world economy crisis
-
మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? బతుకుడెట్లా?
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు! కోవిడ్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా? దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల! కాస్ట్ ఆఫ్ లివింగ్! రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు. అన్ని ప్రియమవుతున్న వేళ కోవిడ్ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు. రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా. ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా. ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. పారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్ యూనియన్ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం. ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్ ఫీల్డ్ అన్నారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
మందగమనంలో ఆర్ధిక రంగం..
‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’– ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ ఊతపదంగా ఉపయోగించిన డైలాగ్ ఇది. ఇప్పుడు ఒక దేశమనేం ఖర్మ యావత్ ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండేళ్లు పూర్తిగా పీడించిన ‘కోవిడ్’ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు ఇప్పుడు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ‘కరోనా’ తాకిడి సద్దుమణిగిందనుకుంటున్న ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. దీని ఫలితంగా కనీస నిత్యావసరాల కోసం, ఉపాధి కోసం ప్రజలు నానా ఇక్కట్లకు లోనవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల నిరాశాజనకమైన పరిస్థితులు, మరింత అనిశ్చితి నెలకొన్నాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్’ ఈ ఏడాది జూలైలో ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచ ఆర్థికరంగంలో ప్రస్తుత మందగమనానికి దారితీసిన కారణాలను, మందగమనం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం... కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్ల మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టాయి. కోవిడ్ మహమ్మారి కాలంలో లాక్డౌన్లు దేశ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలను కుదేలయ్యేలా చేశాయి. చాలాచోట్ల వివిధ రంగాల్లో పనిచేసే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఆన్లైన్ సేవలతో కాలక్షేపం చేసినప్పటికీ, కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్డౌన్ కాలంలో వస్తూత్పత్తి, భవన నిర్మాణ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు పెరుగుతున్నంత వేగంగా సామాన్యుల ఆదాయాలు పెరగకపోవడంతో వారి కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణించింది. ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితిలో పడ్డారు. ఫలితంగా విపణిలో లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ‘ప్రపంచ దేశాలు ఈ ఆర్థిక మందగమనాన్ని తప్పించుకోవడం కష్టం’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ వ్యాఖ్యానించారంటే, పరిస్థితుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే! ఇదే మొదటిసారి కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. ఆధునిక ప్రపంచంలో 1930 దశకంలో తీవ్రమైన ఆర్థికమాంద్యం సంభవించింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఆకలితో అల్లాడాయి. అందుకే, 1930 దశకాన్ని ‘హంగ్రీ థర్టీస్’గా పేర్కొంటారు. రెండు ప్రపంచయుద్ధాల నడుమ ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభమది. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఆర్థికంగా తేరుకున్నాయి. అభివృద్ధి బాటలో ముందుకు సాగాయి. దాదాపు మూడు దశాబ్దాల కాలం ప్రపంచ ఆర్థిక రంగానికి పెద్ద అవరోధాలేవీ ఎదురు కాలేదు. ఆ తర్వాత గడచిన శతాబ్దిలో 1974–75, 1981–82, 1990–91 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత శతాబ్దిలో 2007–09లో ప్రపంచ ఆర్థిక మందగమనం ఏర్పడినా, భారత్ పెద్దగా ఇబ్బంది పడకుండానే తేరుకుంది. ప్రస్తుత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మళ్లీ మొదలైంది. దీని ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వంటనూనెల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండగా మారింది. కట్టెల పొయ్యిల పొగ బారి నుంచి మహిళలకు విముక్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మారుమూల పల్లెల్లో సైతం ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి. అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.527 ఉండేది. ఇప్పుడు సిలిండర్ ధర దాదాపు పదకొండు వందల రూపాయలకు చేరింది. దీంతో దేశంలోని పలు మారుమూల పల్లెల్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ జనాలు కట్టెల పొయ్యిలపైనే ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిగిలిన నిత్యావసరాల ధరలూ గణనీయంగా పెరిగాయి. సామాన్యుల ఆదాయంలో మాత్రం ఇదేస్థాయి పెరుగుదల నమోదు కాకపోవడంతో జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ‘కోవిడ్’ తర్వాత దేశంలో నిరుద్యోగం కూడా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక మందగమనం ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కాస్త తక్కువగానే ఉంది. ఒకరకంగా భారత్ మీద మాంద్యం ప్రభావం అత్యల్పంగా మాత్రమే ఉంది. ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనా 8.8 శాతం ఉండగా, దీనిని 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. భారత్ వృద్ధిరేటు ఈసారి 7.4 శాతం వరకు ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023 నాటికి 2 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొన్ని దేశాల్లో మాంద్యం పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. సంక్షోభంలో శ్రీలంక ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యానికి శ్రీలంక అత్యంత దారుణంగా ప్రభావితమైంది. దేశం దివాలా తీసింది. ఇంధనానికి తీవ్రమైన కరువు ఏర్పడి, ప్రతిరోజూ గంటల తరబడి విద్యుత్తు కోతలు సామాన్యంగా మారాయి. దేశంలో ఎటుచూసినా ఆహార కొరత కారణంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి నిరసనలు తారస్థాయికి చేరుకోవడంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశాన్ని విడిచి పరారయ్యారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం 2019లోనే మొదలైంది. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలకు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ ఏడాది జూన్‌లో సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటించారు. విదేశీ రుణాలను చెల్లించలేని దుస్థితిలో చిక్కుకుపోయి, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోనే 21వ శతాబ్దిలో మొదటి సార్వభౌమ ఎగవేతదారుగా మారింది. అంతర్యుద్ధం తర్వాత నిలకడలేని ప్రభుత్వాలు, ఇష్టానుసారం పన్నుల కోతలు, నోట్ల ముద్రణ వంటి అనాలోచితమైన ఆర్థిక చర్యలకు దిగడంతో శ్రీలంక పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. మితిమీరి నోట్లు ముద్రిస్తూ పోతే ఆర్థిక సంక్షోభం తప్పదని ఐఎంఎఫ్ ఇచ్చిన సలహాను శ్రీలంక సెంట్రల్ బ్యాంకు పెడచెవిన పెట్టింది. ఫలితంగా ‘కోవిడ్’ ముందునాటికి దాదాపు 5 శాతానికి కాస్త ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం, 2022 ఫిబ్రవరి నాటికి 18 శాతానికి చేరుకుంది. ఇక ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నాటికి 75.8 శాతానికి చేరింది. నిత్యావసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే శ్రీలంక, చెల్లింపులు జరపలేని స్థితికి చేరుకోవడంతో దిగుమతులు నిలిచిపోయి, నిత్యావసరాలకు భారీ కొరత ఏర్పడింది. దిగుమతుల కోసం శ్రీలంక ఎక్కువగా భారత్, చైనాలపైనే ఆధారపడుతోంది. దిగుమతులకు గండిపడ్డాక సరుకుల సరఫరా కంటే గిరాకీ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోవడంతో ప్రజలు పస్తులుంటున్నారు. ఆదాయం కోసం శ్రీలంక ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడేది. ఎక్కువగా యూరోపియన్లు, ముఖ్యంగా రష్యన్ పర్యాటకులు శ్రీలంకకు వస్తుండేవారు. ‘కోవిడ్’ దెబ్బకు పర్యాటకరంగం కుదేలైంది. ‘కోవిడ్’ సద్దుమణిగినా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో పర్యాటకుల రాక బాగా తగ్గిపోయింది. ఇక అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శ్రీలంక ప్రపంచ దేశాల సాయం కోసం చూస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు సాయంగా భారత్ 4 బిలియన్ డాలర్లు (31,273 కోట్లు) ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే విదేశీ మారక నిల్వల సమస్యను పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పతనం వేగాన్ని తగ్గించేందుకు మొదట్లోనే చర్యలు ప్రారంభించినట్లయితే ఇప్పుడు ఇంతటి కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తేది కాదని ఆయన అన్నారు. అయితే, దేశం దివాలా తీసినట్లు ప్రకటించడం వెనుక అధ్యక్షుడు రాజపక్స కుటుంబ సభ్యుల కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో దోచుకున్న సొమ్మును రాజపక్స కుటుంబం విదేశీ బ్యాంకుల్లో దాచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దివాలా తీసి దిక్కు తోచని స్థితిలో పడ్డ శ్రీలంక ప్రస్తుతం ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. అగ్రరాజ్యాలకూ దడ పుట్టిస్తున్న ధరలు అగ్రరాజ్యాలు సైతం ఆర్థిక మందగమనంలో చిక్కుకున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో పలు దేశాల్లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. అమెరికాలో ఈ ఏడాది జూలై నాటికి ద్రవ్యోల్బణం 10.9 శాతానికి చేరుకుంది. అమెరికాలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం 1979 తర్వాత ఇదే మొదటిసారి. మన దేశంలో పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం మాదిరిగానే అమెరికాలో ఫెడరల్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రోగ్రాం అమలవుతోంది. ధరలు అదుపు తప్పడంతో ఈ పథకం కింద పాఠశాలలకు ఆహార సరఫరా చేయడానికి ఆహార సరఫరాదారులెవరూ ముందుకు రావడం లేదు. అమెరికాలో ఫెడరల్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రోగ్రాం కింద పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో నిర్ణీత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తారు. ధరల పెరుగుదల నేపథ్యంలో కచ్చితమైన ప్రమాణాలతో కూడిన పదార్థాలను సరఫరా చేయడం సరఫరాదారులకు దుస్సాధ్యంగా ఉంటోంది. అమెరికాలో ఏడాది వ్యవధిలోనే ఇంధన ధరలు దాదాపు 60 శాతం మేరకు పెరిగాయి. దీనివల్ల నిత్యావసరాల రవాణాకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వృద్ధిరేటు 2021లో 5.7 శాతం నమోదైతే, 2022లో ఈ వృద్ధిరేటు 2.3 శాతం వరకు మాత్రమే ఉండగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అమెరికాలో ఆర్థిక మందగమనం 2024 వరకు కొనసాగవచ్చని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి ముందుగానే తేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని ప్రముఖ ఆర్థకవేత్త స్టీఫెన్ రోష్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక మాంద్యంలో పడిందని ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతుంటే, అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ మాత్రం అదంతా ఉత్తదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికీ నెలకు నాలుగు లక్షలకు పైగా ఉద్యగాలను సృష్టించగలుగుతున్నామని, గత ఏడాది 5.5 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి సాధించామని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితులపై జానెట్ వ్యాఖ్యలు ‘ట్వట్టర్’లో పెద్ద చర్చకే దారితీశాయి. అమెరికాలో 2022 రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 0.9 శాతం మేరకు తగ్గింది. వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో ఉన్నవారిలో కొందరు ఉపాధి కోల్పోవడం, వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను తగ్గించుకోవడం, పరిశ్రమలు తమ ఉత్పాదకతకు తగ్గించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆర్థిక మాంద్యం మొదలైనట్లేనని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో 2023లోనూ ఆర్థికమాంద్యం పరిస్థితులు కొనసాగవచ్చని మూడింట రెండొంతుల మంది జనాలు నమ్ముతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ సర్వేలో తేలింది. అయితే, మాంద్యం కచ్చితంగా ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ సైతం ద్రవ్యోల్బణం ధాటికి అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అదుపు తప్పడంతో సామాన్యులు నిర్బంధ పొదుపుచర్యలు పాటిస్తున్నారు. దేశంలో కొందరికైతే పస్తులుండక తప్పని పరిస్థితులూ తలెత్తుతున్నాయి. బ్రిటన్‌లో ఒకవైపు నిత్యావసరాల ధరలు అదుపుతప్పి పెరుగుతుండగా, మరోవైపు ప్రజల ఆదాయం ఈ ఏడాది 2.5 శాతం తగ్గింది. ‘కోవిడ్’ ముందు కాలంతో పోల్చుకుంటే, ప్రజల ఆదాయంలో 7 శాతం తగ్గుదల నమోదైంది. పెరుగుతున్న ధరలను అందుకోలేని జనాలు అవసరాలనే వాయిదా వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కనీసావసరాలకు మాత్రమే బొటాబొటి ఆదాయంతో నెట్టుకొస్తున్న జనాభా దాదాపు 70 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఆదాయంలో ఏమాత్రం పొదుపు చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు 53 లక్షల వరకు ఉంటారని కూడా అంచనా. ఇంధన ధరలు అదుపు తప్పి పెరగడంతో ప్రజల ఆదాయంలో ఎక్కువ భాగం విద్యుత్తు బిల్లులు చెల్లింపులకు, వాహనాల ఇంధనానికే సరిపోతోందని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్’ (ఎన్ఐఈఎస్ఆర్) డిప్యూటీ డైరెక్టర్ స్టీఫెన్ మిలార్డ్ చెబుతున్నారు. దేశ ఆర్థికరంగంలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో నెలకొన్నాయని, ఈ పరిస్థితులు ప్రజల దైనందిన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. బ్రిటన్‌లో ఈ ఏడాది నిత్యావసరాల ద్రవ్యోల్బణం 11 శాతానికి చేరుకుంది. నిరుద్యోగం 5 శాతానికి మించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను 3 శాతం పెంచింది. రైళ్ల చార్జీలు ఒకేసారిగా 17.7 శాతం పెరిగాయి. రైళ్ల చార్జీల పెరుగుదల గత నలభయ్యేళ్లలో ఇదే అత్యధికం. ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది శీతాకాలం గట్టెక్కేదెలా అని సామాన్యులు దిగులు పడుతున్నారు. గదులు వెచ్చబరచుకోవడానికి ఇళ్లల్లో హీటర్లు వాడితే, రాబోయే బిల్లులు జనాల గుండెలను గుభిల్లుమనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో ఈ పరిస్థితులు మరో రెండేళ్లు ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని దేశాల్లో అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్ల పరిస్థితే ఇక్కట్లమయంగా కనిపిస్తుంటే, ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే దేశాల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తుందో కొన్ని దేశాల పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. మాంద్యం దెబ్బకు ఆఫ్రికా దేశమైన నైజీరియాలో బేకరీలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నైజీరియాలో గడచిన ఏడాదికాలంలోనే గోధుమపిండి ధర 200 శాతం పెరిగింది. చక్కెర ధర 150 శాతం, కోడిగుడ్ల ధర 120 శాతం మేరకు పెరిగాయి. బేకరీలు నష్టాలతో కుదేలవడంతో వాటిలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. ‘కోవిడ్’, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల నైజీరియాలో ఆర్థిక పరిస్థితులు బాగా దిగజారాయి. ఈ ఏడాది జూలై నాటికి నైజీరియాలో ఆహార ద్రవ్యోల్బణం 22 శాతానికి చేరింది. ఇంధన ధరలు 30 శాతం మేరకు పెరిగాయి. నైజీరియన్లు తమ ఆదాయంలో దాదాపు 60 శాతం ఆహారానికే ఖర్చు చేస్తారు. ధరల పెరుగుదల వల్ల జనాల వద్ద ఇతర కనీసావసరాలకు డబ్బులేని పరిస్థితి తలెత్తుతోంది. లాటిన్ అమెరికా దేశమైన పెరూలో ఈ ఏడాది జూలై నాటికి ఆహార ద్రవ్యోల్బణం 11.59 శాతానికి చేరింది. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం, దానికి నిరసనగా రైతుల ఆందోళనల ఫలితంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడి, మాంద్యం తీవ్రతను మరింతగా పెంచాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని పరిస్థితులకు ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే! ఇక ఆసియాలో బలమైన ఆర్థికశక్తిగా ఉన్న చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే మన రూపాయి పతనమై, 80కి చేరుకుంటే, యువాన్ 7కు చేరుకుంది. అమెరికా వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుండటంతో, యువాన్ విలువను తగ్గించుకున్నట్లు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది సగటున 9 శాతం వరకు ఉండవచ్చని ‘నోమురా’ నివేదిక అంచనా. మిగిలిన దేశాల కంటే మన పరిస్థితి కొంతైనా నయంగా ఉందనేదే కాస్త ఊరట. -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ఎకానమీపై మహమ్మారి పంజా!
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విస్తరించి, లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకున్న పక్షంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 3 శాతం లోపునకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. జీడీపీలో ప్రధానమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేపీఎంజీ దీన్ని రూపొందించింది. ఒకవేళ ఏప్రిల్ ఆఖరు నుంచి మే మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే.. 2020–21లో భారత వృద్ధి రేటు 5.3–5.7 శాతం స్థాయిలో ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ఇది జరిగే అవకాశమైతే లేదని పేర్కొంది. ఇక రెండో కోణంలో.. కరోనా వైరస్‌ను భారత్ కట్టడి చేసినా అంతర్జాతీయంగా మాంద్యం వస్తే.. భారత వృద్ధి రేటు 4–4.5 శాతం మధ్యలో ఉండవచ్చు. అలా కాకుండా మహమ్మారి మరింత ముదిరి, మాంద్యం వస్తే మాత్రం భారత వృద్ధి 3 శాతం లోపునకు పడిపోవచ్చని కేపీఎంజీ పేర్కొంది. దీంతో పాటు వివిధ రంగాలపై కరోనా వైరస్ ప్రభావాల గురించి విశ్లేషించింది. వాటిలో ముఖ్యమైన కొన్ని రంగాలు.. టెక్స్టైల్స్ 10–12 శాతం డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశీ టెక్స్టైల్స్, అపారెల్ రంగ ఉత్పత్తి 10–12 శాతం పడిపోవచ్చు. అలాగే రాబోయే మరికొన్ని త్రైమాసికాలు టెక్స్టైల్ ఎగుమతులు దెబ్బతినొచ్చు. తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. లాక్డౌన్ నాలుగు వారాలు మించి కొనసాగిన పక్షంలో దేశీయంగా 7.5 కోట్ల ఎంఎస్ఎంఈల్లో దాదాపు పావు వంతు సంస్థలు మూతబడవచ్చు. ఇది ఎనిమిది వారాలు పైగా కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సమాఖ్య (ఏఐఎంవో) అంచనా. ఆటోకు కష్టకాలం.. ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల కొనుగోళ్లకు గణనీయంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రజలు.. వాహనాల్లాంటి వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశముంది. కేవలం తప్పనిసరి రిపేర్ సంబంధ ఆఫ్టర్ మార్కెట్ సర్వీసులకు మాత్రమే కాస్త డిమాండ్ ఉండవచ్చు. కొనుగోలు శక్తి, సెంటిమెంటు బలహీనపడటం వల్ల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్ అంతంతే ఉంటుంది. నిత్యావసరాలు కాని సేవలన్నీ నిలిపివేయడం వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్ మరింత పడిపోతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో సంక్షోభం, బ్యాంకింగ్‌లో నెలకొన్న పరిస్థితులతో రుణ లభ్యత సమస్యల వల్ల అమ్మకాలు దెబ్బతినొచ్చు. నిర్మాణ రంగం..పెట్టుబడుల మందగమనం.. డిమాండ్ ఒక మోస్తరుగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం గణనీయంగా తగ్గిపోతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో మందగమనంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు తగ్గవచ్చు లేదా ద్వితీయార్ధానికి వాయిదా పడొచ్చు. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త పెట్టుబడులు మందగించడం వల్ల అనుబంధ రంగాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి రంగాలు స్వల్పకాలికంగా దెబ్బతిన్నా, కంపెనీలు చైనా నుంచి ఇతర ఆసియా దేశాలకు (భారత్, వియత్నాం, కాంబోడియా వంటివి) తమ తయారీ బేస్‌ను మార్చుకునే యోచనలో ఉన్నందున.. వేగంగా పుంజుకోవచ్చు. రిటైల్.. ఈకామర్స్‌కు సవాళ్లు.. బియ్యం, పప్పు ధాన్యాలు వంటి వాటిపై ప్రజల ఖర్చుల సరళిని కరోనా పరిణామాలు నిర్దేశించనున్నాయి. సరఫరా వ్యవస్థలకు రాబోయే రెండు, మూడు వారాలు పరీక్షా సమయంలాంటిది. ఈ–కామర్స్ రంగం వృద్ధి మందగించవచ్చు. నిత్యావసరయేతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పడిపోవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడం కూడా పెద్ద రిస్కే. అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మొదలైన విభాగాలు పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చు. బలహీన బ్యాంకులకు ఇబ్బందే... సొమ్ము భద్రత కోసం ఖాతాదారులు పటిష్టమైన పెద్ద బ్యాంకుల్లోకి డిపాజిట్లను మళ్లించుకుంటూ ఉండటం వల్ల బలహీన ప్రైవేట్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై లిక్విడిటీపరంగా ప్రతికూల ప్రభావం పడవచ్చు. మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్, నిర్మాణ తదితర రంగాల సం స్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా పడే అవకాశం ఉంది. ఇక రిటైల్ రుణాల విషయానికొస్తే అఫోర్డబుల్ హౌసింగ్, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్, సూక్ష్మ రుణాల విభాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఫార్మాకు ముడి వనరుల సమస్యలు.. చైనా నుంచి సరఫరా తగ్గిపోవడంతో ముడివనరుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే జనరిక్ డ్రగ్స్ తయారీ సంస్థలపై ప్రభావం పడుతోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతుండటంతో ఈ సమస్య కాస్త తగ్గవచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా కార్మికులు దొరక్కపోవడం, ప్యాకింగ్ మెటీరియల్ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో ఉత్పత్తి దెబ్బతింటోంది. ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల (మాస్కులు, గ్లవ్స్ మొదలైనవి) సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు ఔషధాలను నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులకు డిమాండ్ పెరగవచ్చు. ఈసారి వృద్ధి 1.6 శాతమే... గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. 2020–21లో ఇది 1.6 శాతమే ఉండవచ్చని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని, ఇకనైనా జోరు పెంచాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ‘విధానాలపరంగా ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందిస్తున్నా.. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్, వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. తదుపరి క్వార్టర్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది‘ అని వివరించింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ సరిపోదు.. కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60% ఉండే వినియోగం.. లాక్డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది. -
‘కోవిడ్’పైనే దృష్టి..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టాక్ మార్కెట్ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు (6.9 శాతం), నిఫ్టీ 879 పాయింట్లు (7.2 శాతం) నష్టపోయాయి. శుక్రవారం ఒక్కరోజులోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనంగా నమోదైంది. ఇంతటి పతనానికి కారణమైన కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారంలో సూచీలు కోలుకునేనా..? కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఇంకేం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్లో కోవిడ్–19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్.. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు సైతం సోకడం మరింత కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు మార్కెట్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం పట్ల ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడం అనే అంశం ముడిపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. జీడీపీ 4.7 శాతంగా నమోదైంది. ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా మార్కెట్ నిలదొక్కుకునేదని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలు, కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ సూచీలను నడిపిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం... మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా.. సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అమెరికా మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుంది. మరోవైపు శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్‌పై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆదివారం వెల్లడైన ఆటో రంగ ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ విక్రయాలు గత నెలలో 1.6% పడిపోయాయి. ఫిబ్రవరిలో రూ. 6,554 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గతనెల్లో రూ. 6,554 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరి 3–28 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 1,820 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 4,734 కోట్లను వీరు కుమ్మరించారు. మార్కెట్ గతవారం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ.. వీరి పెట్టుబడులు ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. -
విమానానికీ వైరస్..!
టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారుతోన్న కోవిడ్–19(కరోనా) వైరస్.. ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎకానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారితీస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన పోటీవాతావరణం వంటి అనేక సమస్యలను నెట్టుకుంటూ ముందుకు సాగుతోన్న విమానయాన కంపెనీలకు ఇప్పుడు ఆక్యుపెన్సీ (ఒక విమానంలోని మొత్తం ప్రయాణికులు) సమస్య సవాలు విసురనుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా సోకిపోయే వైరస్ కావడంతో ప్రయాణికులు వీలైనంత తక్కువగా విమానయానం చేసేందుకే చూస్తారు. ప్రజలు ఇళ్లలోనుంచి వీలైనంత తక్కువగా బయటకు రావడం మంచిదని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం ఈ వైరస్ నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలో విమానయాన రంగం భారీగానే నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) విశ్లేషించింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి 29 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. విమాన రద్ధీ 4.7% వరకు తగ్గనుంది. అంటే, 2008 ఆర్థిక సంక్షోభం సమయం తరువాత విమానయాన రంగం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఇదేనన్నమాట. ఆసియా దేశాల్లో అధిక ప్రభావం చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. అక్కడికి సేవలందిస్తున్న ఎయిర్‌లైన్స్‌కు అపార నష్టాన్ని కలిగించనుంది. ఇక చైనాకు సర్వీసులు నడుపుతున్న కంపెనీలదీ ఇదే పరిస్థిదనేది ఐఏటీఏ అంచనా. గతంలో చైనాను అల్లాడించిన సార్స్(ఎస్ఏఆర్ఎస్) అనుభవాన్ని ప్రజలు మరిచిపోక పోవడం.. ప్రస్తుత వైరస్ కూడా ఇటువంటిదే అని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించడం అనేవి విమాన ప్రయాణాలను తగ్గించేవిగా కొనసాగుతున్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత సమయంలో అనేక సంస్థలు కుప్పకూలిపోయిన మాదిరిగా.. ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడుపుతున్న కంపెనీల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది. బ్రిటిష్ ఎయిర్వేస్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్తో పాటు అమెరికాకు చెందిన 3 అతిపెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాకు తమ సర్వీసులను రద్ధు చేసినట్లు ప్రకటించాయి. పరిస్థితి ఆధారంగా మే నెల చివరి వరకు నిలిపివేసే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2020లో అంతర్జాతీయ విమానయాన రంగ ప్రయాణం ప్రతికూలమేనని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ అలెగ్జాండర్ డి జునియక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంద న్నారు. ఈ ప్రాంతంలో విమాన రద్ధీ ఏకంగా 13% వరకు తగ్గనుందని ఐఏటీఏ అంచనావేసింది. -
ఎకానమీకి వైరస్!!
న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కోవిడ్–19(కరోనా) వైరస్ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. ‘ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ పేర్కొంది. వాణిజ్య యుద్ధ భయాల మూలంగా 2019లో ప్రపంచ వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, అమెరికా.. చైనాలతో పాటు భారత్‌లోనూ స్థూల దేశీయోత్పత్తి మందగించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గి, కొత్త ఏడాదిలో పరిస్థితులు చక్కబడవచ్చని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా కరోనా వైరస్ తెరపైకి రావడం గమనార్హం. చైనా హుబెయ్ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో బైటపడిన ఈ వైరస్ ఆ దేశంతో పాటు ఇతరత్రా పలు దేశాలకు కూడా విస్తరించడం ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. వైరస్ ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘మార్చి ఆఖరు నాటికల్లా వైరస్ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం‘ అని ఈఐయూ తెలిపింది. భారత్‌పై బుల్లిష్..: ప్రపంచ ఎకానమీ, చైనా విషయంలో నిరుత్సాహపర్చే అంచనాలు ప్రకటించిన ఈఐయూ.. భారత్‌పై మాత్రం బులిష్ ధోరణి కనపర్చింది. కరోనా వైరస్ తాకిడి భారత్‌లో గణనీయంగా విస్తరించని పక్షంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉండగలదని పేర్కొంది. -
ఉగ్రవాదంతో ట్రిలియన్ డాలర్ల నష్టం
బ్రసీలియా: ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా నెలకొన్న పరిస్థితులు వాణిజ్య, వ్యాపార రంగాలను పరోక్షంగానైనా, లోతుగా దెబ్బతీశాయన్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో భాగంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో గురువారం మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ దేశాల సహకారాన్ని మోదీ ప్రశంసించారు. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ప్రఖ్యాత తమారటి ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ఇతర సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధికి, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ‘ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ఉగ్రవాదం కారణంగా 1.5% తగ్గింది. గత పదేళ్లలో ఉగ్రవాదం కారణంగా 2.25 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని మోదీ తెలిపారు. ‘ఇటీవలే భారత్‌లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఫిట్నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్ దిశ ఎలా ఉండాలో చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్ సరైనదని మోదీ అభిప్రాయపడ్డారు. గణతంత్రానికి బ్రెజిల్ అధ్యక్షుడు 2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు. ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో బుధవారం మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. జిన్‌పింగ్, పుతిన్‌లతో చర్చలు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో మోదీ విడిగా మాట్లాడారు. రష్యాలో వచ్చే సంవత్సరం మేలో జరిగే ‘విక్టరీ డే’వేడుకలకు మోదీని పుతిన్ ఆహ్వానించారు. రైల్వేలో ద్వైపాక్షిక సహకారంపై, ముఖ్యంగా నాగపూర్, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడంపై సమీక్ష జరిపారు. -
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుందని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ) తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందన్న అంచనాలకు వచ్చింది. 2018లో 6.8 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు అంతర్జాతీయ వృద్ధిని దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి నెట్టిందని అభివర్ణించింది. -
ప్రజలపై మొండి బాకీల బండ !
విశ్లేషణ: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐకి సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారా? బకాయిలు పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? అమెరికాలో 2008లో బడా బ్యాంకుల్లో మొండి బాకీలు పేరుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు తీవ్రంగా కుదిపేస్తున్నాయన్న విషయంలో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మూడునాలుగుసార్లయినా ఆయన బ్యాంకర్లతో సమావేశాలు జరిపి బ్యాంకులను హెచ్చరిస్తూ వచ్చారు. ఒకపక్క ఎన్ని హెచ్చరికలు చేసినా మరోవైపు మొండి బకాయిలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం బ్యాంకులిచ్చిన రుణాల్లో మొండి బకాయిల శాతం 2.4 శాతం ఉండగా నేడది 4.5 శాతానికి పెరిగింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తాయి. బ్యాంకుల అస్తవ్యస్త నిర్వహణ, రాజకీయ ఒత్తిళ్లు, రిజర్వు బ్యాంకు వైఫల్యం, అవినీతి అసలు కారణాలు. దేశంలో మాంద్య పరిస్థితులు నెలకొనటంతో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోవడం వల్లనే మొండి బాకీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న చిదంబరమే పరోక్షంగా అప్పులు ఎగవేస్తున్నవారికి వత్తాసు పలుకుతున్నారు. ఈ మొండి బకాయిలు రూ. లక్షల కోట్లలో ఉన్నాయి. రుణాలమీద వడ్డీలను తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్న కార్పొరేట్లు వడ్డీల భారాన్ని తట్టుకోలేక తాము రుణాలను చెల్లించలేకపోతున్నామని చెపుతున్నారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. కాని ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం కార్పొరేట్ రంగానికి దన్నుగా నిలిచారు. వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు ఉపశమనం కలిగించాలని బాహాటంగా ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన్ని దువ్వూరి ఖాతరు చే యలేదు. వీరిద్దరి మధ్య వివాదం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఈ వివాదాన్ని వాటంగా తీసుకున్న కార్పొరేట్లు అసలుకూ, వడ్డీకీ ఎసరు పెట్టడం ప్రారంభించారు. ఇలా మొండి బకాయిలు పెరగడానికి కేంద్రమే కారణమని చెప్పాలి. ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కిన కార్పొరేట్లకూ, సంపన్నులకూ ఈ దేశంలో రూ. రెండు లక్షల కోట్లకుపైగా ఉన్న మొండి బకాయిలను చెల్లించడం ఒక లెక్కా? వీరు ఆఫ్రికాలో భూములు కొనడానికీ, విదేశాల్లో కంపెనీలను కొనేయడానికీ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాము ఎన్నికకావటానికి, తమ విధానాన్ని సమర్థించేవారికి రూ. లక్షల కోట్ల అందించేవారికి బ్యాంకులకు రూ. రెండు లక్షల కోట్లు చెల్లించటం ఒక లెక్కా? ప్రభుత్వ నేతలే తమకు వత్తాసు పలుకుతుంటే వారు బ్యాంకులను ఎందుకు ఖాతరు చేస్తారు? రాజకీయ నాయకులకూ, మంత్రులకూ, ఇటు కేంద్రంలో, అటు బ్యాంకుల్లో ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులకు ఉన్న సంబంధాల దృష్ట్యా బ్యాంకుల్లో కూడా అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వరంగంలో బ్యాంకులు ఉండటం కేంద్రంలో నేతలకు ఎంతో అవసరం. అయి తే ఇక్కడ మరో వాదన ఉంది. విదేశీ బ్యాంకులు మన దేశంలో అనుబంధ బ్యాంకులను తెరవడానికీ, దేశంలో ప్రైవేటురంగంలో కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు ఇవ్వడానికీ ప్రభుత్వరంగ బ్యాంకులు అవరోధాలు కల్పించాయి. ప్రభుత్వరంగంలోనే బ్యాంకింగ్ వ్యవస్థ కొనసాగాలని ఉద్యోగులు కూడా గట్టిగా పోరాడుతున్నారు. మొండిబకాయిలను ఇలాగే పెరగనిచ్చి ప్రభుత్వరంగ బ్యాంకులకు అసమర్థత అంటగట్టి ప్రైవేటీకరణ కూ, విదేశీ బ్యాంకుల ప్రవేశానికీ రాచబాట వేస్తున్నారా? పెరుగుతున్న మొండి బకాయిలను మరిం తగా పెరగనివ్వటంలో ఇలాంటి కుట్ర ఏమైనా ఉందా? నయా ఉదారవాదవిధానాన్ని తమ ప్రభుత్వవిధానంగా చేపట్టడంలో ఇలాంటి మతలబులు అతిసామాన్యం. బ్యాంకింగ్ వ్యవస్థపై రిజర్వు బ్యాంకుకు సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారా? మొండి బకాయిలు కొండలా పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? మీ ఇంట్లో చోరీ చేయబోయిన వ్యక్తి పట్టుబడితే ఓ స్తంభానికి కట్టేసి చిత గ్గొడతారు. తర్వాతే పోలీసులకు అప్పగిస్తారు కదా. ఇదే బ్యాంకింగ్ రంగానికి వర్తింప చేయండి. కంపెనీలు బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని మాంద్య పరిస్థితులను బూచిగా చూపించి తిరిగి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నాయి. కాని ఆ కంపెనీల లాభాలు మాత్రం తగ్గటం లేదు. రుణం చెల్లించనివారెవరో తెలుసు. ఎంత చెల్లించాలో కూడా తెలుసు. అయినా గప్‌చుప్ సాంబారుబుడ్డి అన్నట్లు ఆ రుణాల మొత్తం పెరిగిపోతోం ది. అలా ఎగ్గొట్టినవాళ్లు భుజాలెగరేసుకుని తిరుగుతున్నారు. వారి ఆస్తులను వేలం వేసి రుణం చెల్లింపులో జమ చేయవచ్చుకదా? పైన చెప్పిన ఉదాహరణలో దొంగను పోలీసుకు అప్పచెప్పినట్లు ప్రభుత్వంగాని, బ్యాంకు యాజమాన్యాలుగాని ఎందుకు చర్య తీసుకోవు? ఒక బడుగు రైతు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే, అతని ఇంట్లో వస్తువులను బయటకు విసిరేసి, ఇంటికి తాళం వేస్తారే! అదే పని కార్పొరేట్ల విషయంలో ఎందుకు చెయ్య రు? పాలకులకూ, కార్పొరేట్లకూ మధ్య ఉన్న బీరకాయ పీచు చుట్టరికం అలాంటిది. రుణం తీర్చలేక పరువు పోతుందని లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్లకు ఆపాటి పరువుమర్యాదలుండవా? రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించకపోతే ఏం చేయాలో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వడ్డీ చెల్లించనక్కర్లేదు, అసలైనా చెల్లించవచ్చని రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించింది. సకాలంలో చెల్లించని వారి రుణాల పునర్వ్యవస్థీకరణకు బ్యాంకు బోర్డులకు అధికారమిచ్చింది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిలే రూ. 67,799 కోట్లుగా ఉన్నాయని అంచనా. దేశంలో మొత్తం బ్యాంకుల మొండి బాకీలు రూ.రెండు లక్షల కోట్లు. ఇలాంటి రుణాలను కొన్ని సంస్థలు రిస్కుతో తక్కువ రేటుకు కొనుగోలు చేసి తర్వాత తమదైన పద్ధతిలో వాటిని వసూలు చేసుకుంటాయి. భవిష్యత్తులో బ్యాంకులు కూడా తమ రుణాలను ఈ దారిలో అమ్మకానికి పెట్టుకుని తమ భారాన్ని వదిలించుకుంటాయి. దీనర్ధం ఏమంటే... కార్పొరేట్లపై ఎలాంటి భారం పడదు. వారు క్షేమంగానే ఉంటారు. పోయేది ప్రజల డబ్బే. పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు క్షేమంగానే ఉంటారని ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. అసలు కేంద్రమే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్లమేర రుణాలిస్తూనే ఉంది. వాటిపై ఏటా కేంద్రం కోట్లాది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు అసలు మొత్తం వసూలు గురించి పట్టించుకోదు. ఎందుచేతనంటే అసలు చెల్లింపు పట్టించుకోనంతకాలం కేంద్రప్రభుత్వం జుట్టు ఆ బ్యాంకు చేతుల్లో ఉంటుంది మరి. ప్రభుత్వరంగ బ్యాంకులో తమ సొమ్ముకు భద్రత ఉంటుందన్న నమ్మకంతో దేశంలోని ప్రజలు తమ డిపాజిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలను దాచుకుంటున్నారు. కార్పొరేట్లకూ, కుబేరులకూ బ్యాంకులు ఇచ్చే రుణాలు ఈ మొత్తం నుంచే. వారు రుణం చెల్లించకపోతే ప్రమాదంలో పడేది ప్రజల డబ్బే. ప్రజల డబ్బు సురక్షితంగా ఉండాలన్న లక్ష్యం కోసమే బ్యాంకు అధికారులూ, ఉద్యోగులూ సమ్మెలు చేస్తుంటారు. ఈ రుణాల వసూలు విషయంలో ప్రస్తుత సర్కారు మెతకవైఖరి అవలంబిస్తోంది. ఈ మొండి బకాయిలు చెల్లించనివారే మోడీ పల్లకీ మోస్తున్నారు. ఆ మోడీతో ఈ ఎన్నికల్లో చేతులు కలుపుతున్నది చంద్రబాబు, లోక్‌సత్తా, కుర్ర‘నాయకుడు’ పవన్. వీరిని మళ్లీ గద్దెనెక్కించి మరో ఐదేళ్లు కుంపటినెత్తిన పెట్టుకుంటారో... లేదో... మీ ఇష్టం. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు