
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.
జరిగింది ఇదీ..
లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి.
తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది.
నిందితుడు టీడీపీ నేతలకు బంధువు..
ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

సీసీ ఫుటేజీ ఎక్కడ?
బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
వాడిని చంపేయండి..!
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.