మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.
దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.
దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.
కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.
‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు.
తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment