Funday
-
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం
‘ఓబ్బీ! లేయ్ నాయన.. నా తండ్రివి గదూ! నా రత్నం గాదూ! మన ఇంటికి రాక రాక ఇన్ని దినాలకు అబ్బొచ్చినాడు. పాపం.. మనం బాగా మర్యాద జేసి పంపొల కదా? కోడ్‌ని అలల జేయించుకుని రావాల, మీ నాయన జూస్తే టైంకి ఊర్లో లేకపాయ. కిస్టపాడు పోవాలా.. లెయ్ నాయనా.’మాయమ్మ చెవిలో జోరీగ మాదిరి నస పెట్టేది వింటా తట్టుకోలేక దుప్పటి కాళ్ళ కిందునుంటి ఇరికిచ్చి తలవెనక్కి బిర్రుగా తోసి ముదరజుట్టుకుని పడుకున్నా.అహా! అసలుకి ఈ రగ్గు మా నాయన నెల్లూరు పోయినపుడు తెచ్చివుండాడు. నాతో అబద్ధం జెప్పి వుంటాడు. మా ఇటుకల బట్టి అంటించినాక ఆకాశంకేసి పై పైకి లేస్తాపోయే పొగతోబాటు గాల్లోకి ఎగిరి అట్టనేబోయ్ మబ్బులు తెంపి ఇట్టా తెచ్చినట్టు ఎంత హాయిగా, ఎంత మెత్తగా వుంటాదో ఈ దుప్పటి.దీన్ని తెచ్చిన పొద్దు జూడాల మాయమ్మ బేసిన భరతనాటికం, ఈ లేత నీలం రంగు చూసి మా నాయన మీదకి పూనకమొచ్చిన మాదిరి వూగింది. ఈ రంగు బేన్నే మాసిపోద్దనీ, ఇంత లావు రగ్గుని ఉతికేటాలకు నడుము, చేతులు పడి పోతాయని వాపసు ఇచ్చి రమ్మనింది. నేనే నాకు నచ్చిందని మాయమ్మని కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలి వున్నించుకున్నా. ఉతికేతపుడు నేను సాయంగూడా జేస్తానన్నా. అట్టా దీన్ని దక్కించుకున్న.ఇది కప్పుకుంటే పానం గాల్లో తేలుతాపోతాన్నెట్టు ఉంటాది.కాకుంటే ఒకటే .. మా అమ్మ నా తాలాపు దిక్కున మంచంకోడుకు ఆనుకుని కుచ్చిని నన్ను లేపుతావుంటే సూసే అమ్మలక్కలు తోడై, రాగాలు పెడతారేమోనన్న ఆలోచన మనసులోకి రాంగానే భయమేసి గబుక్కుని లేస్తి.‘మా! ఏంది మా? సంకురాత్రి సెలవులిచ్చినాక, ఈ మాద్దిరి ఎండపొద్దు దాకా పొండుకోవాలని కలలుగంటి. తలాపున కుచ్చోని ఈమైన ‘ఓ..’ అని రాగాలు పెడతావుండావు. ఏం? కిట్టపాడు దాకా ఏంటికి? నాలుగీదులవుతలనే ‘ఈసోబు’ మామ వుండ్లా్య. ఎప్పుడూ ఆయనే సేసిస్తాడుగదా అలల’ అంటి విసుగ్గా. ‘ఏంటికి నాయన ఇంత చిరాకు నీకు? పొద్దున్నే పాలకోసం ఈసోబు మామ చిన్న బిడ్డవుండ్లా? అదే ఆయమ్మి గౌసియా వచ్చింటే నేను ముందే ఎచ్చరిస్తి. మీ నాయన వుండాడా అమ్ములు? కోడిని తెస్తా అలల జేపిచ్చాడేమో’ అని అడిగితి. దానికి ఆయమ్మి..‘లేడత్తోవ్! నిన్ననే మా మున్ని అక్కను అత్తగారింటి నుండి మనింటికి కాన్పు కోసమని తోడకరావాలని ఊరికి పోయినాడు’ అని చెప్పింది రా’ అంది మాయమ్మ.‘గౌసియా వచ్చిందా?’ అంటి టక్కున ఆత్రం ఆపుకోలేక. మళ్ళా మాయమ్మ ఏమనుకుంటుందో అని ఉత్తుత్తి ఆవలింతలు దీస్తా మెరిసిన ఆనందపు కళ్లను నులుపుకుంటానట్లు అరచేతులను అడ్డుబెట్టుకుని ‘చా! భలే ఛాన్సు పాయ’ అని మనసులో అనుకున్నా. ఆయమ్మి నాదిక్కు జూసినపుడు నవ్వే నవ్వంటే నాకు శానా శానా ఇష్టం. కానీ ఆయమ్మి ఇంత పొద్దన్నే వచ్చుద్దని అసలు అనుకోలా నేను.‘బిరాన పోయిరాపో నాయనా! నెను పప్పు నానబెట్టిన, నువ్వచ్చేలోపు గారెల పిండి రుబ్బేసి. తెల్లబాయలు వొలిసి మసాలా నూరి పెడతా! నువ్వొచ్చినాక కోడి కూర పులుసుజేసి వేడి వేడిగా నాలుగు గారెలు జేసిపెడతాను. మా నాయన కదూ! పోయ్రాపో బంగారూ’ అంటా మాటలతో ఊరిచ్చే మాయమ్మ.సరేని ఉదరాబదరా పండ్లు తోమి, మాయమ్మ ఇచ్చిన పెద్ద గలసానిండాకు ఉడుకుడుకు పాలు తాగినాక.. నేను, మాయమ్మ ఇద్దరం కలిసి కోళ్ల గూటిలో తారాడి తారాడీ గుడ్లకు వచ్చిన నల్ల కోడిని ఒకదాన్ని చూసి ఒడుపుగా పట్టుకుంటిమి. మాయమ్మ దాని కాళ్ళు రెండు పురికొసతో ముడేసిస్తే చెయ్ సంచిలో కుక్కి, జేబులో రూపాయి పెట్టుకొని దావ పట్టిన.మా ఊరికి కిస్టపాడు రెండు కిలోమీటర్ల దూరం. బస్సులు ఎపుడో ఒకటి తప్ప రావు. అందుకే అందరూ సైకిళ్ల మీదనో, నడుచుకునో పొయ్యేవాళ్లు. పొయ్యేటపుడు డబుల్స్ లేని సైకిల్ జూసి చెయ్ చాపి ఎక్కి, సరాసరి మా నాయన దగ్గర పనిజేసే మస్తానోళ్ళ ఇంటికి బోతి. ఈడకు ఎప్పుడు వచ్చినా యజమాని కొడుకు హోదా ఇస్తారు వీళ్లు. ఒకదిక్కు మస్తాన్ మామ కోడిని అలాల్ జేసేదానికి తీసుకొనిబోతే, నేను ఆయప్ప భార్య ఇచ్చిన కారం చుట్టలు తింటా కూసున్న.‘నాయన లేడు కదా అబ్బయ్యా! నేనే కోడిని కాల్చి కొట్టిస్తాగానీ రోసేపు అట్ట మంచంలోనే కూకో’ అనే. సరే అని కుచ్చుంటి నేను. అంతలోనే ఆయమ్మ లోటాతో బానలోని చల్లటి నీళ్లు తెచ్చిచ్చే. తాగి చొక్కాతో మూతి తుడుచుకుని లేచేతరికి, ముక్కలుగా కొట్టిన కోడి మాంసంను స్టీల్ టిఫను డబ్బాలో బెట్టిస్తా ‘టిపను డబ్బా రేప్పొద్దున వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే గానీ నువ్ భద్రంగా పోయిరా చిన్నోడ’ అనే.నేను టిఫను డబ్బా పట్టుకుని ఊపుకుంటా, గారెల రుచి ఊహించుకుంటా పాటలు పాడుకుంటా, ఎవురన్న సైకిల్ మీద వస్తాండారేమో అని యనకమాలకి తిరిగి తిరిగి సూసుకుంటా నడుస్తావుండా. మా ఊరినింటి కిష్టపాడు మధ్యలో ఒక లోతువంక దారి ఉంటాది. వంకకు ఒక పక్క చింతమానుల కిందున్న సమాధులు నన్ను ఎప్పుడూ భయపెట్టేదానికే జూస్తాయి. పొయ్యేతపుడు సైకిల్ మీద ఆ దిక్కు తిరిగి కూర్చుని పోయినా కాబట్టి కనపడలేదేమో గాని ఈ మధ్య కొత్తగా కట్టినట్టువుండారు ఓ సమాధిని. కట్టింది చాలదని దాని మీద సిమెంట్‌తో ఒక మనిషి ఆకారం కూర్చున్నట్టుగా కూడా చెక్కినారు. ఎర్రంచు పంచా, తెల్లటి చొక్కా, నల్లంగా గుబురు మీసాలు, చేతికర్రా.. అచ్చం మనిషి కూర్చున్నట్టే వుంది. నాకు గుండె దడ దడ మనే. అంతలో ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది. ఇంగ నా భయం జూడాల. అప్పటిదంకా పాడిన శిరంజీవి పాట ఆపేసి ‘అనుమంతుడి’ దండకం ఎత్తుకుంటి నేను. అయినా కూడా గుండెలో దడకేమో ఎండ ఎక్కువ లేకున్నా చెమటపడతానే వుంది. పొద్దున తాగిన పాలు ఆవిరైపాయ, తిన్న కారం సుట్టలు అరిగిపాయ, గబ గబా నడిసి వంకపైకి వచ్చేసి ఊపిరి తీసుకున్నాను. ఎదురుమల్లె దూరంగా మా ఊరు కనపడి హమ్మయ్య అని ఇంగ ధైర్యం తెచ్చుకుంటి. రోన్ని నీళ్లు తాగితే బాగుండు అని నాలిక పిడసగట్టినట్టు అనిపిస్తంది.అంతలో ‘ఓఓ..బ్బీ’ అని ఎవరో పిలిసిన పిలుపు మళ్ళా వినపడి యనక్కి తిరిగి జూస్తి. వంక లోతట్టులో తెల్లగుడ్డ కదులుతున్నట్టు, నడుస్తాన్నట్టు కనపడి వెన్నులో పదురు లేసింది. ‘ఓఓబ్బీ.. నువ్ రత్నం గాదూ.. ఆడనే వుండు నే వస్తన్న’ అంటా మల్లోసారి కేకేసింది ఆ ఆకారం. ఆమెను ఇంతకు ముందు చూసిన గాపకం లేదు. అసలు తలంతా తెల్ల గుడ్డలాంటిది చుట్టుకుంది మొహం కానరాకుండా. దానికి తోడు తెల్ల చీర కట్టుకుంది.నాకు కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ‘ఒరా! దయ్యాలకు మన గురించి తెలుసుకోవడం శానా వీజీ అంటరా. అవిగాన తలచుకుంటే మన పేరే గాదు, తరగతిలో మనం యా సెక్షనో గూడా తెలిసిపోతాయంటరా. వాటికీ.. తెల్లచీరలన్నా, నల్ల కోళ్లన్నా, చింత మానులన్నా శానా ఇష్టమంటా మా అబ్బ జెప్పినాడ’ని కళ్ళు గోళికాయలంత జేసుకుని చెప్పిన మా రమణగాడు గుర్తొచ్చాడు.అంతలో ఆ ఆకారం నవ్వుతా ‘ఏందో టిపన్ డబ్బాలో కొండబోతండవే. సియ్యలేనా? అయితే బువ్వదినేకి నేనూ వస్తా వుండు నీతోబాటు మీ ఇంటికి’ అని తుపుక్కున నేల మీద ఉమ్మింది తార్రోడ్డు మీద ఎర్రగా నెత్తురు మాదిరి.. ‘ఉండబ్బీ’ అంటా తలెత్తి నా దిక్కు జూస్తా ముందుకు నడుస్తా వస్తంది. నాకు ఏం జేయాలో తెలియక చేతులు, కాళ్ళు ఆడట్లేదు. ఆమె ఆగి నెత్తిమీద నుండి∙జారిపోతున్న తెల్లగుడ్డ సరి జేసుకుంటా ఉంటే, నేను ఇదే ఛాన్సని ఇంగ దొమ్మల నిండాకు ఊపిరి దీసుకొని పరుగు అందుకున్నా.అట్టా పరిగెత్తిన నాకు వాకిట్లో వాల్చిన నులకమంచంలో బడి మా యమ్మను వాటేసుకున్నది మాత్రమే గ్యాపకం. ఇంగ ఆ పడుకోడం పడుకోడమే పట్టుకుంది అల్లుజ్వరం. వారమయినా తగ్గలేదు.ఓనాడు నేను పొద్దున్నే పాలు, బన్ను తిని జొరం మాత్తరేసుకుని ముదరజుట్టుకుని ముడుసుకుని పడుకునివున్నా. మా అమ్మ నా ఎదురుగా కుచ్చుని రాగులు ఇసురుకుంటా వున్నపుడు వచ్చింది గౌసియా వాళ్ళమ్మ.‘వదినా సేమిరికి రొంత పెరుగు కావాలా’ అంటా అడుగుతా మంచంలో పొడుకున్న నన్ను జుసిందేమో ‘ఏం పిల్లకాయ వదినా! మీ రత్నమయ్య? ఆ మధ్య ఊరినింటి మా అమ్మ వస్తా వుంటే ఈ యబ్బి కనపడినాడంటా. ఎదో మాట్లాడతా తోడుగా పోవచ్చులే అని పిలిస్తే ఉలుకూపలుకూ లేదంటా, ఆకేసుకుంటా నిలబడి ‘ఏంది టిపనులో సియ్యలా నేనూ వస్తా’ అని నవ్వాతా అనిందో లేదో ఆ మయిన ఒకటే పరుగులెత్తి పోయినాడంట. నిజంగానే సియ్యలు లాక్కుంటాదనుకున్నాడా ఏమి?’ ఒకటేమయిన నవ్వుతా వుంది.మాయమ్మ నా దిక్కుజూస్తా ‘లేదులే వదినా! శానాళ్ళయ్యింది కదా మీ అమ్మ మనూరు రాక, అత్తని వాడు గుర్తుపట్టి వుండడులే, ల్యాకుంటే మర్యాదకైనా ఎచ్చరిచ్చే పిలకాయేగాదు మావాడు? వాడి గురించి నీకు తెలీదా!’ అంటా నన్ను ఎనకేసుకోస్తా వున్నింది. ఇద్దరూ అట్లా మాట్లాడతానే నిలబడుకోనుండారు.అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటి. ఆమె దయ్యం కాదనీ, ఉమ్మింది రక్తం కాదనీ.. గౌసియా వాళ్ల అవ్వకోసం ఆకులు, వక్కలు కొనక్కపోయేదీ, ఆ జేజి ఎప్పుడూ ఆకొక్క నములతాంటాదని అప్పటికి జ్ఞాపకం వచ్చింది. తెల్ల గుడ్డ కప్పుకుంటే మట్టికీ అందరూ దయ్యం కాదని అర్థమై లోలోపల నవ్వుకుంటి నేను.గౌసియా వాళ్లమ్మ రోసేపు మాటాడి పోతా పోతా నా మనసులోని భయం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పొద్దు గట్టిగా అనుకుంటి. ఇంగెప్పుడూ భయం అన్న మాట లేకుండా తిరగాలని.మా కానుగచెట్టు నుండి చల్లని గాలి నా మొహాన్ని తాకుతా వుంది. మా అమ్మ నుదురు మీద అరచెయ్యేసి జూసి ‘హమ్మయ్య! చెమట పోస్తంది లే. ఇంగ జ్వరం ఇడిసినట్టే రత్నమా’ అంది ప్రేమగా నా నుదురు ముద్దాడి. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్‌లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్‌కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్‌ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్‌లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్‌లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
యువ కథ: చందమామ రావే!
రోజులాగే ఆ రోజూ సెల్లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్ లేదు. లైట్ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. ఆ మహీధర్ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. ఎంట్రన్స్‌లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్‌లోనే ఉన్నాయి. టైమ్ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్ మేనేజర్‌గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్ నుండి తెప్పించుకున్న సూట్‌కి ఉన్న ట్యాగ్ కట్ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్ అవ్వచ్చు, ఆఫీస్ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్‌కి రాను. నువ్ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా అని!’ కార్ తీసుకుని ఆఫీస్ బ్యాగ్‌తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్ చూసుకుంటూ కార్ ఎక్కి ఆఫీస్‌కి బయల్దేరాడు. దారిలోనే మహీధర్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్‌కి డయల్ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్ భార్య ‘20 మినిట్స్‌లో ఆఫీస్‌లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్ చేసి రకరకాల బోన్సాయ్ మొక్కలు తెప్పించాడు. కార్పెట్ క్లీనింగ్ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేశాడు. కారిడార్ మొత్తం తిరిగి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్ వచ్చారు. ‘పాత ఫైల్స్ అన్నీ సెపరేట్ షెల్ఫ్‌లోకి షిఫ్ట్ చేయించావా?’ ‘లాస్ట్ వర్కింగ్ డేనే చేశాం సర్’ మహీధర్ వెనకే నడుస్తూ చెప్పాడు. ‘అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటేల్స్?’ ‘డేటా రెడీగా ఉంది సర్’ అభిరామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్ ఫోన్లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్ ఫిక్స్ చేయించలేదా.. బాస్ ఇంకా చెక్ చేయాల్సింది వాష్‌రూమ్స్ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు. అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్ ఫిక్సింగ్ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్.. మహీధర్ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్ ఎన్నైనా చెప్తావ్, బాస్ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్ అని నీ హెల్ప్ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్ వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు.ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్‌గా ఫ్లోర్ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్‌గా ఉంది. ‘టప్..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్ మీద. మహీధర్ టీమ్‌లోని సంజన రాసిన ప్రోగ్రామ్‌లో మిస్టేక్స్ రిపీట్ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్ లీడ్ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! ‘టప్! టప్!’ ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్ వాష్‌రూమ్ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. వెంటనే తేరుకుని ‘వాష్‌రూమ్ నుండే వస్తున్నట్టుంది సర్’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్ బేసిన్ అవుట్ లెట్ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్ పోవడానికి ఉండే మెటల్ ప్లేట్ మీద పడుతున్నాయి. మెటల్ ప్లేట్ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ‘వాటర్ లీక్ ఔతుంది సర్’ డోర్ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్ చేయిస్తాను సర్’ అన్నాడు మహీధర్. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్ రవి ఆరోజు కొన్ని అరెంజ్మెంట్స్కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్ విషయం చెప్పమని అభిరామ్‌కి చెప్పి వీకెండ్ పార్టీ ఉందని ఆఫీస్ టైమ్ అవ్వకముందే బాస్ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్. ఈరోజు– మూర్తి స్టాఫ్ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్‌కి పిలిచాడు. వాష్‌రూమ్ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్ లీక్ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్‌కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్ ప్రమోషన్. జోనల్ వైజ్‌గా బ్రాంచెస్ టేక్ కేర్ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్‌గా వస్తున్నారని మూర్తి ఎక్స్పెక్టేషన్. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్ కూడా సెలెక్ట్ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్‌ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్‌గా వాష్‌రూమ్‌లోకి పంపించాడు. ప్లంబర్‌కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్ రూమ్‌కి వెళ్ళాడు రవి. అతను వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్ పెట్టేసి, బొకే టేబుల్ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్ ద వే. ప్రయర్గా ఫినిష్ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్ రీచ్ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్. మహీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్‌లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్‌తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్‌లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్‌రూమ్ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. వాష్‌రూమ్ నుండి బయటకొచ్చిన స్టాఫ్ మెంబర్ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్.. సడన్‌గా లోపల మనిషిని చూసేసరికి’‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్‌కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్‌తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్ ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్‌తో మనిషి నీట్‌గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ‘నా పేరు రాజు, ట్యాప్ రిపేర్ చేయనీకి ఒచ్చిన సార్‘‘రిపేర్ అయిందా?’‘అయింది సార్’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్?’‘రొండు గంటలైంది’‘వాట్?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్’‘మరి లోపల ఎందుకున్నావ్ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’‘అంటే ఇతను ప్లంబర్ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్రౌండర్ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. ‘సర్’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్‌లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్ వేస్తుంటే చూశా. ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్‌లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. ‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్‌కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. ‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్‌కి పోయి మహేష్ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్‌కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్ అందరికీ సీఈవో స్పీచ్ కంటే రాజు స్పీచ్ బావుందనిపించింది. మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్‌కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్‌లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. -
