trade war
-
ఇండియాకు వెయిటేజీ పెంచిన సీఎల్ఎస్ఏ
న్యూఢిల్లీ: గరిష్టాల నుంచి 10% దిద్దుబాటుకు గురైన భారత ఈక్విటీల పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ సానుకూల వైఖరి తీసుకుంది. లోగడ ఖరీదుగా మారిన భారత ఈక్విటీల నుంచి చౌకగా మారిన చైనా స్టాక్స్ వైపు మళ్లిన ఈ సంస్థ.. భారత ఈక్విటీ వ్యాల్యూ షన్లు దిగిరావడంతో ఇక్కడ ఎక్స్పోజర్ పెంచుకోవాలని నిర్ణయించింది. చైనా పెట్టుబడులు తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంతో చైనా మార్కెట్లు పెద్ద సవాళ్లు ఎదుర్కోనున్నాయంటూ, తన తాజా నిర్ణయానికి ఇదే కారణంగా పేర్కొంది.చైనా వృద్ధిలో ఎగుమతుల వాటాయే సింహభాగం ఉండడం, చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని గుర్తు చేసింది. భారత్‌లో అధికంగా ఉన్న ఎక్స్పోజర్ నుంచి కొంత మేర అక్టోబర్ మొదటి వారంలో చైనాకు మళ్లించినట్టు పేర్కొంది. భారత వెయిటేజీని 20% నుంచి 10%కి తగ్గించి, చైనా అలోకేషన్‌ను 5%కి సీఎల్ఎస్ఏ లోగడ పెంచుకోగా, ఇప్పుడు పూర్వపు స్థితికి మారుతున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 20% ఇన్వెస్ట్ చేయాలని తాజాగా నిర్ణయించింది.నెలన్నర రోజుల్లో భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు సుమారు రూ.లక్షన్నర కోట్లను తరలించుకుపోయిన నేపథ్యంలో సీఎల్ఎస్ఏ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. పలువురు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ భారత ఈక్విటీ ఎక్స్పోజర్ను పెంచుకునేందుకు ఈ తరహా కరెక్షన్ కోసం చూస్తున్నట్టు తెలిపింది. చైనాకు ప్రతికూలతలు.. చైనా ఆరి్థక భవిష్యత్ అనిశి్చతిగా ఉన్నట్టు సీఎల్ఎస్ఏ తెలిపింది. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు ఆరి్థక వృద్ధికి కావాల్సినంత ప్రేరణనివ్వలేవని అభిప్రాయపడింది. యూఎస్ ఈల్డ్స్ పెరుగుతుండడం, ద్రవ్యోల్బణంపై అంచనాలు యూఎస్ ఫెడ్, చైనా సెంట్రల్ బ్యాంక్‌లు తమ పాలసీని మరింత సరళించే అవకాశాలను పరిమితం చేయనున్నట్టు పేర్కొంది. ఈ అంశాలతో చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఉద్దీపనల తర్వాత చైనా మార్కెట్ వైపు వెళ్లిన ఆఫ్‌షోర్ ఇన్వెస్టర్లు వెనక్కి రావొచ్చని అంచనా వేసింది. -
అమెరికా, చైనా చలో చలో..
బీజింగ్ : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటనుంచి అమెరికా, చైనాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ తాజాగా మొదటిదశ వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాలు ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో ముచ్చటించారు. దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఇక్కడ చైనానే ఒక మెట్టుదిగినట్లు కనబడుతోంది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది. ఇరుదేశాల మధ్య ఆర్థికపురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజింగ్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందుకొచ్చి అమెరికాతో సంప్రదింపులు జరిపింది. జనవరిలోనే యూఎస్, చైనా దేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో అమెరికా బాహాటంగానే చైనాపై అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కావాలనే వైరస్‌ను ప్రపంచానికి అంటగట్టారంటూ పలు విమర్శలు చేసింది. కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు ట్రంప్ విముఖత చూపారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) అంతేకాకుండా చైనా మాతృసంస్థ అయిన టిక్‌టాక్‌ను త్వరలోనే బ్యాన్ చేస్తాం అని అమెరికా ప్రకటించింది. టిక్‌టాక్ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాషింగ్టన్ మీడియా తమ ప్రకటనల్ని సమర్థించుకుంది.అయితే ఈ చర్యలను చైనా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. కావాలనే అమెరికా అణచివేత ధోరణి అవలంభిస్తుందని ఆరోపించింది. తదనంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా ట్రేడ్ వార్‌కు దారితీసిన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు వేసిన అమెరికాపై చైనా కూడా అదే ధోరణి అవలంభించింది. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందాలపై నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. (మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి) -
అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై కత్తులు నూరారు. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో శనివారం పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద దిగుమతిదారు అన్న సంగతి తెలిసిందే. ‘చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవండం లేదు. అందుకే మేము కూలా అలానే ఆలోచిస్తున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, జనవవరిలో మొదటి దశ వాణిజ్య ఒప్పందాల సమయంలో ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్‌కు తెర తీశారు. (చదవండి: చీకటి నుంచి వెలుగులోకి) చైనా నుంచి దిగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో షీ జిన్‌పింగ్ ప్రభుత్వం కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు విముఖత చూపారు. ఇదిలాఉండగా.. చైనాలో అమెరికా తయారీ సంస్థలకు న్యాయమైన, స్థాయి ప్రాతిపదికన పోటీకి అవకాశాలు లభించకపోతే.. యూఎస్, చైనా ఆర్థిక వ్యవస్థలు వేరుపడక తప్పదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ జూన్‌లో పేర్కొనడం గమనార్హం. (చదవండి: వ్యాక్సిన్ తయారీలో చైనా దూకుడు) -
చైనా శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ విధంగా వ్యాఖ్యానించింది ఫాక్స్ కాన్ బాస్ యంగ్ లీ. (3 కోట్లు దాటిన పరీక్షలు) దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్ కాన్తోపాటు చైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్ కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్భంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్‌కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్‌లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్ కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్‌కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి వీచాట్ యాప్ ను తొలగించినట్టయితే వార్షికంగా ఐఫోన్ల ఎగుమతులు 25–30% పడిపోవచ్చనేది టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అంచనా. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మ నిర్భర్‌కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. దేశాన్ని మరింత సౌభాగ్యంగా మార్చేందుకే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చినట్టు చెప్పారు. -
డ్రాగన్ దూకుడు : భారత్ దిగుమతులపై సుంకాల పొడిగింపు
బీజింగ్ : భారత్‌లో తయారయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై యాంటీ డంపింగ్ టారిఫ్‌ను చైనా పొడిగించినట్టు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సుంకాలు మరో ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయి. భారత్‌లో ఉత్పత్తయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై ఆగస్ట్ 14 నుంచి ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీలు వర్తిస్తాయని బీజింగ్ పేర్కొంది. ఈ ప్రకటనలో పలు భారతీయ కంపెనీల పేర్లను డ్రాగన్ ప్రస్తావించింది. భారత తయారీదారులకు అనుగుణంగా ఈ సుంకాలు 7.4 శాతం నుంచి 30.6 శాతం దాకా ఉంటాయని చైనా పేర్కొంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో యాంటీ డంపింగ్ డ్యూటీల పొడిగింపుపై డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యాంటీ డంపింగ్ సుంకాలను తొలగిస్తే చైనా పరిశ్రమలకు కలిగే నష్టాన్ని అంచనా వేసి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. చైనా, మలేషియా, తైవాన్‌ల నుంచి బ్లాక్టోనర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని భారత్ ప్రతిపాదించిన నేపథ్యంలో చైనా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న చైనా, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతయ్యే కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగమతులపైనా భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. చదవండి : చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్ -
బేర్ ఎటాక్!
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా మంగళవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు నష్టపోయి 75.42కు చేరడం, దేశంలో కొన్ని నగరాల్లో లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక రికవరీకి విఘాతం వాటిల్లగలదన్న ఆందోళనలు, ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు పతనమై 36,033 పాయింట్లకు, నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు చెరో 1.8% చొప్పున నష్టపోయాయి. ఫార్మా సూచీకే లాభాలు..... ►ప్రపంచ మార్కెట్ల పతనంతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ ఏ దశలోనూ ఊరట లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 817 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఒక్క ఎన్ఎస్ఈ ఫార్మా సూచీ మాత్రమే లాభపడింది. మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ►సెన్సెక్స్‌లోని 30 షేర్లలో టైటాన్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ►వాహన రుణాలకు సంబంధించి అవకతవకలపై విచారణ జరుపుతున్నామని యాజమాన్యం నిర్ధారించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం నష్టంతో రూ.1,059 వద్ద ముగిసింది. ►స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►దాదాపు 400కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్ ఫ్యాషన్స్, ఐడీబీఐ బ్యాంక్, రెప్కో హోమ్ ఫైనాన్స్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►డాబర్ ప్రమోటర్లు బర్మన్లు తమ వాటాను 8.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవడంతో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 10% అప్పర్ సర్క్యూట్‌తో రూ.89 వద్ద ముగిసింది. ►కరోనా చికిత్సలో ఉపయోగపడే ఔషధాన్ని అందించనున్నామని ప్రకటించడంతో బయో కాన్ షేర్ 5 శాతం లాభంతో రూ.437 వద్దకు చేరింది. ►ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) మొదలైన నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్ 5% నష్టంతో రూ.21 వద్ద ముగిసింది. గత 3 రోజుల్లో ఈ షేర్ 22% నష్టపోయింది. ఎఫ్‌పీఓ ఫ్లోర్‌ప్రైస్ రూ.12గా యస్‌బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అన్ని సానుకూలాంశాలను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుంది. సెన్సెక్స్ 37.022 పాయింట్ల స్థాయికి చేరే క్రమంలో ప్రతి నిరోధ స్థాయి వద్ద లాభాల స్వీకరణ జరుగుతూనే ఉంటుంది. –శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ నిఫ్టీ 10,750 పాయింట్లపైన ముగియగలిగితేనే అప్‌ట్రెండ్ కొనసాగుతుంది. లేని పక్షంలో 10,480–10,500 పాయింట్లకు, ఆ తర్వాత 10,350 పాయింట్లకు పతనమయ్యే అవకాశాలున్నాయి. –మనీశ్ హతిరమణి, టెక్నికల్ అనలిస్ట్ -
డ్రాగన్‌తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్‌ఫోన్... ఓపెన్ చేస్తే టిక్‌టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్‌ప్రెస్‌లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్‌కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్‌తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్‌కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్‌కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్‌లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్‌నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్‌డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్‌లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్‌డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్‌లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్‌లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్‌లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్‌లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్‌లోని సంస్థల ద్వారా భారత్‌లోని స్టార్టప్‌లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్‌లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్‌వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్‌లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్‌లో ఆధిపత్యం.. భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్‌ఫోన్స్‌లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్‌కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్‌వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్‌లో చైనా మొబైల్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్‌టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్‌లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్‌కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్‌కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్‌లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్‌డౌన్‌ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్ దిశపై ప్రభావం చూపనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్‌కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా, ఈ వారంలో ఎస్బీఐ, ఇండిగో, బీపీసీఎల్ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్డౌన్ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఏప్రిల్ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో ఫండ్స్ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. -
జపాన్ అప్ - హాంగ్‌కాంగ్ డౌన్..!
ఆసియా మార్కెట్లు సోమవారం ప్రారంభలాభాల్ని కోల్పోయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, థాయిలాండ్, కొరియా దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలుతున్నాయి. హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు అమెరికా, బ్రిటన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయవు. హాంకాంగ్ రాజకీయ అంశంలో అమెరికా జోక్యంతో మరోసారి చైనా-అమెరిక దేశాల వాణిజ్య సంబంధాలు ప్రశ్నార్థకమయ్యాయి. దీంతో చైనా ప్రధాన సూచీ షాంఘై కాంపోసైట్ అరశాతం క్షీణించింది. హాంగ్‌కాంగ్ నగరంలో అల్లర్లు తారాస్థాయికి చేరుకోవడంతో హాంగ్‌కాంగ్ మార్కెట్ 1శాతం వరకు క్షీణించింది. ఉద్దీపన ప్యాకేజీఆశలతో జపాన్ మార్కెట్ 1.50శాతం పెరిగింది. లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న జపాన్ తాజాగా 929 బిలియన్ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని దేశం పరిశీలిస్తోందని ఆ దేశపు మీడియా వర్గాలు వెల్లడించాయి. హాంగ్‌కాంగ్ విషయంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న రాజకీయ విబేధాలు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. కరోనా వైరస్‌తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఆయా దేశాలు పాలసీ ఉద్దీపనలు ప్రకటించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్ట స్థాయిల నుంచి ఏకంగా 30శాతం వరకు ర్యాలీ చేశాయి. -
మార్కెట్‌కు ఒడిదుడుకుల వారం!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్–19 పాజిటివ్ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే మాత్రం భారీ పతనం తప్పదని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని సిర్కార్ కురియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రతికూల వార్తలు వెలువడినా మార్కెట్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఇప్పటికే ఓవర్‌సోల్డ్ అధికంగా ఉన్న కారణంగా రిబౌండ్కు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేషించారు. అయితే, ఇది అధికస్థాయిలో నిలవలేకపోవచ్చని, ఒడిదుడుకులకు ఈవారంలో ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరగనుంది. కాగా గురువారం (28న) మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. మరోవైపు.. హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, లుపిన్, డాబర్, టీవీఎస్ మోటార్, యునైటెడ్ స్పిరిట్స్, వోల్టాస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, మాక్స్ ఫైనాన్షియల్, టోరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఉషా మార్టిన్ కంపెనీలు తమ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. రూ. 9,089 కోట్ల పెట్టుబడి భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే 1–22 మధ్య కాలంలో రూ. 9,089 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌లో రూ. 6,883 కోట్లు, మార్చిలో రూ. 61,973 కోట్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మార్కెట్ సెలవు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం (మే25న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. మంగళవారం (26న) మార్కెట్ యథావిధిగా పని చేస్తుంది. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్
వాషింగ్టన్/లండన్/ఢాకా: కోవిడ్–19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్ కోవిడ్–19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పునః చర్చలకు ఇక ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడాలన్న ఆసక్తి కూడా తనకి లేదన్నారు. చైనాతో సంబంధాల అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని, అసలు పూర్తిగా సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే అమెరికాకు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయన్నారు. కోవిడ్‌పై సహకరించుకోవాలి: చైనా చైనాతో తెగదెంపులౖకైనా సిద్ధపడతానని ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆ దేశం ఆచితూచి స్పందించింది. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ఇరుదేశాల ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేసి, కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లో 5.80 లక్షల సర్జరీలు రద్దు? కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో 5 లక్షల 80 వేలకు పైగా సర్జరీలు రద్దు కావచ్చని, లేదంటే వాయిదా పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సర్జరీ భారత్‌లో శస్త్రచికిత్సలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల్లో కరోనా బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో తొలి కరోనా కేసు నమోదైంది. బంగ్లాలో రోహింగ్యాల శిబిరాలు అత్యంత రద్దీతో ఉంటాయి. కాక్స్ బజార్ జిల్లాలోని ఒక శిబిరంలో తలదాచుకుంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేపుతోంది. బంగ్లాలో వివిధ శరణార్థి శిబిరాల్లో 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత, ఈ వైరస్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, వివిధ దేశాల్లో లాక్డౌన్ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బంధన్ బ్యాంక్ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి రికార్డు తేది మే14 ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకి మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
దిగివచ్చిన బంగారం ధరలు
ముంబై : ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడం, లాక్డౌన్ సడలింపులతో పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతుండటం బంగారం ధరలపై ప్రభావం చూపాయి. ముంబై ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం రూ 100 దిగివచ్చి రూ 45,650 పలికింది. బంగారం ధరలు మరికొద్ది రోజులు అనిశ్చితితో సాగినా నిలకడగా పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా అమెరికా-చైనా ట్రేడ్‌వార్, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో రాబోయే రోజుల్లో పసిడికి పెట్టుబడి డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. బంగారం ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేస్తూ పోవాలని మదుపుదారులకు నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో పసిడిపై పెట్టుబడులు మెరుగైన రాబడి ఇస్తాయని చెబుతున్నారు. చదవండి : పసిడి వెలవెల -
సెన్సెక్స్ 32,170 మద్దతుకు ఇటూ...అటూ
అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్ పతనాన్ని చవిచూసాయి. భారత్ మార్కెట్‌కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్ మార్కెట్ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే... క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ...గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్ వెడ్జ్ ప్యాట్రన్ అప్పర్‌బ్యాండ్ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్ వుంటుంది. – పి. సత్యప్రసాద్ -
మార్కెట్ ర్యాలీయా.. దిద్దుబాటా?
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలోనూ ర్యాలీని కొనసాగిస్తుందా..లేక మరో భారీ పతనాన్ని నమోదుచేస్తుందా..? అనే సందిగ్ధంలో పడే స్తోంది. దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అనేది మార్కెట్‌కు సానుకూలాంశమేమి కాదని, మార్కెట్ గ్యాప్డౌన్తోప్రారంభం కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కంపెనీల ఫలితాలు, కోవిడ్–19 వ్యాక్సిన్, ముడి చమురు ధరలే కీలకంగా ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ విశ్లేషించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్ ముదిరితే భారీ పతనం ఉంటుందని అన్నారు. స్వల్పకాలంలోనే దిగువస్థాయి నుంచి ర్యాలీ చేసిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ అవకాశం ఉండనుండగా.. ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం: ఏప్రిల్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ బుధవారం వెల్లడికానుంది. అమెరికా మార్కిట్ కాంపోజిట్ పీఎంఐ, సేవారంగ పీఎంఐ మంగళవారం విడుదలకానుంది. నిరుద్యోగ జాబితా శుక్రవారం రానుంది. 24 కంపెనీల ఫలితాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారికో, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, యస్ బ్యాంక్, నెరోలాక్ పెయింట్స్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇక గతవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఫలితాలు వెల్లడికాగా, సంస్థ క్యూ4 నికర లాభం 39 శాతం తగ్గింది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంపై స్పష్టంగా ఉండనుందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక చరిత్రలోనే తొలిసారిగా ఆటోమొబైల్ పరిశ్రమ ఏప్రిల్ అమ్మకాలను సున్నాగా ప్రకటించింది. -
ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు
వాష్టింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మళ్లీ రాజుకోనుంది. కోవిడ్-19 కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ బెదిరించారని గురువారం స్థానిక మీడియా నివేదించింది. చైనా నుంచే కరోనా మహమ్మారి వ్యాపించిందని పదే పదే దాడి చేస్తున్న ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం తమకు ద్వితీయ ప్రాముఖ్యత అంటూ వాణిజ్య యుద్దానికి తెరలేపారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసాం. నిజానికి చాలా వాణిజ్యం జరుగుతోంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ తో తమకు జరిగి నష్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకోన్నామని ట్రంప్ విలేకరులతో అన్నారు. వైరస్, లాక్డౌన్, ఆర్థిక నష్టాలు ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పారదర్శకత పాటించని చైనాకు అమెరికా రుణాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై అధికారులు చర్చించినట్లు వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అయితే దీన్ని ట్రంప్ అత్యున్నత ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఖండించారు. మరోవైపు రుణాల రద్దు, చైనాపై అమెరికా ప్రతీకారంపై ప్రశ్నించినపుడు ట్రంప్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ దీన్ని భిన్నంగా చేయనున్నామని వ్యాఖ్యానించారు. చైనా అమెరికా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరిలో ట్రంప్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏటా 370 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల దిగుమతులపై 25 శాతం వరకు సుంకం అమలవుతోంది. చైనా ఎగుమతి చేసే కొన్ని రకాల వస్తువులపై సుంకాలను తగ్గింపు ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి టారీఫ్‌లను ట్రంప్ పెంచనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. (అమెరికాపై చైనా విమర్శలు: నెటిజన్ల ఫైర్!) కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని, దీనికి తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కరోనావైరస్ మూలం, వ్యాప్తిలో చైనా పాత్ర గురించి తన ఆందోళనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు, కోవిడ్-19 మనుషులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. కాగా కరోనా విజృంభణతో అమెరికాలో 60 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మిలియన్ కేసులను దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. దీనికి తోడు రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో దేశంలోని తీవ్ర ఆర్థిక సంక్షోభం అమెరికా అధ్యక్షుడిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో తన గెలుపును అడ్డుకునేందుకు చైనా కుట్రచేసిందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవిడ్-19 చైనానే తయారు చేసిందని ఆరోపిస్తున్నారని అధికార, ప్రతిపక్షాల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
అమెరికా–చైనా మధ్య మళ్లీ చిచ్చు!
వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్‌ను ఎఫ్‌సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. వ్యతిరేకించిన చైనా అమెరికా చర్యలను చైనా వ్యతిరేకించింది. ‘‘అమెరికా మార్కెట్ విధానాలకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. వాణిజ్య విషయాలను రాజకీయం చేయడం, జాతీయ భద్రతను ఊతపదంగా వాడడాన్ని ఆపేయాలి. అలాగే, అనుచితంగా చైనా కంపెనీలను అణచివేసే విధానాలను కూడా నిలిపివేయాలి’’ అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావోలిజియాన్ ప్రకటన విడుదల చేశారు. -
చమురు ‘బేజార్’
సింగపూర్: ముడి చమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి, రష్యా మధ్య డీల్ కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల పోరుకు తెర తీసింది. భారీగా రేట్లు తగ్గించేసింది. 20 ఏళ్ల కనిష్ట స్థాయికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు ఏకంగా 30 శాతం దాకా పతనమయ్యాయి. ఒక దశలో ప్రామాణిక బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత చమురు రేట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అటు సహజ వాయువు రేట్లు కూడా క్షీణించాయి. ఎందుకిలా.. కరోనా వైరస్ కారణంగా ముడిచమురుకు డిమాండ్ తగ్గి.. మార్కెట్లో క్రూడ్ నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా రేట్లు పడిపోవచ్చన్న భయాలతో సౌదీ అరేబియా సారథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్).. చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని గత వారం జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించింది. అయితే, తాము ఉత్పత్తి తగ్గించిన పక్షంలో అమెరికా చమురు ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో దూసుకుపోయే రిస్కులు ఉన్నాయనే ఉద్దేశంతో.. ఈ ప్రతిపాదనను రష్యా విభేదించింది. చమురు ఉత్పత్తిలో సౌదీ, రష్యా.. ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. తాజా పరిణామంతో తన మార్కెట్ వాటాను కాపాడుకునే దిశగా.. అదే సమయంలో రష్యాపై ఒత్తిడిని పెంచే దిశగా సౌదీ అరేబియా పావులు కదిపింది. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా .. క్రూడాయిల్ రేట్లను తగ్గించడంతో పాటు ఉత్పత్తినీ పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌లో కాంట్రాక్టుకు సంబంధించిన రేట్లను బ్యారెల్‌కు 6 నుంచి 8 డాలర్ల దాకా తగ్గించేసింది. ఇది మార్కెట్లో కలకలం రేపడంతో క్రూడాయిల్ రేట్లు భారీగా పతనమయ్యాయి. చమురు ధరలు దాదాపు దశాబ్దపు కనిష్ట స్థాయి 26 డాలర్లకు దగ్గర్లో ఉండటం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది. త్వరలోనే ఈ స్థాయిని కూడా తాకవచ్చని ఆంచనాలు ఉన్నాయి. 20 డాలర్లకూ పతనావకాశం.. ఒకవేళ ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోతే చమురు రేట్లు బ్యారెల్‌కు ఏకంగా 20 డాలర్ల స్థాయికి కూడా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రష్యాను చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగానే సౌదీ అరేబియా ఈ వ్యూహాలు అమలు చేస్తుండవచ్చని వారు పేర్కొన్నారు. ఒకవేళ రేట్లు గానీ భారీగా పతనమైతే .. చమురు ఆదాయాలపై ఆధారపడిన దేశాలు దెబ్బతినడంతో పాటు క్రూడాయిల్ అన్వేషణ ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
పసిడి ధరలు పైపైకి
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్ మార్కెట్లో పసిడి ధర మళ్లీ 39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం 7వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగానే ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం రూ. 191 పెరిగి 10 గ్రాముల ధర రూ. 39,239 పలికింది. అటు వెండి ధర ఇదే బాటలో పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 943 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 స్థాయికి చేరింది. నవంబర్ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. ఈ నవంబర్‌లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా నిన్న మార్కెట్ ముగిసే సరికి రూ.266 లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం తదితర పండుగల నేపథ్యంలో డిమాండ్ స్వల్పంగా పుంజుకునే అవకాశం ఉందని బులియన్ వర్తకులు భావిస్తున్నారు. -
పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!
ప్రస్తుతం పెట్టుబడులకు పసిడి సురక్షిత సాధనమేనని నిపుణుల అంచనా. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర 20వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్‌కు (31.1గ్రా) 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు, అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ప్రత్యేకించి వినియోగ గణాంకాలు సానుకూలత, డాలర్ పటిష్టత వంటి అంశాలు స్వల్పకాలంలో పసిడి ధర దిగువకు రావడానికి కొంత దారితీసినా.. 1,450 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది వాదన. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ధోరణుల వల్ల పసిడి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్‌లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
గ్లోబల్ జోష్‌తో స్టాక్ మార్కెట్ జోరు..
ముంబై : అంతర్జాతీయ అనిశ్చితి తొలగుతుందనే సంకేతాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు ఎగిశాయి. ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా నిరాశాజనకంగా ఉన్నా ట్రేడ్ డీల్ పై ఆశలు, బ్రెగ్జిట్‌పై స్పష్టత వంటి అంశాల ఊతంతో మదుపుదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 41,009 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 12,086 పాయింట్ల వద్ద క్లోజయింది. -
స్టాక్ మార్కెట్లకు ట్రేడ్ వార్ షాక్..
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో జాప్యం నెలకొంటుందనే సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల ట్రెండ్ సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మెటల్, పీఎస్‌యూ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 101 పాయింట్ల నష్టంతో 40,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువన 11,957 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ట్రేడ్‌వార్‌లో చైనానే విలన్!
హైదరాబాద్, సాక్షి బిజినెస్: చైనాతో అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాన్సు లేదని బెల్జియం రాజకీయ ప్రతినిధి, యూరోపియన్ యూనియన్ మాజీ ట్రేడ్ కమిషనర్ కారల్ డీ గష్ అభిప్రాయపడ్డారు. అదిగో డీల్ కుదరుతోంది, ఇదిగో కుదురుతోందంటూ వచ్చే వార్తలతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీయడమే కానీ, నిజానికి ఎలాంటి డీల్ కుదరకపోవచ్చన్నారు. ట్రేడ్‌వార్ అనేది ఒక వ్యవస్థీకృత సమస్యని, ఇందుకు చైనానే ప్రధాన కారణమని, కానీ చైనాను దారికి తెచ్చేందుకు అమెరికా అనుసరిస్తున్న బలవంతపు విధానం సత్ఫలితాలు ఇవ్వదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పదేళ్లు ట్రేడ్‌వార్ కొనసాగినా ఆశ్చర్యం లేదన్నారు. బెల్జియం, ఇండియా మధ్య ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో వాణిజ్య సహకారం కోసం బెల్జియం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ ట్రేడ్‌వార్‌తో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ కారణంగా ఈయూలో బెల్జియం, నెదర్లాండ్స్‌పై అత్యధిక ప్రతికూల ప్రభావం ఉంటుంది. ట్రేడ్‌వార్, బ్రెగ్జిట్ నేపథ్యంలో ఇండియా, యూరోపియన్ యూని యన్ మధ్య సరికొత్త వాణిజ్య అవకాశాలకు అపార అవకాశముంది. అయితే భారత్ నుంచి ఈ దిశగా సరైన చర్యల్లేవు’ అని కారల్ డీ గష్ తెలిపారు.