
వర్క్ ఫ్రమ్ హోమ్‌ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.
లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్‌లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టిందని ఆయన తెలిపారు.
ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.
కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ
కంపెనీలకు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది.