హోదా కోసం మరో నిరుద్యోగి బలి | Unemployed Suicide for special category status to ap | Sakshi
Sakshi News home page

హోదా కోసం మరో నిరుద్యోగి బలి

Published Sat, Sep 1 2018 3:24 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Unemployed Suicide for special category status to ap - Sakshi

నక్కపల్లి (పాయకరావుపేట): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మరో యువకుడు ప్రాణత్యాగం చేశాడు. ప్రత్యేక హోదా రాకపోవడమే తన చావుకు కారణమంటూ శుక్రవారం విశాఖ జిల్లాలో నిరుద్యోగి త్రినాథ్‌ సెల్‌టవర్‌ ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆత్మహత్య లేఖలో ప్రశ్నించాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే నా మరణానికి అర్థం ఉంటుంది.  మా అమ్మ నన్ను కన్నందుకు ఓ ప్రయోజనం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి రాసిన లేఖను త్రినాథ్‌ జేబులో పెట్టుకుని ప్రాణాలు వదిలాడు. 

డిగ్రీ చదివినా... 
రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్‌ (28) డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న బావ వనం నర్సింగరావు వద్ద ఉంటున్నాడు. త్రినాథ్‌ తల్లిని తీసుకుని ఏడాది క్రితం అక్కాబావల వద్దకు వచ్చాడు. పంచాయతీ పనులు చూడటం, రికార్డులు రాయడం లాంటి పనులు చేస్తూ బావకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరంతా పాయకరావుపేట మండలం నామవరంలో నివసిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇంటినుంచి వెళ్లిపోయిన త్రినాథ్‌ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై కాగిత టోల్‌గేట్‌ సమీపంలోని సెల్‌టవర్‌ వద్ద కనిపించిన త్రినాథ్‌ కొన్ని కాగితాలు పంచడంతోపాటు చేతిలో నైలాన్‌ తాడు కలిగి ఉన్నట్లు ఓ వ్యక్తి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే వారు సెల్‌ టవర్‌ వద్దకు చేరుకునేటప్పటికే త్రినాథ్‌ తాడుతో ఉరి వేసుకుని మృతి చెందాడు. త్రినాథ్‌ మృతితో తల్లి నూకరత్నం, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మృతుడి కుటుంబీకులకు వైఎస్సార్‌ సీపీ నేతల పరామర్శ
త్రినాథ్‌ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. హోదా వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడేవన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసానికి నిరుద్యోగి బలయ్యాడని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృçష్ణ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబీకులను వైఎస్సార్‌ సీపీ నేతలు పరామర్శించి సంతాపం తెలిపారు.

త్రినాథ్‌ ఆత్మహత్య లేఖ ఇదీ...
‘‘అయ్యా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి నమస్కరించి రాయునది. నేడు కేరళ వరదల్లో ఉందని  అందరూ ముందుకొచ్చి తమ సహాయాన్ని ధనరూపంలో, మాటల రూపంలో  తెలియజేస్తూ  ఆదుకుంటున్నారు. సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు సాయం చేయడం తప్పు అని నేను అనడం లేదు కానీ అంతకన్నా ఎక్కువగా కనపడని బాధితులు సార్‌  ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.  దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆదుకోమని కోరుతున్నా.  అప్పుడే నా మరణానికి ఒక అర్థం, మా అమ్మ నన్ను కన్నందుకు ప్రయోజనం ఉంటుంది. ప్లీజ్‌ సర్‌...!

అమ్మా క్షమించు...
అమ్మా నన్ను క్షమించు, నేను నిన్ను చూస్తానని ఇచ్చిన  మాట తప్పుతున్నా. ఈ ప్రపంచంలో నువ్వంటే నాకు చాలా ఇష్టం. అక్కా.. అమ్మ జాగ్రత్త. నీ పిల్లలతో ఒక చంటి పిల్లలాగా చూసుకోండి. ఇక సెలవ్‌.  అమ్మా నేను శరీరం మాత్రమే వదులుతున్నా. నా ఆత్మ నీలో ఉంటుంది. నీ సంతోషంలో ఉంటుంది. నేను మాట తప్పినందుకు క్షమించు. అక్కా.. చిన్నప్పటినుంచి నన్ను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశావు. అమ్మ జాగ్రత్త. కన్నబిడ్డలా చూసుకో. ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటా. మీరు అప్పగించిన పని మధ్యలోనే వదిలేసినందుకు క్షమించండి. మీ పట్ల తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి’’

మునికోటి నుంచి త్రినాథ్‌ దాకా..హోదా కోసం ఆత్మార్పణలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2015 ఆగస్టు 9వతేదీన తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన సందర్భంగా తీవ్ర మనస్తాపానికి గురైన మునికోటి అక్కడే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదని బంధువులు, మిత్రుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన మునికోటి ప్రాణత్యాగానికి పాల్పడ్డాడు. తిరుపతి మంచాల వీధికి చెందిన మునికోటి సమైక్య రాష్ట్ర ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాడు.

కర్నూలు జిల్లాలో లెక్చరర్‌ మృతి... 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రైవేట్‌  ఇంజనీరింగ్‌ కాలేజీ లెక్చరర్‌ గనుమాల లోకేశ్వరరావు 2015 ఆగస్టు 28వతేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. అంతకుముందు రోజు ప్రత్యేక హోదా కోసం కర్నూలులో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. మృతుడికి భార్య కృష్ణవేణి, కుమారుడు గౌతమ్‌ ఉన్నారు. 

నెల్లూరులో హోదా కోసం ఆత్మహత్య 
నెల్లూరు వేదాయపాళెంకు చెందిన రామిశెట్టి లక్ష్మయ్య (55) ప్రత్యేక హోదా కోసం చనిపోతున్నట్లు 2015 ఆగస్టు 27వ తేదీన రాసిన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఆగస్టు 28వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నెల్లూరు చేరుకుని లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హోదా కోసం చేనేత కార్మికుడి ఆత్మహత్య
ప్రత్యేక హోదా కోసం చిత్తూరు జిల్లా మదనపల్లెలో చేనేత కార్మికుడు నిమ్మన్నగారి సుధాకర్‌(29) ఈ ఏడాది జూలై 28న ప్రాణత్యాగం చేశాడు. ప్రత్యేక హోదా మన హక్కు అని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. సుధాకర్‌ తల్లిదండ్రులు రామచంద్ర, సరోజమ్మలు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతుడికి ఒక అక్క, చెల్లెలు ఉన్నారు.

టీడీపీ కార్యకర్త బలవన్మరణం 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ సానుభూతిపరుడైన పైడికొండ యానాదిరావు(47) లేఖ రాసి చనిపోయాడు. ఈనెల 16వతేదీన అదృశ్యమైన యానాదిరావు 19వతేదీన శవమై కనిపించాడు.వైఎస్సార్‌ జిల్లా రాజంపేటకు చెందిన యానాదిరావు ఎనిదేళ్ల క్రితం ఉపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement