ఉపమన్యుడి పసితనంలోనే అతడి తండ్రి వ్యాఘ్రపాదుడు కన్నుమూశాడు. వ్యాఘ్రపాదుడి అకాల మరణంతో అతడి భార్య కొడుకు ఉపమన్యుడితో పాటు పుట్టింటికి చేరుకుంది. మేనమామల ఇంట ఉపమన్యుడికి ఆదరణ కరవైంది. మేనమామల పిల్లలు రుచికరమైన పదార్థాలు భుజిస్తుండేవారు. పుష్కలంగా పాలు తాగుతుండేవారు. ఉపమన్యుడికి ఆకలి వేసినప్పుడు తగినన్ని పాలు కూడా దొరికేవి కాదు. ఉపమన్యుడు మేనల్లుడే అయినా, అతడి తల్లి తమ తోబుట్టువే అయినా, వారు అనాథలు కావడంతో మేనమామలు వారిని తగిన విధంగా ఆదరించేవారు కాదు.ఒకనాడు ఉపమన్యుడు పాలకోసం తల్లి వద్ద మారాం చేశాడు. కొడుకు అవస్థకు కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి తన కన్నీళ్లలోనే కాసింత పేలపిండిని కలిపి, అవే పాలు అని ఇచ్చింది.
ఒక్క గుక్క తాగగానే అవి పాలు కాదని గ్రహించిన ఉపమన్యుడు, వాటిని తోసిపుచ్చాడు. పట్టరాని దుఃఖంతో, ఉక్రోషంతో ఏడుపు లంకించుకున్నాడు.నిస్సహాయురాలైన ఆ తల్లి అతడిని రకరకాలుగా లాలించింది. తన పరిస్థితిని వివరించింది. దుఃఖం నుంచి తేరుకున్న ఉపమన్యుడు తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘అమ్మా! నన్ను దీవించి పంపించు. శివుడి కోసం తపస్సు చేసి, పాల సముద్రాన్నే తెచ్చుకుంటాను’ అని ఆవేశంగా పలికాడు. సరేనన్న ఆ తల్లి అతడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది. ‘నాయనా! మన శైవులకు పంచాక్షరి మంత్రమే మహాయుధం. దీనినే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదనైనా తప్పిస్తుంది’ అని చెప్పి, తన భర్త నుంచి సంక్రమించిన విరజా భస్మాన్ని కొడుకు చేతికిచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుమతిస్తూ, శీఘ్రసిద్ధి కలగాలంటూ ఆశీర్వదించి సాగనంపింది.
తల్లి అనుమతితో ఇల్లు విడిచిన ఉపమన్యుడు అడవుల బాట పట్టాడు. కాలినడకన కొన్నాళ్లకు ఒక దట్టమైన కీకారణ్యానికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని, పంచాక్షరి జపం మొదలుపెట్టాడు. జపం క్రమంగా ధ్యానంగా మారింది. ధ్యానం తపస్సుగా మారింది. అడవిలో ఉన్న రాకాసి మూక అతడిని భయపెట్టి, తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించింది. ఉపమన్యుడు చలించలేదు. అతడిని జయించలేక రాకాసులందరూ అతడికి కింకరులుగా మారిపోయారు.ఉపమన్యుడి తపస్సు ఊపందుకుంది. నానాటికీ తపస్సులో ఉగ్రత పెరగసాగింది. అతడి తపస్సు వేడిమి స్వర్గం వరకు ఎగబాకింది. దేవతల అరికాళ్లు చుర్రుమన్నాయి. ఈ పరిణామానికి హడలెత్తిన దేవతలు విష్ణువును వెంటబెట్టుకుని, పరమశివుడి వద్దకు చేరుకున్నారు.
‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. నువ్వు జాప్యం చేస్తే, అతడి తపస్సు పుట్టించే తాపానికి మేమంతా తప్తమైపోకుండా కాపాడు’ అని మొరపెట్టుకున్నారు.‘సరే’నని దేవతలకు మాట ఇచ్చాడు శివుడు.అయితే, ఉపమన్యుడిని పరీక్షించదలచాడు. ఇంద్రుని రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘కుమారా! ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.
‘నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే, నువ్వొచ్చావేమిటి దేవేంద్రా? నీ వరాలేవీ నాకు అక్కర్లేదు. సాక్షాత్తు పరమశివుడే నా ముందు ప్రత్యక్షం కావాలి. అతడే నా మనోరథాన్ని ఈడేర్చాలి. ప్రయాసపడి వచ్చావుగాని, నువ్వు దయచేయవచ్చు’ అన్నాడు ఉపమన్యుడు.ఇంద్రుడి వేషంలో ఉన్న పరమశివుడు ఉపమన్యుడికి తన పట్ల గల అచంచల భక్తికి పరమానందం చెందాడు. నిజరూపంలో పార్వతీ సమేతంగా సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు తన కళ్లెదుట కనబడగానే ఉపమన్యుడు పారవశ్యంతో తబ్బిబ్బయ్యాడు. అతడికి నోట మాట పెగలలేదు.
ఉపమన్యుడు నోరు తెరిచి అడగకపోయినా, పరమశివుడు అతడికి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని ధారాదత్తం చేశాడు. ‘నువ్వు నా బిడ్డవురా!’ అంటూ అతడిని చేరదీసి, ముద్దాడి గణాధిపత్యం కూడా ఇచ్చాడు.‘నాకు మాత్రం బిడ్డ కాడా’ అంటూ పార్వతీదేవి కూడా ఉపమన్యుడిని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించింది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉపమన్యుడికి నిత్య కుమారత్వం సిద్ధించింది.
‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment