సాక్షి, అమరావతి : మొన్నటివరకు ప్రత్యేక హోదా అక్కర్లేదు అన్నారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని బుకాయించారు. హోదాతో పరిశ్రమలకు రాయితీలొస్తాయా? అలాగని ఏ చట్టంలో ఉందని దబాయించారు. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని ప్రకటించగానే.. ఆహా.. ఓహో.. అద్భుతమంటూ బృందగానాలు చేశారు. థ్యాంక్యూ మోదీజీ అంటూ ఫోన్లు చేసి అభినందించారు. ప్రధాని మోదీ, అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసల్లో ముంచెత్తి.. పొగడ్తలతో ఆకాశానికెత్తారు.. తీరా నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ ప్రభుత్వ అవినీతి, పచ్చి అవకాశవాదం, నయవంచన బయటపడటం.. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలం కావడంతో ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నెట్టి.. తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రత్యేక హోదాపై బాహాటంగా, నిర్మోహమాటంగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుపట్టి.. మడమతిప్పని నైజంతో ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాన్ని సాగిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్యాకేజీ మైకంలో కూరుకుపోయారు. నాడు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ కేంద్రం తానా అంటే తందానా అంటూ ఊరేగారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటం.. ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలీయంగా ఉండటంతో హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టానని ఆయన, ఆయన అనుచరులు బాకాలు ఊదటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తీరును ఇటు రాజకీయ నాయకులు, అటు నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటూ చేసిన ప్రకటనలు.. అవి బ్యానర్లుగా ప్రచురితమైన కథనాల క్లిప్పింగ్లను షేర్ చేస్తూ.. చంద్రబాబూ.. ఇదేం వైఖరి.. ఇదేం రెండు కళ్లసిద్ధాంతం.. ఇదేం రెండు నాల్కల ధోరణి అని ఎండగడుతున్నారు.
తాజాగా బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ కూడా ట్విటర్‌లో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. నాడు ప్యాకేజీ ప్రకటించగానే ‘థాంక్యూ మోదీజీ’ అంటూ ఫోన్లు చేసి మరీ అభినందించిన చంద్రబాబు.. నేడు పచ్చి అబద్ధాలతో విషం చిమ్ముతున్నారని, ఇదే చంద్రబాబు అసలు స్వరూపమని ఆయన మండిపడ్డారు.
14 September 2016 headlines of a leading Telugu daily: “THANK YOU MODIJI” - ‘CM Chandrababu Calls PM; Thanks Him for Special Package’:
And now a NCM with full of venom n lies. That is typical of CBN pic.twitter.com/TVsF3WSREq
— Ram Madhav (@rammadhavbjp) 21 July 2018
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నట్టుగా పార్లమెంటు సాక్షిగా మరోసారి వెల్లడైందని పేర్కొన్నారు. నిన్నటి చర్చలో టీడీపీ సరైన వాదనలు వినిపించలేకపోయింది.. ఆ అభిప్రాయం ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మొదటినుంచి పట్టుబడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment