విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత బ్యాంకింగ్ రంగంలో (banks) లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మానవ కార్మికులు నిర్వహిస్తున్న పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయి.
ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్‌ఫోర్స్‌లో నికరంగా 3% మందిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. క్లయింట్ ఫంక్షన్‌లను కూడా బాట్‌లు(ఏఐ) నిర్వహించడం వల్ల కస్టమర్ సేవల్లో మార్పులు రానున్నాయి. ఇక కేవైసీ విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదు.
ఎక్కువ మంది ఇదే చెప్పారు..
మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది మొత్తం హెడ్‌కౌంట్‌లో 5% నుంచి 10% క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ సర్వేలో సిటీ గ్రూప్ (Citigroup), జీపీ మోర్గాన్ చేజ్ & కో (JPMorgan Chase & Co), గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ (Goldman Sachs) వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలపై ప్రభావం పడినా బ్యాంకులకు మాత్రం మెరుగైన ఆదాయాలను అందించనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను పెంచడం వల్ల 2027లో బ్యాంకులు 12% నుండి 17% ప్రీ-టాక్స్ లాభాలను చూడగలవు. ప్రతి పది మందిలో ఎనిమిది మంది జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను, ఆదాయ సృష్టిని రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో కనీసం 5% పెంచుతుందని భావిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్వహణను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరణ కోసం సంవత్సరాలు గడిపిన బ్యాంకులు.. ఉత్పాదకతను మరింత మెరుగుపరచగల కొత్త తరం ఏఐ సాధనాల్లోకి ప్రవేశించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర రంగాల కంటే బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ గత జూన్‌లోనే ఒక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్‌లో దాదాపు 54% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సిటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment