
పలు దేశాలపై టారిఫ్‌లు అమల్లో లేకపోతే అమెరికా ఆర్థికవినాశనం తప్పదు
యూఎస్ సుప్రీంకోర్టునే పరోక్షంగా బెదిరించిన అమెరికా ప్రభుత్వం
ప్రతిష్ఠంబన వీడేలా కేసును త్వరగా తేల్చాలని డిమాండ్
న్యూయార్క్/వాషింగ్టన్: టారిఫ్‌ల బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరకు యూఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్‌లు తగ్గిస్తే అమెరికా వాణిజ్యలోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనే జరగాలంటే భారత్‌పై టారిఫ్‌ల మోత మోగాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది.
భారత్‌సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్‌ల భారం మోపకపోతే ఆర్థికలోటు సుడిగుండంలో అమెరికా చిక్కుకోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తంచేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్‌ల చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చాలని యూఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్‌చేసింది. ఈ మేరకే ఏకంగా 251 పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమరి్పంచింది.
‘‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకే భారత్‌పై టారిఫ్‌ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు తన ‘1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ను ప్రయోగించారు. అధిక టారిఫ్‌లతో భారత్‌పై ఆర్థికపరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరంలేక చివరకు రష్యా యుద్ధవిరామం చేసేలా ఒప్పించగల్గుతుంది.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భారత్‌పై 50 శాతం టారిఫ్ అవశ్యం’’అని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ‘‘టారిఫ్‌ల విధింపును కోర్టులు అడ్డుకుంటే, అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని మీరు తేలిస్తే వాణిజ్యలోటు కష్టాల నుంచి అమెరికా బయటపడటం చాలా కష్టమవుతుంది. చివరకు అమెరికా ఆర్థికవినాశనం సంభవిస్తుంది’’అంటూ తమకు వ్యతిరేక తీర్పు రావొద్దనే ధోరణిలో ఏకంగా యూఎస్ సుప్రీంకోర్టునే భయపెట్టేలా ట్రంప్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది.
ఆరు కీలక దేశాలు దారికొచ్చాయి
‘‘టారిఫ్‌ల కొరడా ఝుళిపించడంతో ప్రపంచంలోనే ఆరు ప్రధాన ఆర్థికవ్యవస్థలు(దేశాలు) మా దారికొచ్చాయి. అమెరికాతో 27 సభ్యదేశాలున్న ఐరోపా సమాఖ్యసైతం టారిఫ్‌ల ఒప్పందంచేసుకుంది. ఈ ఒప్పందం అమెరికాకు భారీగా మేలు చేకూర్చేదే. దీంతోపాటు 2 ట్రిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీ పెట్టుబడులు సాధ్యంకానున్నాయి. ఆయా దేశాలపై మేం విధించే టారిఫ్‌లు అనేవి అమెరికా మరింతగా 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యలోటు అగాధంలో పడకుండా కాపాడే రక్షారేకులు. టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదన్న ‘అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ కోర్టు’అభిప్రాయాన్ని పట్టించుకోకండి.
ఇతర దేశాలపై అధిక టారిఫ్‌లు మోపితేనే అమెరికా సంపన్న దేశంగా కొనసాగుతుంది. లేదంటే పేదదేశంగా పతనమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రాకమునుపు అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు అధిక టారిఫ్‌లతో బిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడుతోంది. ఇప్పుడు అమెరికా మళ్లీ బలపడుతోంది. ఆర్థికంగా పటిష్టమవుతూ విశ్వవ్యాప్తంగా గౌరవమర్యాదలను పొందుతోంది’’అని ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ డి. జాన్ సాయెర్ వాదించారు. నవంబర్‌లోపు కేసులో వాదోపవాదనలను ముగించి తీర్పు చెప్పాలని కోర్టును సాయెర్ కోరారు.