సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు.
అంతకుముందు పార్లమెంట్‌లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment