దారి తప్పిన దర్యాప్తు! | Conspiracies to dilute the pharmacy student case | Sakshi
Sakshi News home page

దారి తప్పిన దర్యాప్తు!

Mar 29 2025 5:50 AM | Updated on Mar 29 2025 7:32 AM

Conspiracies to dilute the pharmacy student case

లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసును నీరుగార్చే కుట్రలు 

నిందితుడు దీపక్‌ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది 

ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యం.. 

పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రవరం రాలేరా? 

నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్‌ 

హోంమంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాల మండిపాటు 

ఆడపిల్లలపై చేయివేస్తే తాట తీస్తానన్న పవన్‌ ఎక్కడ? 

ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు.. దాని అర్థం ఇదేనా? 

సాక్షి, రాజమహేంద్రవరం: లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్‌ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్‌ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్‌ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు  దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్‌ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్‌ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి. 

తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్‌ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది. 

నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. 
ఈ కేసులో అరెస్టయిన కిమ్స్‌ ఏజీఎం దీపక్‌ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేత­కు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

సీసీ ఫుటేజీ ఎక్కడ? 
బాధితురాలు వేకురోనీమ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్‌ డెడ్‌ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్‌ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. 

గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్‌ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్‌ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్‌ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు.  

వాడిని చంపేయండి..! 
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. 

ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్‌ చేసింది. సూసైడ్‌ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.

ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు.

ఎవరిని కాపాడేందుకీ తాత్సారం?: మార్గాని భరత్‌రామ్‌
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రికి శుక్రవారం ఆయన చేరుకుని ఐసీయూలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. 

ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం భరత్‌రామ్‌ మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని బ్రెయిన్‌ డెడ్‌ అయిందని ఒకరు... లేదని మరొకరు చెబుతున్నారన్నారు.  ఘటనపై ఈ నెల 23న ఒక ఎఫ్‌ఐఆర్, 24న మరొకటి ఎలా నమోదయ్యాయని నిలదీశారు. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు కూడా మార్చారన్నారు. 

ఈవీఎం ఎమ్మెల్యే (రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు) ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టయిన దీపక్‌ టీడీపీ నాయకుడి అల్లుడని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే ఎవరినో కాపాడడానికి పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని భరత్‌రామ్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా హోంమంత్రి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్‌ చేశారు.  

హోంమంత్రికి పరామర్శించే సమయం లేదా?
ఐద్వా, మహిళా సంఘాల మండిపాటు 
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. బాధితురాలు చికిత్స పొందుతున్న కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రికి ఐద్వా, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), మహిళా కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఐద్వా నేత రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఆ విద్యార్థిని సాధారణ స్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. 

నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విద్యార్థిని సెల్‌ఫోన్‌ డేటాను దీపక్‌ డిలీట్‌ చేశాడని, ఆధారాలను మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేశాడన్నారు. మహిళ అయి ఉండి కూడా హోంమంత్రి ఇంత వరకూ ఎందుకు రాలేదని నిలదీశారు. బాధిత విద్యార్థినిని దీపక్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరచుకున్నట్లు తెలుస్తోందన్నారు. అతడిపై రేప్‌ కేసు నమోదు చేశారో లేదో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

టూరిజంపై ట్వీట్‌ చేయడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి ఈ అకృత్యంపై ఎందుకు ట్వీట్‌ చేయలేదని, గుండెల్ని పిండేసే ఈ ఘోష పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పెద్దమనిషి పవన్‌ కళ్యాణ్‌ ఏమైపోయాడని నిలదీశారు. పుట్టిన రోజు చేసుకున్న మహిళా హోంమంత్రి ఇంత దారుణ సంఘటన జరిగితే ఇప్పటి వరకూ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement