Speaker decision
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడే తీర్పు.?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ జరిపారు. నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
సుప్రీంకు చేరిన కర్ణాటకం
న్యూఢిల్లీ: శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం అత్యవసర విచారణకు వచ్చేలా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కావాలనే తమ రాజీనామాలను ఆమోదించడం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్లో ఆరోపించారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా తమను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్‌ను నిరోధించాలని కూడా వారు కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు పిటిషన్ సమర్పించిందని వారు పేర్కొన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. రాజ్యసభలో రభస కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో వరసగా రెండో రోజు బుధవారం కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.భోజన విరామం తర్వాత బడ్జెట్‌పై చర్చ మొదలవగానే కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్ నేత చిదంబరం ఈ గొడవ కారణంగా మాట్లాడలేకపోయారు. గందరగోళం మధ్య చర్చించలేమంటూ సమాజ్‌వాదీ ఎంపీలు వాకౌట్ చేశారు. గందరగోళం కారణంగా సభ మూడు సార్లు వాయిదా పడింది. తర్వాత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకుని గురువారం బడ్జెట్‌పై చర్చను కొనసాగించాలని నిర్ణయించారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రకటించారు. -
స్పీకర్ నిర్ణయమే కీలకం!
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఆస్తకికర పరిణామాలు సోమవారం చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు రేపు అసెంబ్లీకి రానుంది. తనకు అందిన బిల్లును శాసనసభాపతి సభ ముందు పెట్టే అవకాశం ఉంది. సభా వ్యవహారాల సలహా సంఘం కూడా రేపు సమావేశంమై బిల్లుపై సభలో ఎప్పుడు చర్చ జరగాలనే అంశం ఖరారు చేస్తుంది. ఒక వైపు బిల్లుపై రేపే చర్చ జరగాలని టిఆర్ఎస్ పట్టుబడుతోంది. మరోవైపు సమైక్య తీర్మానంపై సభలో ఓటింగ్ జరిగిన తర్వాతే విభజన బిల్లుపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రరెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌తో ఇతర పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకీభవిస్తున్న నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణ బిల్లు విషయమై రేపటి అసెంబ్లీ సమావేశాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. బిల్లును వెంటనే సభలో పెట్టి చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబడతారు. తామిచ్చిన సమైక్య తీర్మానం నోటీసుపై చర్చించి ఓటింగ్ జరపాలని వైఎస్ఆర సిపి ఎమ్మెల్యేలు కూడా అంతే గట్టిగా డిమాండ్ చేస్తారు. శుక్రవారం జరిగిన సమావేశాలలో ఆ పార్టీ సభ్యుల డిమాండ్‌తో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఏకీభవించి స్పీకర్ పోడియంను చుట్టు ముట్టడంతో సభలో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఇరు ప్రాంత ఎమ్మెల్యేల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. సోమవారం కూడా సభలో ఇదేరకమైన ప్రతిష్టంభన కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంచనా. విభజన బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెడతారని, బిల్లు ప్రతులను సభ్యులందరికీ అందచేస్తారని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. విభజన బిల్లుపై స్పీకర్ ప్రకటన చేయగానే బీఎసీ సమావేశానికి తాము పట్టుబడతామని, బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తామని తెలంగాణ మంత్రులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అంటున్నారు. సభ అనుమతి లేకుండా విభజన బిల్లును ఎలా చర్చిస్తారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తోంది. సభలో సమైక్య తీర్మానం చేయాల్సిందేనని, తామిచ్చిన ప్రైవేటు మెంబర్ తీర్మానంపై చర్చ, ఓటింగ్ చేపట్టాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌తో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకీభవిస్తుండడంతో సమైక్య తీర్మాన అంశం ప్రాధాన్యత సంచరించుకుంది. సోమవారం కూడా సమైక్య తీర్మానంపై సభను స్తంభింపచేయడానికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ఎమ్మెల్యేల పోటాపోటీ డిమాండ్లపై స్పీకర్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తీసుకునే నిర్ణయమే కీలకం అవుతుందని సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు . విభజన బిల్లును సభలో ఎప్పుడు చర్చకు చేపట్టాలి, ఎన్ని రోజులు చర్చ జరపాలి, మాట్లాడేందుకు ఏ పార్టీ సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలనే అంశాలను ఖరారు చేసేందుకు స్పీకర్ బీఏసీ సమావేశాన్ని ఏర్పాలు చేస్తారు. విభజన బిల్లు ప్రతులు ఇంగ్లిష్‌లోనే ఉండడంతో వాటిని తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించడానికి కొన్ని రోజులు పడుతుందని సమాచారం. బిల్లు తెలుగు ప్రతులు అందుబాటులోకి వచ్చాకే వాటిపై చర్చించడానికి వీలుంటుందనేది ఎమ్మెల్యేల అభిప్రాయం. బిల్లులోని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే వాటిపై తాము సభలో మాట్లాడగలుగుతామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు సభలో చర్చకు రావడానికి వారం రోజులైనా పడుతుందనేది సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయం.