war
-
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
ఉక్రెయిన్‌లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్‌ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్‌లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్‌కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్‌గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్‌పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్‌లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్‌తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్లాన్..?
టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం -
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం! తాజాగా..
జెరుసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై భూతల దాడులకు దిగాక హెజ్బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్‌లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్‌పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు. ఐరాస కార్యాలయం ధ్వంసం వెస్ట్‌బ్యాంక్‌లోని నూర్షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. లెబనాన్‌లో 24 మంది మృతి లెబనాన్‌లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్‌లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్‌హౌస్‌లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్
-
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
హమాస్ కు చావు దెబ్బ.. హమాస్ చీఫ్ సిన్వర్ హతం
-
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): వరుసబెట్టి అగ్రనేతలకు కోల్పోతున్న హమాస్‌కు గురువారం మరో శరాఘాతం తగిలింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ తమ దాడుల్లో మృతి చెందాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. సిన్వర్‌ను అంతమొందించామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడికి సూత్రధారి సిన్వర్. ఈ దాడిలో 1,200 ఇజ్రాయెల్ దేశస్తులు చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటినుంచి సిన్వర్.. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా మారారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో అగ్రభాగాన ఉన్నారు. మిలటరీ వ్యూహకర్త సిన్వర్ మరణం హమాస్‌కు కోలుకోలేదని దెబ్బని చెప్పొచ్చు. అయితే సిన్వర్ మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది జూలైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. హనియా మరణం తర్వాత సిన్వర్ హమాస్ పగ్గాలు చేపట్టారు. ‘సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్ సైనిక, నైతిక విజయమని విదేశాంగ మంత్రి కట్జ్ అభివరి్ణంచారు. కాగా గాజాలో జబాలియాలోని స్కూలులో నిర్వహిస్తునున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 28 మంది మరణించారు. శరణార్థి శిబిరం నుంచి... యాహ్యా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో పుట్టారు. 1987లో హమాస్ ఏర్పడ్డప్పటి తొలినాటి సభ్యుల్లో ఒకరు. సంస్థ సాయుధ విభాగాన్ని చూసుకునేవారు. 1980ల్లోనే ఆయనను ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను హత్య చేసిన నేరంలో నాలుగు జీవిత ఖైదులు విధించింది. జైల్లో పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమం లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2011లో ఒక్క ఇజ్రాయెలీ సైనికునికి ప్రతిగా విడుదల చేసిన వేలాది మంది పాలస్తీనా ఖైదీల్లో భాగంగా విముక్తి పొందారు. గాజాకు తిరిగొచ్చి హమాస్ అగ్రనేతగా ఎదిగారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాల్లేని తీరుతో ‘ఖాన్ యూసిస్ బుచర్’గా పేరుపొందారు. 2023 అక్టోబర్ 7న 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్న హమాస్ మెరుపుదాడి వెనక సంస్థ సాయుధ విభాగం చీఫ్ మొహమ్మద్ దెయిఫ్తో పాటు సిన్వర్ కీలకంగా వ్యవహరించారంటారు. -
రతన్ టాటా లవ్ స్టోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రతన్‌టాటా భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.తాను భారత్‌కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
యుద్ధం వస్తే.. ఏ దేశం ‘పవర్’ ఎంత?
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్‌లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?టర్కీ..మిడిల్‌ఈస్ట్‌లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.ఇరాన్..పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ఈస్ట్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.ఈజిప్టు..పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.ఇజ్రాయెల్..ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.సౌదీఅరేబియా..బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.ఇరాక్..పవర్ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.సిరియా..పవర్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.ఖతార్..ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.కువైట్..మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్‌లో కువైట్ పదవ ప్లేస్‌లో ఉంది.ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు 1.42611.అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి -
ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.నార్త్ కరోలినాలో శుక్రవారం(అక్టోబర్4) జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వ్యాఖ్యానించారు.కాగా,ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా బైడెన్ స్పందించలేదు.దీనిపై బైడెన్ వైఖరిని ట్రంప్ తప్పుబట్టారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన మిసైల్ దాడులకు సమాధానంగా ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని ట్రంప్ సూచించారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు మూడింది -
బీరుట్‌పై నిప్పుల వాన
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత భారీగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణుల దాడిలో పెద్ద సంఖ్యలో భవనాలు కంపించిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. జనం కకావికలమై సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ లెబనాన్‌లో క్రైస్తవులు అధికంగా ఉండే మార్జయూన్ నగరంపైనా తొలిసారిగా దాడులకు దిగింది. బాంబు దాడుల్లో నలుగురు వైద్య సిబ్బంది మరణించినట్టు సమాచారం. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. హెజ్బొల్లా నిఘా ప్రధాన కార్యాలయంపై భారీగా దాడి చేసినట్టు పేర్కొంది. గత 24 గంటల్లో 100 మందికి పైగా మిలిటెంట్లను హతమార్చినట్టు తెలిపింది. శుక్రవారం నాటి దాడుల్లో హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ రషీద్ స్కఫీ మరణించినట్టు ప్రకటించింది. భూతల దాడులు కూడా కొనసాగుతున్నట్టు వివరించింది. స్కఫీ 2000 నుంచీ ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. గత 20 రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1,400 మందికి పైగా లెబనాన్‌వాసులు మరణించారు. 12 లక్షల మందికి పైగా నిర్వాసితులై శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా బీరుట్కు 50 కిలోమీటర్ల దూరంలోని లెబనాన్–సిరియా మాస్నా బోర్డర్ క్రాసింగ్‌ను మూసివేశారు. హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి సిరియా గుండా ఆయుధాలు సరఫరా కాకుండా ఈ ప్రాంతంలో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లా కూడా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రతి దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. దాంతో లోయర్ గలిలీ తదితర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించినట్టు సమాచారం. పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. భూతల దాడుల్లో మరో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్టు సైన్యం ధ్రువీకరించింది. మరోవైపు గాజాపైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచింది. ఓ స్కూలు భవనంపై జరిగిన దాడికి పలువురు చిన్నారులు బలైనట్టు తెలుస్తోంది.హౌతీ లక్ష్యాలపై...అమెరికా, బ్రిటన్ దాడులువాషింగ్టన్: యెమన్లోని హౌతీ ఉగ్ర సంస్థపై అమెరికా, బ్రిటన్ భారీగా దాడులకు దిగాయి. ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు తదితర 12 లక్ష్యాలపై యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు బాంబుల వర్షం కురిపించాయి. వీటిఇలో హొడైడా విమానాశ్రయం బాగా దెబ్బ తిన్నట్టు హౌతీ మీడియా ధ్రువీకరించింది. మరికొన్ని బాంబులు రాజధాని సనాలో తీవ్ర నష్టం కలిగించాయి. హౌతీ రెబెల్స్ గత వారం బాబ్ ఎల్ మందెబ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు అమెరికా నౌకలపై బాలిస్టిక్ మిసైళ్లు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించడం తెలిసిందే. వాటన్నింటినీ మధ్యలోనే అడ్డుకుని కూల్చేసినట్టు అమెరికా పేర్కొంది. తాజా దాడులు వాటికి ప్రతీకారమేనని భావిస్తున్నారు.