
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. తిరుపతి, కర్నాటకలోని బెల్గాం లోక్‌సభ స్థానాలు, తెలంగాణ లోని నాగార్జునసాగర్ సహా వివిధ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ షెడ్యూల్‌లో తెలిపింది.
ఈ ఎన్నికలకు మార్చి 23న నోటిఫికేషన్ జారీకానుంది. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్లను వినియోగించనుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉంటాయో ఆ జిల్లాలో ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గం రాష్ట్ర రాజధాని పరిధిలోగాని, మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోగానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగానీ ఉంటే ఎన్నికల నియమావళి కేవలం ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 2021 జనవరి ఒకటో తేదీ నాటికి ఖరారైన ఓటర్ల జాబితాతో ఎన్నిక నిర్వహించనున్నారు.
ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 30–03–2021
నామినేషన్ల స్క్రూటినీ: 31–03–2021
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 03–04–2021
పోలింగ్ తేదీ: 17–04–2021
కౌంటింగ్ తేదీ: 02–05–2021