
అమెరికా – చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం
మనదేశం వైపు దృష్టి సారిస్తున్న అంతర్జాతీయ సంస్థలు
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక
ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్‌కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాబ్‌లు/వ్యక్తిగత కంప్యూటర్ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్‌కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు, ప్రతీకార టారిఫ్‌ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది.
→ అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్‌పాయింట్ అంచనా వేస్తోంది.
→ ల్యాప్‌ట్యాబ్‌లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది.
‘‘ల్యాప్‌ట్యాబ్‌లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్ నేపథ్యంలో హెచ్‌పీ, డెల్ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్‌కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్‌వేర్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్ సెల్యూలర్ అండ్
ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు.
అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్‌కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్ నివేదిక చెబుతోంది. డెల్ సంస్థ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్‌పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్ దేశాలకు 45% మార్చనుంది.