
సెల్ టవర్‌పై ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డు చూపుతున్న తెలంగాణ యువకుడు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం ఓ తెలంగాణ యువకుడు ఢిల్లీలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశాడు. మెట్రో భవన్‌కు చేరువలో భారీ టవర్ ఎక్కిన యువకుడు ఏపీ నీడ్ స్పెషల్ స్టేటస్, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్‌ను తెలియపర్చాడు. జోరున వర్షం కురుస్తున్నా వెరువక రాష్ట్ర భవిష్యత్ కోసం యువకుడు భారీ టవర్‌ను ఎక్కాడు. వర్షం కారణంగా అతను జారి కిందపడతాడేమోనని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఈ ఘటనతో స్థానిక పోలీసులు పరుగులు తీయాల్సివచ్చింది. ఆగమేఘాలపై ఆ ప్రాంతానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. గంటల తరబడి అతను టవర్‌పైనే ఉన్నట్లు డీసీపీ మాధుర్ వర్మ చెప్పారు. చివరకు అతనికి నచ్చజెప్పి భారీ క్రేన్ సాయంతో అతన్ని కిందకు దించి పీఎస్‌కు తరలించారు.