
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.
ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది.
ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు.
ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు.
గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది.
అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు.
ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.