![Ap Speaker Decision On The Disqualification Of Mlas - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/30/Ysrcp-And-Tdp-Rebel-Mlas-May-Appear.jpg.webp?itok=F9wjfGSH)
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ జరిపారు. నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు.
కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్‌లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment