
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.
‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..
బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు.