సాక్షి, కాకినాడ: పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేస్తారన్న ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.
వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు.
రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: వర్మ
రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. గత 20 ఏళ్లుగా పిఠాపురంలో టీడీపీకి సేవలందిస్తున్నాను. గత రెండు నెలలుగా సీటు విషయమై చాలా బాధపడుతున్నాను. గత ఎన్నికల్లో ఓడినా.. పార్టీ, ప్రజల కోసం పని చేశానని వర్మ తెలిపారు.
కాగా, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై జనసేన పార్టీలో సందిగ్ధత నెలకొంది. ఏ చోటకు వెళ్తే అక్కడ పోటీ చేస్తానని నిన్నటి వరకు ప్రకటనలు చేసిన పవన్.. ఎట్టకేలకు పిఠాపురం దగ్గర ఆగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment