
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు.
వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?
అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..
పవనే దెబ్బ కొట్టారా..?
ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.

అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.
మరింత అగ్గి రాజేసేలా..
పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది.