రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.
ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.
రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.
వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.
రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది.
యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.
ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి.
యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.
రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది.
‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు.
బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు.
రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment