
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే ఏఐ గవర్నెన్స్‌కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ కృత్రిమ మేధను నియంత్రించడానికి ఖచ్చితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు వ్యూహాత్మక విధాన ఫ్రేమ్‌వర్క్‌లతో ముసాయిదా చట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.
ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలు ఇలా..
చైనా ఏఐ అల్గారిథమ్‌ల్లో పారదర్శకత, డేటా గోప్యత, ఎథికల్ ఏఐ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించే నిబంధనలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.
యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు చేస్తుంది. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హైరిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది.
కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ (ఏఐడీఏ) బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది.
దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది.
పెరూ ప్రభుత్వ సేవల్లో నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి నిబంధనలు ప్రవేశపెట్టింది.
అమెరికా కృత్రిమ మేధ విధానంలో మాత్రం మార్పు వచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రద్దు చేశారు.
యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియాతో సహా అనేక దేశాలు తమ చట్టసభలలో ఆమోదం కోసం కృత్రిమ మేధ బిల్లులను రూపొందించాయి.
ఇదీ చదవండి: రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు
ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు
సమ్మిళిత, సుస్థిర వృద్ధిని నిర్ధారించేందుకు, సామాజిక ఆర్థిక ప్రగతిని నడిపించడానికి ఏఐ వినియోగంపట్ల దేశాల ధోరణి ఎలా ఉందనేది నేషనల్ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏఐ పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడుతాయి. ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పత్రాల్లో ప్రధానంగా కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం.
హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏకీకృతం చేయడానికి కాలపరిమితి, ప్రాధాన్యాలను నిర్దేశించడం.
నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి సూత్రాలను ఏర్పాటు చేయడం.
ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పౌరులను సిద్ధం చేయడానికి కావాల్సిన విద్యను ప్రోత్సహించడం.
ఏఐ భద్రత, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భాగస్వామ్యాలు తోడ్పాటు అందించడం.