సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్‌ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్‌సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది.
అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్‌సీపీకే..
ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది.
దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్‌సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు.
ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు..
మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్‌సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment