మందగమనంలో ఆర్ధిక రంగం.. | World Economic Outlook About Global Crisis | Sakshi
Sakshi News home page

మందగమనంలో ఆర్ధిక రంగం..

Published Sun, Sep 11 2022 3:56 PM | Last Updated on Sun, Sep 11 2022 3:57 PM

World Economic Outlook About Global Crisis - Sakshi

‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’– ఒక సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ ఊతపదంగా ఉపయోగించిన డైలాగ్‌ ఇది. ఇప్పుడు ఒక దేశమనేం ఖర్మ యావత్‌ ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండేళ్లు పూర్తిగా పీడించిన ‘కోవిడ్‌’ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు ఇప్పుడు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ‘కరోనా’ తాకిడి సద్దుమణిగిందనుకుంటున్న ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. దీని ఫలితంగా కనీస నిత్యావసరాల కోసం, ఉపాధి కోసం ప్రజలు నానా ఇక్కట్లకు లోనవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల నిరాశాజనకమైన పరిస్థితులు, మరింత అనిశ్చితి నెలకొన్నాయని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌’ ఈ ఏడాది జూలైలో ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచ ఆర్థికరంగంలో ప్రస్తుత మందగమనానికి దారితీసిన కారణాలను, మందగమనం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం...

కోవిడ్‌ మహమ్మారి, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టాయి. కోవిడ్‌ మహమ్మారి కాలంలో లాక్‌డౌన్‌లు దేశ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలను కుదేలయ్యేలా చేశాయి. చాలాచోట్ల వివిధ రంగాల్లో పనిచేసే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఆన్‌లైన్‌ సేవలతో కాలక్షేపం చేసినప్పటికీ, కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ కాలంలో వస్తూత్పత్తి, భవన నిర్మాణ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు పెరుగుతున్నంత వేగంగా సామాన్యుల ఆదాయాలు పెరగకపోవడంతో వారి కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణించింది. ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితిలో పడ్డారు. ఫలితంగా విపణిలో లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ‘ప్రపంచ దేశాలు ఈ ఆర్థిక మందగమనాన్ని తప్పించుకోవడం కష్టం’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ వ్యాఖ్యానించారంటే, పరిస్థితుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే!

ఇదే మొదటిసారి కాదు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. ఆధునిక ప్రపంచంలో 1930 దశకంలో తీవ్రమైన ఆర్థికమాంద్యం సంభవించింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఆకలితో అల్లాడాయి. అందుకే, 1930 దశకాన్ని ‘హంగ్రీ థర్టీస్‌’గా పేర్కొంటారు. రెండు ప్రపంచయుద్ధాల నడుమ ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభమది. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఆర్థికంగా తేరుకున్నాయి. అభివృద్ధి బాటలో ముందుకు సాగాయి. దాదాపు మూడు దశాబ్దాల కాలం ప్రపంచ ఆర్థిక రంగానికి పెద్ద అవరోధాలేవీ ఎదురు కాలేదు. ఆ తర్వాత గడచిన శతాబ్దిలో 1974–75, 1981–82, 1990–91 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రస్తుత శతాబ్దిలో 2007–09లో ప్రపంచ ఆర్థిక మందగమనం ఏర్పడినా, భారత్‌ పెద్దగా ఇబ్బంది పడకుండానే తేరుకుంది. ప్రస్తుత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మళ్లీ మొదలైంది. దీని ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత వంటనూనెల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్‌ సిలిండర్‌ సామాన్యులకు గుదిబండగా మారింది. కట్టెల పొయ్యిల పొగ బారి నుంచి మహిళలకు విముక్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మారుమూల పల్లెల్లో సైతం ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్లు వచ్చాయి. అప్పట్లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.527 ఉండేది. ఇప్పుడు సిలిండర్‌ ధర దాదాపు పదకొండు వందల రూపాయలకు చేరింది. దీంతో దేశంలోని పలు మారుమూల పల్లెల్లో గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నప్పటికీ జనాలు కట్టెల పొయ్యిలపైనే ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిగిలిన నిత్యావసరాల ధరలూ గణనీయంగా పెరిగాయి. సామాన్యుల ఆదాయంలో మాత్రం ఇదేస్థాయి పెరుగుదల నమోదు కాకపోవడంతో జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు.

‘కోవిడ్‌’ తర్వాత దేశంలో నిరుద్యోగం కూడా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక మందగమనం ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కాస్త తక్కువగానే ఉంది. ఒకరకంగా భారత్‌ మీద మాంద్యం ప్రభావం అత్యల్పంగా మాత్రమే ఉంది. ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనా 8.8 శాతం ఉండగా, దీనిని 7.7 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వెల్లడించింది. భారత్‌ వృద్ధిరేటు ఈసారి 7.4 శాతం వరకు ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023 నాటికి 2 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొన్ని దేశాల్లో మాంద్యం పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

సంక్షోభంలో శ్రీలంక
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యానికి శ్రీలంక అత్యంత దారుణంగా ప్రభావితమైంది. దేశం దివాలా తీసింది. ఇంధనానికి తీవ్రమైన కరువు ఏర్పడి, ప్రతిరోజూ గంటల తరబడి విద్యుత్తు కోతలు సామాన్యంగా మారాయి. దేశంలో ఎటుచూసినా ఆహార కొరత కారణంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి నిరసనలు తారస్థాయికి చేరుకోవడంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశాన్ని విడిచి పరారయ్యారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం 2019లోనే మొదలైంది. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలకు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఈ ఏడాది జూన్‌లో సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటించారు. విదేశీ రుణాలను చెల్లించలేని దుస్థితిలో చిక్కుకుపోయి, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోనే 21వ శతాబ్దిలో మొదటి సార్వభౌమ ఎగవేతదారుగా మారింది. అంతర్యుద్ధం తర్వాత నిలకడలేని ప్రభుత్వాలు, ఇష్టానుసారం పన్నుల కోతలు, నోట్ల ముద్రణ వంటి అనాలోచితమైన ఆర్థిక చర్యలకు దిగడంతో శ్రీలంక పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. మితిమీరి నోట్లు ముద్రిస్తూ పోతే ఆర్థిక సంక్షోభం తప్పదని ఐఎంఎఫ్‌ ఇచ్చిన సలహాను శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు పెడచెవిన పెట్టింది.

ఫలితంగా ‘కోవిడ్‌’ ముందునాటికి దాదాపు 5 శాతానికి కాస్త ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం, 2022 ఫిబ్రవరి నాటికి 18 శాతానికి చేరుకుంది. ఇక ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్‌ నాటికి 75.8 శాతానికి చేరింది. నిత్యావసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే శ్రీలంక, చెల్లింపులు జరపలేని స్థితికి చేరుకోవడంతో దిగుమతులు నిలిచిపోయి, నిత్యావసరాలకు భారీ కొరత ఏర్పడింది. దిగుమతుల కోసం శ్రీలంక ఎక్కువగా భారత్, చైనాలపైనే ఆధారపడుతోంది. దిగుమతులకు గండిపడ్డాక సరుకుల సరఫరా కంటే గిరాకీ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోవడంతో ప్రజలు పస్తులుంటున్నారు. ఆదాయం కోసం శ్రీలంక ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడేది. ఎక్కువగా యూరోపియన్‌లు, ముఖ్యంగా రష్యన్‌ పర్యాటకులు శ్రీలంకకు వస్తుండేవారు. ‘కోవిడ్‌’ దెబ్బకు పర్యాటకరంగం కుదేలైంది. ‘కోవిడ్‌’ సద్దుమణిగినా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలవడంతో పర్యాటకుల రాక బాగా తగ్గిపోయింది. ఇక అమెరికన్‌ డాలర్‌తో పోల్చుకుంటే శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శ్రీలంక ప్రపంచ దేశాల సాయం కోసం చూస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు సాయంగా భారత్‌ 4 బిలియన్‌ డాలర్లు (31,273 కోట్లు) ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే విదేశీ మారక నిల్వల సమస్యను పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ పతనం వేగాన్ని తగ్గించేందుకు మొదట్లోనే చర్యలు ప్రారంభించినట్లయితే ఇప్పుడు ఇంతటి కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తేది కాదని ఆయన అన్నారు. అయితే, దేశం దివాలా తీసినట్లు ప్రకటించడం వెనుక అధ్యక్షుడు రాజపక్స కుటుంబ సభ్యుల కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో దోచుకున్న సొమ్మును రాజపక్స కుటుంబం విదేశీ బ్యాంకుల్లో దాచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దివాలా తీసి దిక్కు తోచని స్థితిలో పడ్డ శ్రీలంక ప్రస్తుతం ఐఎంఎఫ్‌ సాయం కోసం ఎదురుచూస్తోంది. 

అగ్రరాజ్యాలకూ దడ పుట్టిస్తున్న ధరలు
అగ్రరాజ్యాలు సైతం ఆర్థిక మందగమనంలో చిక్కుకున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో పలు దేశాల్లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. అమెరికాలో ఈ ఏడాది జూలై నాటికి ద్రవ్యోల్బణం 10.9 శాతానికి చేరుకుంది. అమెరికాలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం 1979 తర్వాత ఇదే మొదటిసారి. మన దేశంలో పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం మాదిరిగానే అమెరికాలో ఫెడరల్‌ ఫ్రీ స్కూల్‌ మీల్స్‌ ప్రోగ్రాం అమలవుతోంది. ధరలు అదుపు తప్పడంతో ఈ పథకం కింద పాఠశాలలకు ఆహార సరఫరా చేయడానికి ఆహార సరఫరాదారులెవరూ ముందుకు రావడం లేదు. అమెరికాలో ఫెడరల్‌ ఫ్రీ స్కూల్‌ మీల్స్‌ ప్రోగ్రాం కింద పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో నిర్ణీత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తారు. ధరల పెరుగుదల నేపథ్యంలో కచ్చితమైన ప్రమాణాలతో కూడిన పదార్థాలను సరఫరా చేయడం సరఫరాదారులకు దుస్సాధ్యంగా ఉంటోంది. అమెరికాలో ఏడాది వ్యవధిలోనే ఇంధన ధరలు దాదాపు 60 శాతం మేరకు పెరిగాయి. దీనివల్ల నిత్యావసరాల రవాణాకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వృద్ధిరేటు 2021లో 5.7 శాతం నమోదైతే, 2022లో ఈ వృద్ధిరేటు 2.3 శాతం వరకు మాత్రమే ఉండగలదని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

అమెరికాలో ఆర్థిక మందగమనం 2024 వరకు కొనసాగవచ్చని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి ముందుగానే తేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని ప్రముఖ ఆర్థకవేత్త స్టీఫెన్‌ రోష్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక మాంద్యంలో పడిందని ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతుంటే, అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ మాత్రం అదంతా ఉత్తదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికీ నెలకు నాలుగు లక్షలకు పైగా ఉద్యగాలను సృష్టించగలుగుతున్నామని, గత ఏడాది 5.5 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి సాధించామని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితులపై జానెట్‌ వ్యాఖ్యలు ‘ట్వట్టర్‌’లో పెద్ద చర్చకే దారితీశాయి. అమెరికాలో 2022 రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 0.9 శాతం మేరకు తగ్గింది. వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో ఉన్నవారిలో కొందరు ఉపాధి కోల్పోవడం, వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను తగ్గించుకోవడం, పరిశ్రమలు తమ ఉత్పాదకతకు తగ్గించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆర్థిక మాంద్యం మొదలైనట్లేనని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో 2023లోనూ ఆర్థికమాంద్యం పరిస్థితులు కొనసాగవచ్చని మూడింట రెండొంతుల మంది జనాలు నమ్ముతున్నట్లు ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ సర్వేలో తేలింది. అయితే, మాంద్యం కచ్చితంగా ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 


ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్‌ సైతం ద్రవ్యోల్బణం ధాటికి అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అదుపు తప్పడంతో సామాన్యులు నిర్బంధ పొదుపుచర్యలు పాటిస్తున్నారు. దేశంలో కొందరికైతే పస్తులుండక తప్పని పరిస్థితులూ తలెత్తుతున్నాయి. బ్రిటన్‌లో ఒకవైపు నిత్యావసరాల ధరలు అదుపుతప్పి పెరుగుతుండగా, మరోవైపు ప్రజల ఆదాయం ఈ ఏడాది 2.5 శాతం తగ్గింది. ‘కోవిడ్‌’ ముందు కాలంతో పోల్చుకుంటే, ప్రజల ఆదాయంలో 7 శాతం తగ్గుదల నమోదైంది. పెరుగుతున్న ధరలను అందుకోలేని జనాలు అవసరాలనే వాయిదా వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కనీసావసరాలకు మాత్రమే బొటాబొటి ఆదాయంతో నెట్టుకొస్తున్న జనాభా దాదాపు 70 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఆదాయంలో ఏమాత్రం పొదుపు చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు 53 లక్షల వరకు ఉంటారని కూడా అంచనా. ఇంధన ధరలు అదుపు తప్పి పెరగడంతో ప్రజల ఆదాయంలో ఎక్కువ భాగం విద్యుత్తు బిల్లులు చెల్లింపులకు, వాహనాల ఇంధనానికే సరిపోతోందని

‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ రీసెర్చ్‌’ (ఎన్‌ఐఈఎస్‌ఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ స్టీఫెన్‌ మిలార్డ్‌ చెబుతున్నారు. దేశ ఆర్థికరంగంలో ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో నెలకొన్నాయని, ఈ పరిస్థితులు ప్రజల దైనందిన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. బ్రిటన్‌లో ఈ ఏడాది నిత్యావసరాల ద్రవ్యోల్బణం 11 శాతానికి చేరుకుంది. నిరుద్యోగం 5 శాతానికి మించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 3 శాతం పెంచింది. రైళ్ల చార్జీలు ఒకేసారిగా 17.7 శాతం పెరిగాయి. రైళ్ల చార్జీల పెరుగుదల గత నలభయ్యేళ్లలో ఇదే అత్యధికం. ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది శీతాకాలం గట్టెక్కేదెలా అని సామాన్యులు దిగులు పడుతున్నారు. గదులు వెచ్చబరచుకోవడానికి ఇళ్లల్లో హీటర్లు వాడితే, రాబోయే బిల్లులు జనాల గుండెలను గుభిల్లుమనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో ఈ పరిస్థితులు మరో రెండేళ్లు ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

మరికొన్ని దేశాల్లో
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌ల పరిస్థితే ఇక్కట్లమయంగా కనిపిస్తుంటే, ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే దేశాల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తుందో కొన్ని దేశాల పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. మాంద్యం దెబ్బకు ఆఫ్రికా దేశమైన నైజీరియాలో బేకరీలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నైజీరియాలో గడచిన ఏడాదికాలంలోనే గోధుమపిండి ధర 200 శాతం పెరిగింది. చక్కెర ధర 150 శాతం, కోడిగుడ్ల ధర 120 శాతం మేరకు పెరిగాయి.

బేకరీలు నష్టాలతో కుదేలవడంతో వాటిలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. ‘కోవిడ్‌’, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల నైజీరియాలో ఆర్థిక పరిస్థితులు బాగా దిగజారాయి. ఈ ఏడాది జూలై నాటికి నైజీరియాలో ఆహార ద్రవ్యోల్బణం 22 శాతానికి చేరింది. ఇంధన ధరలు 30 శాతం మేరకు పెరిగాయి. నైజీరియన్లు తమ ఆదాయంలో దాదాపు 60 శాతం ఆహారానికే ఖర్చు చేస్తారు. ధరల పెరుగుదల వల్ల జనాల వద్ద ఇతర కనీసావసరాలకు డబ్బులేని పరిస్థితి తలెత్తుతోంది. లాటిన్‌ అమెరికా దేశమైన పెరూలో ఈ ఏడాది జూలై నాటికి ఆహార ద్రవ్యోల్బణం 11.59 శాతానికి చేరింది. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం, దానికి నిరసనగా రైతుల ఆందోళనల ఫలితంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడి, మాంద్యం తీవ్రతను మరింతగా పెంచాయి.

ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లోని పరిస్థితులకు ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే! ఇక ఆసియాలో బలమైన ఆర్థికశక్తిగా ఉన్న చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే మన రూపాయి పతనమై, 80కి చేరుకుంటే, యువాన్‌ 7కు చేరుకుంది. అమెరికా వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుండటంతో, యువాన్‌ విలువను తగ్గించుకున్నట్లు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది సగటున 9 శాతం వరకు ఉండవచ్చని ‘నోమురా’ నివేదిక అంచనా. మిగిలిన దేశాల కంటే మన పరిస్థితి కొంతైనా నయంగా ఉందనేదే కాస్త ఊరట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement