అధిష్టానం తీరుపై గాదె కన్నీరు
బాపట్ల : 'సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించి తీర్మానం చేస్తే ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టుకుని ఆమోదించాలని చూస్తున్నారు. ఇది అప్రజాస్వామిక నిర్ణయం. ఈ విధమైన నిర్ణయాలు అమలు చేసేవారు ఎంతటివారైనా కష్టాలు కొనితెచ్చుకున్నట్లే' అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి భావోద్వేగాలనికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సవరిస్తే గానీ అసెంబ్లీలో వ్యతిరేకించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలు లేదన్నారు.
శాసనసభ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం అప్రజాస్వామిక విధానమన్నారు. అదే విధంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడాన్ని రాజ్యంగం ఒప్పుకోదన్నారు. తెలంగాణ కావాలని కోరుతున్న వారి సంఖ్య చాలా తక్కువని చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్ని నివేదికలు సేకరించినా అవి మొత్తం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని సూచించాయని గాదె వివరించారు. వాటిని తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ విభజన వ్యవహారం తెరపైకి తీసుకు రావటం భావ్యం కాదన్నారు.