టారిఫ్‌ టెర్రర్‌... ఇన్వెస్టర్లకు ఫీవర్‌! | Trump on Wednesday launched a historic global trade war | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ టెర్రర్‌... ఇన్వెస్టర్లకు ఫీవర్‌!

Apr 7 2025 5:58 AM | Updated on Apr 7 2025 10:37 AM

Trump on Wednesday launched a historic global trade war

అమెరికా ప్రతీకార సుంకాలతో ప్రపంచ ఎకానమీకి దెబ్బ 

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌.. 

మనకూ భారీ కరెక్షన్లు తప్పవు... 

పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించాలి

నిపుణుల సూచన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేల్చిన ‘లిబరేషన్‌ డే’ టారిఫ్‌ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. 

ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్‌ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్‌ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.        

భారత్‌ను పదే పదే టారిఫ్‌ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్‌.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్‌ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 

అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్‌ లిబరేషన్‌ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్‌ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్‌ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్‌ ఫైనాన్స్‌ ఫౌండర్, సీఈఓ విరమ్‌ షా పేర్కొన్నారు. 

మార్కెట్లో మరింత కరెక్షన్‌ తప్పదు... 
టారిఫ్‌ వార్‌ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్‌ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్‌ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్‌ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్‌ వార్‌తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో  కరెక్షన్‌ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

 ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్‌ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్‌ ఎంఎఫ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (ఈక్విటీస్‌) త్రిదీప్‌ భట్టాచార్య పేర్కొన్నారు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి? 
‘ట్రంప్‌ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్‌ఎంసీజీ, యుటిలిటీస్‌ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్‌ రంగాల (ఆటో, మెటల్స్‌) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్‌ సీఈఓ ప్రణయ్‌ అగర్వాల్‌ సూచించారు.

 మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్‌ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్‌ రాఠీ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుజన్‌ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్‌కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్‌ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్‌ అయ్యింది. అయితే, ట్రంప్‌ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్‌ గేర్‌ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.

డెట్‌ ఫండ్స్‌కు దన్ను... 
జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్‌బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. 

‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్‌బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్‌ (వడ్డీ) రేటు బాండ్‌ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ నికర అసెట్‌ విలువ (ఎన్‌ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్‌ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement