
సాక్షి, నిడదవోలు: నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (25) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో నాలుగైదు రోజుల్లో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనపై నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అప్పటి వరకు సరదాగా ఉండి.. కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుతో వివాహం నిశ్చయమైంది. మరో నలుగైదు రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.