
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్‌లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్‌లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?..

ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్‌లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది.
ఎంతవరకు సురక్షితం?
ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్‌లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.

అలాంటప్పుడు ఏం చేయాలంటే..
వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్‌లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్‌లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.