సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో గురువారం ఉదయం బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య, ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి తదితరులు అంజలి ఘటించారు. (అజాత శత్రువుగా అందరివాడయ్యారు..)
వ్యక్తిగతంగా నాకు తీరని లోటు..
ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ‘బల్లి దుర్గాప్రసాద్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిసారి నా ఆశీస్సులు తీసుకునేవారు. ఆయన కుటుంబానికే కాదు, నాకు కూడా ఈ మరణం వ్యక్తిగతంగా లోటు. పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారు.’ అని తెలిపారు. (తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత )
ఆయన భోళా మనిషి
‘బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారు. ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటు’ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సహచర ఎంపీ దుర్గాప్రసాద్ మరణం అందరినీ ఎంతో బాధించిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment