Artificial Intelligence (AI)
-
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ను ఊహిస్తోంది.ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్‌లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్‌ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్‌ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్‌ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్‌జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్‌కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్‌లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్‌లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్‌లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్‌తో జరుగుతున్న సైబర్‌నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్‌బాట్ కాదు, లైఫ్‌లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్‌లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్‌లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్‌లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
AI గర్ల్ తో కొత్త లవ్ స్టోరీ
-
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్‌బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
భాష లోకల్.. ర్యాగ్తో గ్లోబల్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి దాకా పోగేసింది రూ.లక్ష. దాన్ని రెట్టింపు చేయాలనుంది. మనసులోని ఈ మాటను ‘చాట్ జీపీటీ’కి చెప్పడమే ఆలస్యం.. రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకూ చేయగల బిజినెస్ ప్రోగ్రాం రెడీ చేసి పెడుతుంది. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు గోండు భాషలో మాట్లాడితే.. అమెరికాలో ట్రంప్ విని అవలీలగా అర్థం చేసుకునేలా మారిపోతుంది. అమెరికా, ఆఫ్రికా వాళ్లు ఏ భాషలో మాట్లాడినా.. మనకు తెలుగులోనే వినిపిస్తుంది. మనం తెలుగులో మాట్లాడుతుంటే.. వాళ్లకు అర్థమయ్యే భాషలో వారికి వినిపిస్తుంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన, సృష్టించబోతున్న ఇలాంటి అద్భుతాలు ఎన్నో. ఏఐ సృష్టించే కొత్త భాషతో మారుమూల ప్రాంతాల్లోని వారి మనోగతంతో సహా విశ్లేషించే టెక్నికల్ టూల్‌ను చూడబోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్న ఆ టూల్.. ‘రిట్రైవల్–అగ్మెంటెడ్ జనరేషన్ (ర్యాగ్)’. ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే (632 బిలియన్ డాలర్లు) ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్‌కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఏంటీ దీని ప్రత్యేకత? మన దేశంలోని మారుమూల పల్లెలో మాట్లాడే స్థానిక భాషను అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకునేలా చేయగల సత్తా ర్యాగ్ టూల్స్‌కు ఉంటుంది. కొన్ని వేల భాషలను, కోట్ల కొద్దీ పదాలను అత్యంత వేగంగా విశ్లేíÙంచగలవు. కృత్రిమ మేధలోని డీప్ లెరి్నంగ్ సాంకేతికతను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి ఈ టూల్స్‌ను రూపొందించినట్టు నిపుణులు చెప్తున్నారు.ఉదాహరణకు కొన్ని పోలికలతో వధువు కావాలని జీపీటీలో సెర్చ్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా సరిపోయే వ్యక్తులు, వారి అలవాట్లు, వారి హావభావాలతో చిత్రాలను అందిస్తుంది. సీ, సీ ప్లస్ ప్లస్, డెవాబ్స్ వంటి అనేక కంప్యూటర్ కోడింగ్ భాషలున్నాయి. ర్యాగ్ టూల్స్ క్షణాల్లోనే ఆ భాషల్లో కోడింగ్స్ రాయగలవు. కాల్ సెంటర్లలో కొన్ని వేల మంది చేసే పనిని ఒక్క ర్యాగ్ టూల్‌తో సాధించవచ్చు. కంపెనీల ఆడిట్ రిపోర్టులు, అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యాపార లింకులు వంటి పనులెన్నో ర్యాగ్తో ఇట్టే ముగించే వీలుంది. ఉపాధికి దెబ్బపడుతుందా? సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి ‘ర్యాగ్’ టూల్స్‌తో చాలెంజ్ అనే చెప్పాలని నిపుణులు అంటున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగాల నుంచి కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా ఉపాధి తగ్గుతుందని.. కార్యాలయాల్లో పనిచేసే పద్దతులు మారిపోతాయని చెప్తున్నారు. ఎక్కడో ఉండి మరెక్కడో కంపెనీని నడిపే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు. పోటీ పడితేనే అవకాశాలు.. మన దేశంలో ఏటా 24 లక్షల మంది టెక్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వారిలో కేవలం 8 శాతం మందికే తగిన స్కిల్స్ ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు ర్యాగ్తో పోటీ పడి, అంతకన్నా మెరుగైన ఆలోచనతో పనిచేసే వారికే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఏఐతో పోటీపడే తెలివితేటలు ఉంటే తప్ప, కొత్తగా, భిన్నంగా ఆవిష్కరించే సత్తా ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టమేనని పేర్కొంటున్నాయి. ఏఐతో పోటీ పడితేనే రాణించగలం చాట్ జీపీటీ సహా ఏఐ ప్రయోగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో ‘ర్యాగ్’ సాంకేతికత మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డీప్ లెరి్నంగ్‌లో భాగంగా దీనిపై విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఇక మీదట ఏఐతో పోటీపడి, క్రియేటివిటీని రుజువు చేసుకుంటేనే సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్ ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్‌కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి
-
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్‌పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్‌బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్‌ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్‌లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ కావాలి
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రి మేధ(ఏఐ)ని ఉపయోగించుకొనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొనే అంశంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొనే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్–డబ్ల్యూటీఎస్ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను మోదీ ప్రారంభించారు.డిజిటల్ సాంకేతికత విషయంలో నిబంధనల ఆధారిత ఫ్రేమ్‌వర్క్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు కేవలం వ్యక్తిగత భద్రత, టెక్నాలజీ సంస్థల పారదర్శకతకే కాదు, అంతర్జాతీయ డేటా ప్రవాహంపై ఆధారపడి ఉన్న వాణిజ్యం, వస్తు సేవలకు సైతం కీలకమేనని ఉద్ఘాటించారు. సైబర్ మోసాల నుంచి ఏ ఒక్క దేశమూ ఒంటరిగా తమ ప్రజలకు రక్షణ కలి్పంచలేదని అభిప్రాయపడ్డారు.అందుకే అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అంతర్జాతీయ సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా 40 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విషయంలో తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
ప్రపంచానికి సవాల్ విసురుతోన్న కృత్రిమ మేథ
-
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ఏఐ గ్లోబల్ మార్కెట్ @ 990 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) ఉత్పత్తులు, సరీ్వసుల మార్కెట్ ఏటా 40–55% మేర వృద్ధి చెందనుంది. 2027 నాటికి 780 బిలియన్ డాలర్లు–990 బిలియన్ డాలర్ల స్థాయి వరకు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో సరఫరా, డిమాండ్‌పరమైన సమస్యల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలికంగా ఏఐ మార్కెట్ వృద్ధి పటిష్టంగానే ఉండనుంది. బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏఐకి విస్తృతంగా కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరమవుతాయి కాబ ట్టి వచ్చే ఐదు నుంచి పదేళ్లలో డేటా సెంటర్ల స్థాయి కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతమున్న 50–200 మెగావాట్ల సామర్థ్యం నుంచి గిగావాట్ స్థాయికి డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతుందని నివేదిక వివరించింది. ప్రస్తుతం భారీ డేటా సెంటర్ల వ్యయం 1 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఉండగా ఏఐ కారణంగా అయిదేళ్ల తర్వాత ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. అలాగే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కి (జీపీయూ) సైతం డిమాండ్ 30 శాతానికి పైగా పెరుగుతుందని వివరించింది. సెమీకండక్టర్లకు కొరత: ఈ పరిణామాలన్నింటి వల్ల సెమీకండక్టర్లకు కొరత ఏర్పడవచ్చని నివేదిక తెలిపింది. ఒకవేళ జీపీయూలకు డిమాండ్ రెట్టింపైతే కీలక విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు ఉత్పత్తిని రెట్టింపు చేస్తే సరిపోవచ్చు, కానీ సెమీకండక్టర్ల తయారీ సంస్థలు మాత్రం ఉత్పత్తి సామర్థ్యాలను మూడింతలు పెంచుకోవాల్సి వస్తుందని వివరించింది. భారీగా వృద్ధి చెందుతు న్న కృత్రిమ మేథ కారణంగా టెక్నాలజీ రంగంలో గణనీయంగా మార్పులు వస్తాయని పేర్కొంది. చిన్న స్థాయి క్లౌడ్ సరీ్వస్ ప్రొవైడర్లు, సాఫ్ట్వేర్ వెండార్లు తదితర విభాగాల్లోనూ కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఏఐని వినియోగించుకోవడం, డేటా ఆధునీకరణ కోసం కస్టమర్లకు అంతగా అవసరమైన నైపుణ్యాలు, అనుభవం లేనందున మధ్యకాలికంగా టెక్ సర్వీసులకు డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొంది. అయితే, క్రమంగా చాలా మటుకు టెక్ సరీ్వసుల స్థానాన్ని సాఫ్ట్వేర్ భర్తీ చేస్తుందని వివరించింది. -
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇండియా ఏఐ ఫెలోషిప్: అర్హతలు ఇవే..
అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ స్కాలర్ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్‌గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.పీహెచ్డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్‌ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
ఏఐతో పాటలు
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్ లవ్... ఐ వాంట్ లవ్...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ) యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. -
కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, కొత్త అర్థాన్ని కనుక్కోవడం, అనుభవం నుంచి నేర్చుకోవడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామమన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. పంటలు ఎలా పండిస్తే లాభమో చెబుతుంది. పిల్లలకు లెక్కలు (మ్యాథమెటిక్స్) సులభంగా నేర్పిస్తుంది. మన రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా. చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తాయని చెబుతున్నారు. ఇంటి అవసరాల నుంచి పంట పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే ఏఐ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. రోబోటిక్స్, మెషిన్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్‌ఫారాలు రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. – సాక్షి, అమరావతిపెరుగుతున్న వినియోగం.. అవగాహన ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే.. మరో పక్క స్కూల్ స్థాయి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇంకో వైపు భారత ప్రభుత్వం కనీసం 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ) ఉన్న ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెడుతుందని ఇటీవల జరిగిన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్–2024లో ప్రకటించింది.గతేడాది ఏప్రిల్‌లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘వార్షిక ఏఐ ఇండెక్స్’ ప్రకారం 2022లో ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందించే స్టార్టప్‌లు 3.24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని.. దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలను సైతం అధిగమించాయని పేర్కొంది. మనకంటే ముందు యూఎస్, చైనా, యూకే, ఇజ్రాయిల్ మాత్రమే ఉన్నట్టు వివరించింది. భారతదేశంలోని ఏఐ స్టార్టప్‌లు 2013 నుంచి 2022 వరకు మొత్తం 7.73 బిలియన్ డాలర్లు పొందగా, కేవలం 2022 ఏడాదిలోనే దాదాపు 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. 2028 నాటికి ఇది 20 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది. ఏఐ పరిశోధకులు, కంపెనీలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను స్థాపించనున్నారు. దీంతో పాటు ఏఐ స్కిల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభ దశలో ఏఐ, డీప్ టెక్నాలజీకి అవసరమైన నిధులను కేంద్రం అందించనుంది. దీని ద్వారా టెక్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. బలమైన జాబ్ మార్కెట్ ఇలా» గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మన దేశ ప్రాధాన్యం పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టే దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ మార్కెట్ వృద్ధి చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తో పాటు బహుళ జాతి కంపెనీల్లో ఏఐ టెక్ నిపుణులకు అవకాశాలు భారీగా ఉన్నాయి. » మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి ఏఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ వల్ల తాజా గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ డైనమిక్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకటి కచ్చితంగా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ రంగాలకు చెందినదై ఉంటుందని చెబుతున్నారు. » ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాధారణ కంప్యూటర్ కోర్సుల కంటే టెక్ రంగంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధన–ఆవిష్కరణలు, విద్యావేత్తలు– పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ‘డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ’ వంటి ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది.నమ్మశక్యం కాని అద్భుతాలు » భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని మార్చగల శక్తి ఏఐకి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమీప కాలంలోనే ఈ టెక్నాలజీ కీలకం కానుందంటున్నారు. » వ్యవసాయంలో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఏ సమయంలో ఏ పంట వేయాలో.. పంటల సస్యరక్షణ, దిగుబడులను పెంచడంలో రైతులకు నేరుగా సహాయం చేయగల సామర్థ్యం దీనికుంది. » ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు కావాల్సిన ఏఐ టెక్నాలజీ సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడులు, నిపుణుల నియామకం కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు స్థాపించనున్నారు. అంటే ఈ టెక్నాలజీపై శిక్షణ నుంచి కొత్త సృష్టి వరకు అనేక విభాగాలకు భారత్ అంతర్జాతీయ మార్కెట్‌కు కేంద్రం కానుంది. » కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కరించేందుకు భారతదేశానికి చాలా మంచి అవకాశం ఉందని, ఇది మునుపటి కంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఇంటెలిజెన్స్ భారత్‌ను సృష్టించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం శాతాల్లో68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్65 టెక్ పరిశ్రమ52 ఫార్మా అండ్ హెల్త్‌కేర్43 ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ 28 తయారీ రంగం22 మౌలిక వసతులు, రవాణ12 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ -
'ఏఐకు అదో పెద్ద సవాలు'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ.. ఎంతోమంది దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందులో లోపాలు ఉన్నాయని 'డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్' (Deutsche Bank Research) ఓ నివేదికలో వెల్లడించింది.ఏఐ టెక్నాలజీ అన్ని విషయాల్లోనూ రాణిస్తోంది, కానీ లెక్కల (గణితం) విషయానికి వస్తే.. గణనలు చేయడంలో అంత ఆశాజనకంగా లేదని లోపభూయిష్టంగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ పేర్కొంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని తెలిపింది.ఏఐలో ఫైనాన్స్, హెల్త్ కేర్ కూసే నెమ్మదిగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ తెలిపింది. కాబట్టి ఈ రంగాలలో ఏఐ ఫలితాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ రంగంలో ఆశాజనక ఫలితాలు అందించడానికి ఏఐ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతనై ఉంది.ఇదీ చదవండి: భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే.. కొన్ని రంగాల్లో మాత్రం.. ఏఐ ఉత్పాదక ఊహాతీతంగా, ఆశ్చర్యపడిచే విధంగా ఉంది. అపరిశోధనలను సంబంధించిన విషయాలను అందించడం, వస్తావా ప్రపంచం అనుసరించే అనేక గేమ్ ఇంజిన్లను సృష్టించడంలో కూడా ఏఐ చాలా అద్భుతంగా ఉందని వెల్లడించింది. -
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది.