
బొల్లినేని ఆస్పత్రిలోనే ఎందుకు చికిత్స చేయిస్తున్నారు?
మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనన్న పవన్‌కళ్యాణ్ ఎక్కడ?
వైఎస్సార్‌సీపీ నేతలు వరుదు కళ్యాణి, శ్యామల, మార్గాని భరత్‌రామ్ మండిపాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని కుటుంబాన్ని కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మంగళవారం పరామర్శించారు. అనంతరం నిందితుడి దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీకి వినతిపత్రమిచ్చారు.
ఆస్పత్రి వద్ద కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక యువతిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బొల్లినేని ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయించడం దారుణమన్నారు. ఫార్మసీ విద్య చివరి సంవత్సరం పూర్తి చేసుకుని, ఉద్యోగంలో స్థిరపడాల్సిన సమయంలో విద్యార్థిని ఆస్పత్రిలో ఇలా అచేతనంగా పడి ఉండటం బాధాకరమన్నారు. సూసైడ్ నోట్‌లోని ప్రతి అక్షరంలోనూ ఆమె బాధ కనిపిస్తోందన్నారు.
ఇంత దారుణానికి ఆస్పత్రి ఏజీఎం దీపక్ కారకుడయ్యాడన్నారు. అతడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో బాధితురాలు ఇంజెక్షన్ చేసుకుందని, ఇప్పటివరకూ ఆమె తల్లిదండ్రులకు సీసీ టీవీ ఫుటేజీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆ ఇంజెక్షన్ ప్రమాదకరమని, ఎవరికి వారు చేసుకోలేరని చాలామంది అంటున్నారన్నారు. అలాంటప్పుడు వేరే వ్యక్తులు చేశారా? అసలు ఏం జరిగిందో సీసీ టీవీ ఫుటేజీలోనే ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఈ ఘటనపై సిట్ వేసి, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 10 రోజులైందని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత ఏం స్పందించారని నిలదీశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానని ప్రగల్భాలు పలికిన పవన్.. దీపక్ తాట తీయాలి కదా అన్నారు. టీడీపీ సానుభూతిపరుడైతే దండించరా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది?
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. బాధితురాలికి సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని నిలదీశారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక హత్యా అనే అనుమానం కలుగుతోందన్నారు. దీపక్ చాలామంది ఆడపిల్లలను వేధించినట్లు తెలుస్తోందని, అటువంటి వ్యక్తికి ఎందుకు ప్రభుత్వం, పోలీసులు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విద్యార్థినిని దారుణంగా హింసించిన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీపక్ మామ టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అన్నారు. దీపక్‌పై గతంలో కేసులున్నాయంటున్నారని, అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడం వలన వెనకేసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.