సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండానే సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు నుంచి అనుచరులు రావాలని వర్మ స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వర్మ మొగ్గుచూపుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీలో రచ్చ మొదలైంది. ఇప్పటికే వర్మకు పార్టీ పెద్దలనుంచి పిలుపు రాగా, కార్యకర్తలతో సమావేశం తర్వాత వస్తానని వర్మ చెప్పినట్లు సమాచారం.
కాగా, కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు.
వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు.
ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్‌తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్‌ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment