balli Durga Prasad
-
ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. తిరుపతి, కర్నాటకలోని బెల్గాం లోక్‌సభ స్థానాలు, తెలంగాణ లోని నాగార్జునసాగర్ సహా వివిధ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ షెడ్యూల్లో తెలిపింది. ఈ ఎన్నికలకు మార్చి 23న నోటిఫికేషన్ జారీకానుంది. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్లను వినియోగించనుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉంటాయో ఆ జిల్లాలో ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గం రాష్ట్ర రాజధాని పరిధిలోగాని, మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోగానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగానీ ఉంటే ఎన్నికల నియమావళి కేవలం ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 2021 జనవరి ఒకటో తేదీ నాటికి ఖరారైన ఓటర్ల జాబితాతో ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 30–03–2021 నామినేషన్ల స్క్రూటినీ: 31–03–2021 నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 03–04–2021 పోలింగ్ తేదీ: 17–04–2021 కౌంటింగ్ తేదీ: 02–05–2021 -
ఆయన మరణం పార్టీకి తీవ్రమైన లోటు
సాక్షి, తాడేపల్లి : తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణం పార్టీకి తీవ్రమైన లోటని, పార్లమెంట్లో రాష్ట్ర ప్రజల గళం వినిపిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపిస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల బృందంలో ఒక సీనియర్ నేతను కోల్పోయామని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దుర్గాప్రసాదరావు అకాల మరణానికి చింతిస్తూ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నారాయణ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘ దుర్గాప్రసాదరావు వైఎస్సార్ సీపీ తరపున ఎంపీ అయ్యే సమయానికి ముందే మంత్రిగా, శాసన సభ్యునిగా దశాబ్దాల పాటు నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ ప్రజలకు.. అలాగే ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు కూడా సుపరిచితులు. ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు అనే సమయానికి గుండెపోటుతో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుర్గాప్రసాదరావు కుమారుడితో మాట్లాడారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఒక మంచి నాయకుడిని, సీనియర్ నాయకుడిని, దళిత నాయకుడిని, పార్లమెంట్ సభ్యుడిని కోల్పోవడం అనేది పార్టీకే కాకుండా రాష్ట్రానికి కూడా నష్టంగా భావిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామ’’న్నారు. ( ఎంపీ దుర్గాప్రసాద్ అంత్యక్రియలు పూర్తి ) మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ నెల్లూరు జిల్లా వాసిగా దాదాపు మూడు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా బల్లి దుర్గాప్రసాదరావు ప్రజలకు సేవలందించారు. ఆయన అకాల మరణం పార్టీకి, ఈ రాష్ట్రానికే కాకుండా, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు తీరని లోటు. ఒక మంచి నాయకుడు, ఎప్పుడు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి దుర్గాప్రసాదరావు. ఆ బాధ నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ..‘‘ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి, ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గొప్ప నాయకుడు దుర్గాప్రసాదరావును కోల్పోవడం పార్టీకి తీరని లోటు. అలాగే ఆ ప్రాంత ప్రజలందరూ ఆయన చేసిన సేవలను, ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఆయన కుటుంబ సభ్యులందరికి ఆ దేవుడు మనోధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ బల్లి దుర్గాప్రసాద్‌రావుకు ఘన నివాళులు అర్పిస్తున్నాము.’’ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ తిరుపతి పార్లమెంట్ సభ్యులు, రాయలసీమ జిల్లాల్లో సీనియర్ దళిత నాయకులు బల్లి దుర్గాప్రసాద్‌రావు అకాల మరణం పార్టీకి, దళిత లోకానికి తీరని లోటు. మొన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరికోరి తిరుపతి పార్లమెంట్ నుంచి బలమైన దళిత నాయకుడిని తీసుకురావాలని దుర్గాప్రసాద్‌రావును అభ్యర్థిగా నిలబెట్టారు. సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన ఆ ప్రాంతంలో దళిత హక్కులు కాపాడుతూనే ఆ ప్రాంత సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడ్డారు’’ -
ఎంపీ దుర్గాప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలో మరణించగా.. గురువారం ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కాంపాలెంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: అజాత శత్రువుగా అందరివాడయ్యారు..) ఇటీవల దుర్గాప్రసాద్ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం మూడు వారాల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్ నిర్ధారణ అవ్వగా, అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా సెప్టిసీమియా అనే వ్యాధి బారినపడ్డారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేయగా, ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ తాడేపల్లి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌రావు అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత) -
ఏపీ భవన్‌లోని బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ
-
నెల్లూరుకు దుర్గాప్రసాద్ భౌతికకాయం
సాక్షి, నెల్లూరు: బుధవారం అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూసిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు జిల్లా వెంకటగిరికి చేరుకుంది. ఆయనకు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. దుర్గాప్రసాద్ భౌతికకాయానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తనకు బల్లి దుర్గా ప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కాసేపట్లో... వెంకటగిరి పట్టణం కర్ణకమ్మవీధి నుంచి బల్లి దుర్గా ప్రసాద్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కాంపాలెం ప్రాంతంలోని తోటలో బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి. పలువురు నివాళులు.. అనారోగ్యంతో మరణించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతికకాయానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ఢిల్లీ బాబు, వెంకటేశ్వర రావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. -
దుర్గాప్రసాద్ మృతి వ్యక్తిగతంగా లోటు..
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో గురువారం ఉదయం బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య, ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి తదితరులు అంజలి ఘటించారు. (అజాత శత్రువుగా అందరివాడయ్యారు..) వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ‘బల్లి దుర్గాప్రసాద్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిసారి నా ఆశీస్సులు తీసుకునేవారు. ఆయన కుటుంబానికే కాదు, నాకు కూడా ఈ మరణం వ్యక్తిగతంగా లోటు. పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారు.’ అని తెలిపారు. (తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత ) ఆయన భోళా మనిషి ‘బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారు. ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటు’ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సహచర ఎంపీ దుర్గాప్రసాద్ మరణం అందరినీ ఎంతో బాధించిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. -
అజాత శత్రువుగా అందరివాడయ్యారు..
బల్లి దుర్గాప్రసాద్ సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎవరినీ నొప్పించక మెప్పించి అజాత శత్రువుగా అందరివాడయ్యారు. చిరునవ్వుతో మంచి తనంతో మమతానుబంధాలను పెనవేసుకున్నారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్ సభ్యుడిగా నిష్క్రమించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పార్లమెంట్ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ప్రజాసేవకే జీవితం అంకితం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రజాక్షేత్రంలో నిలబడి.. వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, తిరుపతి : తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత బల్లి దుర్గాప్రసాద్ బుధవారం సాయంత్రం ప్రజా క్షేత్రం నుంచి నిష్క్రమించారు. రాజకీయంగా వివాద రహితుడిగా పేరున్న దుర్గాప్రసాద్ నాలుగు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో మచ్చలేని నేతగా కొనసాగారు. నాలుగు పర్యాయాలు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక నేతగా ఖ్యాతి గడించారు. స్వస్థలం వెంకటగిరి అయినప్పటికీ రాజకీయ ప్రస్థానమంతా గూడూరులోనే సాగడం గమనార్హం. ఆయన తిరుపతికి వస్తే తన సన్నిహితులను తప్పక కలిసేవారు. ఎస్వీయూ ప్రొఫెసర్ దామోదరరెడ్డితో పలువురు అధ్యాపకులతో స్నేహంగా ఉండేవారు. మిత్రులను చాలా అభిమానంగా చూసేవారు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించేవారు. దుర్గాప్రసాద్‌కు ఏర్పేడు మండలం పల్లం గ్రామానికి చెందిన భక్తవత్సలనాయుడు మంచి స్నేహితుడు. ఆయన అనారోగ్యానికి గురై స్విమ్స్‌లో చేరిన విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ‘‘వాడికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆస్పత్రి నుంచి వెళ్లనివ్వకండి’’ అంటూ చెప్పినట్లు ఆయన స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు భార్య సరళమ్మ, కుమారులు బల్లి కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. కుమారుడు కల్యాణ్ తండ్రికి రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. రాజకీయ ప్రస్థానం ఇలా.. 1985లో గూడూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా 22,224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత 1989లో గూడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1994లో గూడూరు నుంచే 28,350 ఓట్ల మెజార్టీతో గెలుపొంది 1996–98 మధ్య కాలంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో 9,770 ఓట్లతో గెలుపొందారు. 2004లో టీడీపీ టికెట్ నిరాకరించినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. 2009లో పోటీచేసి 10,638 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఎంపీగా తిరుపతితో పాటు గూడూరు, వెంకటగిరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నించారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ దివంగత మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో గూడూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీ అడుగుపెట్టారు. అక్కడి నుంచి గూడూరు కేంద్రంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తుది శ్వాస విడిచే వరకు క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన స్వస్థలం వెంకటగిరిలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు (63) బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో చికిత్స కోసం మూడు వారాల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్ నిర్ధారణ అయిందని, అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా సెప్టిసీమియా అనే వ్యాధి బారినపడ్డారని అపోలో ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, బర్డ్ (తిరుపతి) డైరెక్టర్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేశారని, ఈ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని చెప్పారు. దుర్గాప్రసాదరావు ఆస్పత్రిలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అపోలో వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితులు, మెరుగైన వైద్య విషయంలో నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. కాగా, దుర్గాప్రసాదరావు అంత్యక్రియలు గురువారం ఆయన స్వస్థలం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరగనున్నాయి. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. దుర్గాప్రసాదరావుకు భార్య సరళమ్మ, కుమారులు కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో తొలిసారిగా గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గూడూరు నుంచే మొత్తం నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి 2,28,376 ఓట్ల భారీ మెజార్టీతో తిరుపతి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ సంతాపం దుర్గాప్రసాదరావు మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పనిచేశారని, ఆయన కుంటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ.. ‘దుర్గాప్రసాదరావు ఏపీ ప్రగతికి చాలా కృషి చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను’ అని ట్వీట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీలు, మంత్రులు, ప్రముఖుల సంతాపం ఎంపీ దుర్గాప్రసాదరావు మృతిపై వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, కళత్తూరు నారాయణస్వామి సంతాపం తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్ టీఎస్ విజయ్ చందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. నేడు సంతాపసభలు ఎంపీ మృతికి సంతాపం తెలిపేందుకు గురువారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్లో, ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణవార్త తెలిసిన వెంటనే దుర్గాప్రసాదరావు కుమారుడు కళ్యాణ్‌కి సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘‘దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. 4 దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి
-
వైఎస్సార్ సీపీ ఎంపీ మృతి; ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. కాగా ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న ఆయనకు బుధవారం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.(చదవండి: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత) ఆయన సేవలు చిరస్మరణనీయం: ఉపరాష్ట్రపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారు దివంగతులయ్యారని తెలిసి తీవ్రంగా విచారించాను. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. 28 ఏళ్ళ వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటేరియన్ గా, నాలుగు పర్యాయాలు గూడూరు శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా వారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీ దుర్గా ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’అని ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: ఓం బిర్లా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ‘‘తిరుపతి (ఆంధ్రప్రదేశ్) లోక్ సభ ఎంపీ శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారి విషాదకరమయిన మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓం శాంతిః’’ అని తెలుగులో ట్వీట్ చేశారు. గవర్నర్ సంతాపం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా, ప్రాథమిక విద్యామంత్రిగా ఆయన ఎనలేని సేవ చేశారన్నారు. ఎంపీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి లోక్‌సభ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజా సేవలో అవిరళ కృషి చేసిన ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి
సాక్షి, చెన్నై: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బల్లి దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2,28,376 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీఎం జగన్ సంతాపం బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో ఫోన్లో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మరణం తీరని లోటు: భూమన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ‘ఆయన మంచి మేధావి. రెండు దశబ్దాలుగా ప్రజా జీవితంలో వున్నారు. ఎప్పుడు ప్రజల కోసం పరితపిస్తుంటారు. ఆయన మృతి తీరని లోటు. తిరుపతి అభివృద్ధిలో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చెదరని ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని సంతాపం ప్రకటించారు. బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం కలచివేసిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి నేతను కోల్పోయాం: ఎమ్మెల్యే కాకాణి దుర్గాప్రసాద్ మరణంతో మంచి నేతను జిల్లా కోల్పోయిందని నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గూడూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారని గుర్తు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాకాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, రెడ్డప్ప, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. -
చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు
-
ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే..
సాక్షి, తిరుపతి: ప్రాణం ఉన్నంత వరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు మీడియా ఇంత దారుణంగా వ్యవహరించలేదని.. ఎల్లో మీడియా ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో నాటకాలు ఆడిస్తూ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారుపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్) చదవండి: భావోద్వేగానికి లోనైన మంత్రి పేర్ని నాని -
‘చంద్రబాబుకు ఆ అర్హత లేదు’
సాక్షి, చిత్తూరు : ఇకపై ప్రజలు కరోన మహమ్మరితో సహజీవనం చేస్తూనే తగు జాగ్రత్తలతో దైనందిత జీవనం సాగించాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాకొన్న చంద్రబాబుకు పాలక ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గురువారం నాడు-నేడు పై కమిషనర్ గిరీషాతో కలసి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అధికారులతో సమీక్షించారు. (భానుడి ప్రతాపం: తీసుకోవలసిన జాగ్రత్తలు ) కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను కేంద్రం సైతం కొనియాడుతున్నదని ఎంపీ చెప్పారు. ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం కరోనాకు భయపడి పక్క రాష్ట్రంలో దాక్కోని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా వైరస్ కట్టడికి ఎంపీ నిధుల నుంచి తిరుపతికి 50 లక్షలు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటకు 25 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. నాడు నేడుపై చేపడుతున్న పనులు రాష్ట్ర చరిత్రలో నిలచి ఉంటాయని అన్నారు. (మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది ) -
‘తిరుపతికి ఏం చేశాడో సమాధానం చెప్పాలి’
సాక్షి, తిరుపతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడుని ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ తీరులతో ఇప్పటికే టీడీపీ ఖాళీ అయిపోయిందని అన్నారు. వైఎస్ జగన్ అశేష ప్రజానీకం ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుడని, చంద్రబాబు కనీసం పోరాట పటిమ లేని నాయకుడని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఆపడానికి అనేక దారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఒక్క తిరుపతి నగరంలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి పదేళ్ళ పైబడిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రజా సంక్షేమం.. అన్నిటినీ బాబు అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. (‘బాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు’ ) చంద్రబాబు మొదట తన పార్టీని రక్షించుకోవడం పై దృష్టి సారించాలని ఎంపీ హితవు పలికారు. సీఎం జగన్ తొమ్మిదేళ్ళ పాలన చూసిన చాలా మంది వైఎస్సార్సీపీలో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. తిరుపతి నా హక్కు అనే బాబు తిరుపతికి ఏమి చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీ గల అధికారులపై కక్ష్య సాధింపుకు దిగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి నమ్మకం ఉందని, న్యాయస్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఆర్జిఎస్ నిధులు నిలిపి వేయడానికి పన్నాగం పొందాడని విమర్శించారు. సొంత జిల్లాలో ఉనికిని కోల్పుతున్నాడు అనే గుబులుతో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.(సీఏఏ బిల్లు పేపర్లు చించేసిన ఎమ్మెల్యే) ‘వైఎస్సార్ విగ్రహం ధ్వంసం; శ్రీరామ్ అంగీకరించారు’ -
రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు
సాక్షి, నాయుడుపేట: తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమానవ వనరులశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పాలచ్చూరులో, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలో రెండు కేంద్రీయ విద్యాలయాలను వచ్చే విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుకెళ్లి మంజూరుకా కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. -
మేము ఉడుత పిల్లలం కాదు... పులి పిల్లలం..
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బురద జల్లడం మానుకోవాలని అనంతపురం వైఎస్సార్ సీపీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుజనా చౌదరి మోసాలపై ఏడాది కిందట బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుజనా చరిత్ర బీజేపీ నేతలే బయటపెట్టారని, పార్టీ మారినా ఆయన టీడీపీకి మేలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఉలిక్కి పడటానికి మేము ఉడుత పిల్లలం కాదు...పులి పిల్లలం. సుజనా నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. వార్డు మెంబర్‌గా గెలవని నువ్వు..మాపై విమర్శలా?. బ్యాంకులకు కన్నాలు వేయడమే నీ పని’ అని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. టీడీపీ టచ్ అందరికీ ప్రమాదం.. విరాళాలు ఇచ్చి ఎంపీ పదవి కొనుకున్న సుజనా చౌదరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదని ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకులు లూటీ చేసిన నీకు రాజ్యాంగంపై నమ్మకం ఉందా?. డొల్ల కంపెనీలు పెట్టి బ్యాంకుల డబ్బు తీసుకు వెళ్లిన దొంగ. పారదర్శకత, జవాబుదారితనం పాలన అందిస్తున్న నేత వైఎస్ జగన్. టీడీపీ భవిష్యత్ సర్వ నాశనం చేసినవారిలో సుజనా చౌదరి నెంబర్ వన్. సుజనా చౌదరి మేక్ ఇన్ ఇండియా కాదు...స్పాయిల్ ఆఫ్ ఇండియా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చైర్మన్ పదవులు, రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన సీఎం జగన్‌ది. వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ నేతలు బీజేపీ పంచన చేరుతున్నారు. మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారు. కలిసి కష్టాలు పంచుకున్నాం. ఆయనతో మేము ఉంటున్నాం. టీడీపీ టచ్ తగిలి కాంగ్రెస్ సర్వ నాశనం అయింది. తెలుగుదేశం పార్టీ టచ్ అందరికీ ప్రమాదమే’ అంటూ ఎంపీ విమర్శలు గుప్పించారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ సుజనా చంద్రబాబు ఏజెంట్... ఎంపీ సుజనా చౌదరిని నమ్ముకుంటే కుక్కను పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. యూనివర్సిటీ భూములను అమ్మినట్లు నిరూపించకపోతే సుజనా పార్లమెంట్ వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇంగ్లీష్ విద్యను దూరం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఊరికే అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. పార్టీ మారిన సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబు ఏజెంట్ అని అన్నారు. టీడీపీ ఎందుకు మాట్లాడం లేదు.. కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యవతి సూటిగా ప్రశ్నించారు. ప్రజలంతా ఇంగ్లీష్ మీడియం కావాలని అంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంగ్లీష్ మీడియం కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారని, అలా అని తెలుగు భాషను ప్రభుత్వం విస్మరించడం లేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే మూల్యం తప్పదని ఆమె అన్నారు. తెలుగు భాష గురించి మాట్లాడిన వాళ్లు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారా అని, సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత సుజనా చౌదరికి లేదని అరకు ఎంపీ మాధవి పేర్కొన్నారు. -
హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. అంతకుముందు పార్లమెంట్లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. -
టికెట్ దక్కేనా !
వలస నేతలకు ప్రాధాన్యంపై కినుక దుర్గాప్రసాద్, పరసా ఆశలన్నీ మూడో జాబితాపైనే నెల్లూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నంకు పార్టీలో ప్రాధాన్యం కొరవడినట్టుంది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌లో కొనసాగి వచ్చిన నేతలకు టీడీపీ టికెట్లు ఖరారవగా, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వీరికి తొలి రెండు జాబితాల్లో చోటు దక్కలేదు. ఈ క్రమంలో వీరిద్దరికీ టికెట్లు లభించేది అనుమానమేనని టీడీపీ సీనియర్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఈ రోజు సమాచారం కాదని, ఆరు నెలలుగా పార్టీలో ఇదే మాట వినిపిస్తోందని చెబుతున్నారు. అయితే టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న చంద్రబాబు జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను కేటాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయ న ప్రకటించిన తొలి జాబితాలో కావలి శాసనసభ్యుడైన బీద మస్తాన్‌రావుకు చోటు లభించింది. రెండో జాబితాలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి(ఎంపీ అభ్యర్థి) ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన దుర్గా ప్రసాద్, పరసా వెంకటరత్నం పేర్లు రెండు జాబి తాల్లో కనిపించకపోవడంతో వారితో వారి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు.