
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదు.
రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.హోం మంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదు. హోం మంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయి. బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకాతాయిలపై ప్రయోగించాలి. దిశ చట్టంతో మహిళలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రక్షణ కల్పించారు. 2700 మంది మహిళలను దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదని హోం మంత్రి పదే పదే చెప్పారు. అందుకే దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ‘దిశ’ అనే ఆయుధాన్ని ఆక్టివ్ చెయ్యండి.
కేంద్రంలో ‘దిశ’ చట్టం పెండింగ్‌లో ఉంది. చట్టం అమలులోకి వచ్చేలా చూడాలి. కూటమిలో ఉన్న మీరు దిశ చట్టంపై బాధ్యత తీసుకోవాలి. దర్శిని కుటుంబానికి కనీసం ఆర్ధిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. హోం మంత్రి పక్క నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమెకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి లేదంటే వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పని చెయ్యాలి. దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలి’ అంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment