స్పీకర్ నిర్ణయమే కీలకం!
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఆస్తకికర పరిణామాలు సోమవారం చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు రేపు అసెంబ్లీకి రానుంది. తనకు అందిన బిల్లును శాసనసభాపతి సభ ముందు పెట్టే అవకాశం ఉంది. సభా వ్యవహారాల సలహా సంఘం కూడా రేపు సమావేశంమై బిల్లుపై సభలో ఎప్పుడు చర్చ జరగాలనే అంశం ఖరారు చేస్తుంది. ఒక వైపు బిల్లుపై రేపే చర్చ జరగాలని టిఆర్ఎస్ పట్టుబడుతోంది. మరోవైపు సమైక్య తీర్మానంపై సభలో ఓటింగ్ జరిగిన తర్వాతే విభజన బిల్లుపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రరెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్తో ఇతర పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకీభవిస్తున్న నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలంగాణ బిల్లు విషయమై రేపటి అసెంబ్లీ సమావేశాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. బిల్లును వెంటనే సభలో పెట్టి చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబడతారు. తామిచ్చిన సమైక్య తీర్మానం నోటీసుపై చర్చించి ఓటింగ్ జరపాలని వైఎస్ఆర సిపి ఎమ్మెల్యేలు కూడా అంతే గట్టిగా డిమాండ్ చేస్తారు. శుక్రవారం జరిగిన సమావేశాలలో ఆ పార్టీ సభ్యుల డిమాండ్‌తో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఏకీభవించి స్పీకర్ పోడియంను చుట్టు ముట్టడంతో సభలో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఇరు ప్రాంత ఎమ్మెల్యేల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. సోమవారం కూడా సభలో ఇదేరకమైన ప్రతిష్టంభన కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంచనా.
విభజన బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెడతారని, బిల్లు ప్రతులను సభ్యులందరికీ అందచేస్తారని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. విభజన బిల్లుపై స్పీకర్ ప్రకటన చేయగానే బీఎసీ సమావేశానికి తాము పట్టుబడతామని, బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తామని తెలంగాణ మంత్రులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అంటున్నారు.
సభ అనుమతి లేకుండా విభజన బిల్లును ఎలా చర్చిస్తారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తోంది. సభలో సమైక్య తీర్మానం చేయాల్సిందేనని, తామిచ్చిన ప్రైవేటు మెంబర్ తీర్మానంపై చర్చ, ఓటింగ్ చేపట్టాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌తో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకీభవిస్తుండడంతో సమైక్య తీర్మాన అంశం ప్రాధాన్యత సంచరించుకుంది. సోమవారం కూడా సమైక్య తీర్మానంపై సభను స్తంభింపచేయడానికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.
ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ఎమ్మెల్యేల పోటాపోటీ డిమాండ్లపై స్పీకర్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తీసుకునే నిర్ణయమే కీలకం అవుతుందని సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు . విభజన బిల్లును సభలో ఎప్పుడు చర్చకు చేపట్టాలి, ఎన్ని రోజులు చర్చ జరపాలి, మాట్లాడేందుకు ఏ పార్టీ సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలనే అంశాలను ఖరారు చేసేందుకు స్పీకర్ బీఏసీ సమావేశాన్ని ఏర్పాలు చేస్తారు. విభజన బిల్లు ప్రతులు ఇంగ్లిష్‌లోనే ఉండడంతో వాటిని తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించడానికి కొన్ని రోజులు పడుతుందని సమాచారం. బిల్లు తెలుగు ప్రతులు అందుబాటులోకి వచ్చాకే వాటిపై చర్చించడానికి వీలుంటుందనేది ఎమ్మెల్యేల అభిప్రాయం. బిల్లులోని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే వాటిపై తాము సభలో మాట్లాడగలుగుతామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు సభలో చర్చకు రావడానికి వారం రోజులైనా పడుతుందనేది సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయం.