టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారుతోన్న కోవిడ్–19(కరోనా) వైరస్.. ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎకానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారితీస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన పోటీవాతావరణం వంటి అనేక సమస్యలను నెట్టుకుంటూ ముందుకు సాగుతోన్న విమానయాన కంపెనీలకు ఇప్పుడు ఆక్యుపెన్సీ (ఒక విమానంలోని మొత్తం ప్రయాణికులు) సమస్య సవాలు విసురనుంది.
కరోనా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా సోకిపోయే వైరస్ కావడంతో ప్రయాణికులు వీలైనంత తక్కువగా విమానయానం చేసేందుకే చూస్తారు. ప్రజలు ఇళ్లలోనుంచి వీలైనంత తక్కువగా బయటకు రావడం మంచిదని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం ఈ వైరస్ నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలో విమానయాన రంగం భారీగానే నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) విశ్లేషించింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి 29 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. విమాన రద్ధీ 4.7% వరకు తగ్గనుంది. అంటే, 2008 ఆర్థిక సంక్షోభం సమయం తరువాత విమానయాన రంగం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఇదేనన్నమాట.
ఆసియా దేశాల్లో అధిక ప్రభావం
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. అక్కడికి సేవలందిస్తున్న ఎయిర్‌లైన్స్‌కు అపార నష్టాన్ని కలిగించనుంది. ఇక చైనాకు సర్వీసులు నడుపుతున్న కంపెనీలదీ ఇదే పరిస్థిదనేది ఐఏటీఏ అంచనా. గతంలో చైనాను అల్లాడించిన సార్స్(ఎస్‌ఏఆర్‌ఎస్) అనుభవాన్ని ప్రజలు మరిచిపోక పోవడం.. ప్రస్తుత వైరస్ కూడా ఇటువంటిదే అని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాఖ్యానించడం అనేవి విమాన ప్రయాణాలను తగ్గించేవిగా కొనసాగుతున్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత సమయంలో అనేక సంస్థలు కుప్పకూలిపోయిన మాదిరిగా.. ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడుపుతున్న కంపెనీల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌తో పాటు అమెరికాకు చెందిన 3 అతిపెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాకు తమ సర్వీసులను రద్ధు చేసినట్లు ప్రకటించాయి. పరిస్థితి ఆధారంగా మే నెల చివరి వరకు నిలిపివేసే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2020లో అంతర్జాతీయ విమానయాన రంగ ప్రయాణం ప్రతికూలమేనని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ అలెగ్జాండర్ డి జునియక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంద న్నారు. ఈ ప్రాంతంలో విమాన రద్ధీ ఏకంగా 13% వరకు తగ్గనుందని ఐఏటీఏ అంచనావేసింది.
Comments
Please login to add a commentAdd a comment