ భక్తులకు మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు -
పోలవరం కాలువ పనులు అడ్డుకున్న నిర్వాసితులు
తుని రూరల్: మండలంలోని కుమ్మరిలోవ కాలనీ వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని కాలనీ నిర్వాసితులు అడ్డుకున్నారు. తహసీల్దార్ ప్రసాద్, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ సంస్థ ఆర్వీఆర్ సిబ్బంది బుధవారం జేసీబీతో ఆ ప్రాంతానికి వెళ్లారు. పనులు చేస్తూండగా కాలనీ నిర్వాసితులు, భూ నిర్వాసితులు వారిని అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని, అప్పటి వరకూ వద్దని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా కొనసాగుతున్న తమ సమస్య పరిష్కరించకుండా కాలువ పనులు చేయన్విబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చెల్లింపులు పూర్తయినచోటే పనులు చేపడుతున్నామని తహసీల్దార్, కాంట్రాక్ట్ సిబ్బంది చెప్పారు. తాము కోర్టు నుంచి స్టే పొందామని కొంతమంది రైతులు, కాలనీలోని ఇళ్ల నిర్వాసితులు పేర్కొన్నారు. అటువంటి పత్రాలుంటే రేపటిలోగా ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. కాలనీలో ఇళ్లు కోల్పోతున్న 165 కుటుంబాలకు, 40 ఎకరాల రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని నిర్వాసితులు తెలిపారు. ఇళ్లు కోల్పోతూండటంతో 15 ఏళ్లుగా మరమ్మతులు చేయించకుండానే బిక్కుబిక్కుమంటూ నివాసం ఉంటున్నామని, ఈ దశలో పనులు చేస్తే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనులు చేపట్టలేదని, జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేస్తున్నామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల ఇళ్లు కూలిపోయే అవకాశం ఉండదన్నారు. కోర్టు నుంచి ఎటువంటి పత్రాలున్నా తమకు చూపించాలని, పనులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
గంజాయి, జూదంపై ఉక్కుపాదం
పెద్దాపురం: గంజాయి, జూదాల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ ఆవరణలో పరిశుభ్రతను, వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లా మీదుగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు దాడులు, తనిఖీలు చేస్తామని చెప్పారు. పండగ వాతావరణం పేరుతో మొదలైన కోడిపందాలు, పేకాట శిబిరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి రోజూ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. జూదాల నిర్వహణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ కృష్ణభగవాన్, ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్లపై కానిస్టేబుళ్లకు శిక్షణ కాకినాడ క్రైం: డ్రోన్ల వినియోగంపై హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక శిక్షణ బుధవారం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. త్వరలో ప్రతి స్టేషన్ పరిధిలో ఓ డ్రోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్ వినియోగించి, కీలక కేసులు ఛేదిస్తే సిబ్బందిని తగిన రీతిలో సత్కరిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల నూతన కార్యవర్గం కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్వీ ప్రసాదరావు, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అందరూ డీఎల్డీవోలు, ఎంపీడీవోలు పాల్గొని, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా జెడ్పీ డిప్యూటీ సీఈవో జీఎస్ రామ్‌గోపాల్, జిల్లా అధ్యక్షులుగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత, ఉపాధ్యక్షులుగా తుని ఎంపీడీవో కె.సాయినవీన్, డ్వామా ఏపీడీ పి.జగదాంబ, ప్రధాన కార్యదర్శిగా కాజులూరు ఎంపీడీవో జె.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా బి.హరికృష్ణ, కార్యదర్శులుగా ప్రత్తిపాడు ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్‌బాబు, సామర్లకోట ఎంపీడీవో కె.హిమమహేశ్వరి, మహిళా కార్యదర్శిగా కరప ఎంపీడీవో కె.స్వప్న, కోశాధికారిగా డ్వామా డీఎల్డీవో పి.భాస్కర్ ఎన్నికయ్యారు. డ్రోన్ పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ -
బాలుడిపై బాలిక ఫిర్యాదు
ప్రేమించి వంచించాడు.. పెళ్లంటే పొమ్మన్నాడు.. రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు. చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు. పేకాడుతున్న 9 మంది అరెస్టు రూ.77 వేల స్వాధీనం అమలాపురం టౌన్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో పేకాడుతున్న బృందంపై పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం రాత్రి దాడి చేశారు. 9 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.77,520 నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
చికిత్స పొందుతున్న యువతి మృతి
అమలాపురం టౌన్: ఈనెల 2న స్థానికంగా జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరానికి చెందిన నలబ శ్రీదేవి (20) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపిన వివరాల మేరకు పదో తరగతి వరకూ చదివి ఇంటి వద్దే ఉంటున్న శ్రీదేవి అమలాపురం మార్కెట్ వీధిలోని బంధువులు ఇంటికి వచ్చి ఆటోలో ఓడలరేవు బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయమై విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఆమెకు అంత్యక్రియల సందర్భంగా ఆమె జ్ఞాపకాలను తలచుకుని కుటుంబీకులు రోదించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన ఏడుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సీఐ తెలిపారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
తాళ్లపూడి: పలు చోరీ కేసుల్లో నింతుడిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దేవంలో జనవరి 30న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును ఐదు రోజుల్లో ఛేదించినట్టు ఎస్సై తెలిపారు. మలకపల్లి బస్టాండ్ వద్ద మంగళవారం గోపాలపురం మండలం బీమోలుకు చెందిన చుక్కల బాబిని నిందితుడుగా గుర్తించి అదుపులోకి తీసుకుని పోగొట్టుకున్న మంగళ సూత్రాలు, నల్లపూసలు, ఉంగరాలు, పట్టీలు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు రూరల్ సీఐ విజయబాబు పర్యవేక్షణలో సీసీఎస్ ఎస్సై రవీంద్రతో కలిసి కేసును ఛేదించి సొత్తును రికవరీ చేశారు. నిందితుడు బాబీని కోర్టులో హాజరు పరచినట్టు ఎస్సై తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,000 – 14,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చెత్త తగలబెడుతుండగా పేలుడు
ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు కాకినాడ రూరల్: వేకువ జామునే విధులకు వెళ్ళిన రమణయ్యపేట పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తగలపెడుతుండగా ఒక్క సారిగా వచ్చిన పేలుడుతో తీవ్రంగా గాయపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ వద్ద రెండు రోజుల క్రితం చెత్తను తగలబెడుతుండగా సమీపంలోని ఇంటి వారు చెత్తతో ఉన్న కవర్‌ను పారిశుధ్య కార్మికులకు అందజేయడంతో దానిని చెత్త మంటలో వేయగా కొద్ది సేపటికి పెద్ద శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు పారిశుధ్య కార్మికులు కోమాటి లక్ష్మి, కాకినాడ పోచమ్మ, ధనాల గణేష్ గాయపడ్డారు. పోచమ్మ ఒంటిపై కాలిన గాయాలు తీవ్రం కావడంతో జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. మిగిలిన ఇద్దరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. కవర్లో ఉన్న బాడీ స్ప్రే సీసాలే పేలుడుకు కారణమని భావిస్తున్నారు. -
చెడు వ్యసనాలకు బానిసై చోరీలు
అమలాపురం రూరల్: చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని వారు దొంగిలించిన 13 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమతో పాటు ఇతర జిల్లాల్లో మొటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వారి వివరాలను డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం గంజాయి, మద్యం తదితర వ్యసనాలతో డబ్బుకోసం వారు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. కోనసీమలోని వివిధ పోలీస్ స్టేషన్‌తో పాటు విశాఖ జిల్లా పరిధిలోని కంచర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వారి నుంచి రూ.8.82 లక్షల విలువైన 13 మోటార్ సైకిళ్లను, మూడు బ్యాటరీలను రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులైన కాట్రేనికోన మండలం చెయ్యేరు గున్నేపల్లికి చెందిన మేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి, అమలాపురం మండలం ఈదరపల్లి చెందిన వీరమల్లు తరుణ్ శశికుమార్, ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన దొంగ లోకేష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు. రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో తాలూకా ఎస్సై వై.శేఖర్‌బాబు. క్రైమ్ ఏఎస్సై సుబ్బారావు, హెచ్‌సీ రవికుమార్, పీసీలు శివకుమార్, ధర్మరాజు నిందితులను పట్టుకోవడంలో శ్రమించారన్నారు. వారికి రివార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ముగ్గురు మైనర్లతో పాటు ఆరుగురి అరెస్టు 13 మోటార్ సైకిళ్ల స్వాధీనం అమలాపురం డీఎస్పీ ప్రసాద్ -
అలసిన మనసుకు సాంత్వన కళ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మానవ జీవితంలో కళ అత్యుత్తమమైనదని, అది అలసిన మనసుకు ప్రశాంతతను ఇస్తుందని సుప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత, తెలుగు అఽధికార భాషా సంఘ మాజీ సభ్యుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సురేష్‌నగర్‌లో శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో ‘హరివిల్లు–2025’ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులలో నిద్రాణమై ఉన్న శక్తిని వెలికి తీసి, సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేలా కళాకృతులు ఉన్నాయన్నారు. గౌరవ అతిథి భారతీయ చిత్రకారిణి, ప్రింట్ మేకర్ గౌరి వేముల మాట్లాడుతూ కళ అనేది తపస్సు అని, కళాకారుడు ఒక ఋషీశ్వరుడని అన్నారు. మందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రాంభించారు. పాఠశాల డైరెక్టర్ విజయప్రకాష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గ్రంధి రాజగోపాల్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకుడు కిశోర్‌కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రముఖ కవి జొన్నవిత్తుల చిత్తు కాగితాలతో చిత్తరువుల రూపకల్పన శ్రీప్రకాష్‌లో ఆకట్టుకున్న ‘హరివిల్లు’