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్‌ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్‌లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్‌గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్‌కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్‌తో వారిని గ్లోబల్ స్టార్స్‌లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్‌గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ‘ఫిల్మ్‌ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన ‘కృష్ణన్‌కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్‌గుడ్ మూవీస్‌గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్‌లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్ -
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్‌లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్‌పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్‌పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్‌లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్‌ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్‌తో కలిసి బర్కత్‌పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్‌ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్‌ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్‌కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్‌ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్‌గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్‌ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్‌ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్‌గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్‌కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్‌గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
మిస్టరీగానే నాదిరా హత్య కేసు
అది 6 ఆగస్టు 1995, సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీథి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.రెస్టరెంట్లో భోజనం ముగించుకుని, నాదిరా దంపతులు ఇంటికి వెళుతున్నారు.తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి, కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్‌ను గద్దించారు.దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు.దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి, కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగులకు, ఇజాజ్‌కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.ఈ సంఘటన పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్యవార్త పత్రికల్లోని పతాక శీర్షికలకెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నాదిరా తన పద్దెనిమిదేళ్ల వయసులో 1986లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టిన ఆమెను అభిమానులు ‘వైట్ రోజ్’గా పిలుచుకునేవారు. సినీరంగంలో ఒకవైపు వెలుగుతుండగానే, సంపన్నుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ముజ్రా కార్యక్రమాల్లో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే రూ.52 లక్షలు పారితోషికంగా తీసుకునేది.సినీరంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదేకాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోను, ఇతరుల వాహనాల్లోను, ఇంకొందరు రిక్షాల్లోను స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో పాతిక సినిమాలు సిల్వర్‌జూబ్లీలు చేసుకున్నాయి. సినీరంగంలో వైభవం కొడిగట్టక ముందే పెళ్లి చేసుకుని, కెరీర్‌కు స్వస్తి పలికింది.సినీరంగంలో నాదిరా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగలేదు. అనతికాలంలోనే ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్‌లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్‌తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతణ్ణి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు.పెళ్లయిన కొన్నాళ్లకు భర్త ఇజాజ్‌తో కలసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ, తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయసాగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగువారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచు కీచులాటలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్లు చెప్పారు.ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ కనుక్కోలేకపోయారు. దీంతో అతణ్ణి విడిచిపెట్టారు. పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే, ఆమెను భర్తే హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతణ్ణి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచినా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉదంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
సృజనకు పెన్నిధి
క్రియేటివ్ జీల్‌కి నిలువెత్తు నిదర్శనం స్టయిలిస్ట్ నిధి జెస్వానీ! అవుట్ డేటెడ్ అనే మాటను దరిదాపుల్లోకి కూడా రానీయదు. డిజైన్స్‌లో కానీ.. స్టయిలింగ్‌లో కానీ కాలమే ఆమెతో పోటీ పడాలి!నిధి జెస్వానీ.. పుట్టి, పెరిగింది ముంబైలో! మాస్ మీడియాలో డిగ్రీ, అడ్వర్టయిజింగ్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ తాన్యా ఘావ్రీ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. ఎన్నో ఫ్యాషన్ షోలకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాల్లో వారి కుటుంబ సభ్యులకు స్టయిలింగ్ చేసింది. తను స్టయిల్ చేసే ప్రతివ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే లేటెస్ట్ ఫ్యాషన్‌ను అనుసరిస్తూ వాళ్లను అందంగా, ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి, అతిథుల ఫేవరిట్ స్టయిలిస్ట్‌గా మారింది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉండే తన డిజైన్స్‌తో బాలీవుడ్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆధునిక డిజైన్స్‌కు సంప్రదాయ టచ్నిచ్చి, చాలా త్వరగా నిధి బాలీవుడ్లో తన ప్రత్యేకతను చాటింది. అది సెలబ్రిటీలే ఆమెను సంప్రదించేలా చేసింది. మీరా కపూర్, నుస్రత్ భరూచా, శ్రద్ధా శ్రీకాంత్, భూమి పెడ్నేకర్, కృతి శెట్టి, రకుల్‌ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్‌లకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
పాజిటివ్ ఎనర్జీనిచ్చే డెకరేషన్
శ్రావ్యమైన సవ్వడి.. గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్ బెల్స్ ఇంటికి పాజిటివ్ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సువాసనల కాంతిడెకరేటివ్ వస్తువుల్లో క్యాండిల్స్కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్‌పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.ధూపం కూడా..ధూపం వేయడమూ పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటి పరిమళాల ధూప్ స్టిక్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రేయస్సుకు..శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెమలి ఈకలునెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. – ఎన్.ఆర్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూ. -
దోస్తీకి దొన్ను చెక్కీ
భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!ఆ స్వీట్ స్టోరీ ..మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం. ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్‌తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి. నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం -
ఈవారం కథ: సుధీరన్న
నిద్రరాని ఈ రాత్రి పూట, ఈ నగరంలో, ఆకాశహర్మ్యంలో నా వెడల్పాటి కిటికీలో కనిపిస్తున్న చంద్రుడిని, ఆ పక్కనే వున్న దీటైన చుక్కను చూస్తూ ఉంటే హఠాత్తుగా సుధీరన్న జ్ఞాపకం వచ్చాడు. ఎన్నిరోజులై ఉంటుంది అన్న చనిపోయి, కాదు ఆత్మహత్య చేసుకుని? అసలు మనల్ని మనం చంపుకోవడాన్ని స్వంత హత్యా అనో మరొకటనో అనకుండా ఆత్మహత్య అని ఎందుకు పేరు పెట్టారు. ఎవరు ఆ పేరు పెట్టారో కానీ విషయాలు చాలా లోతుగా తెలిసిన వాళ్ళే పెట్టి వుంటారు.ఆత్మహత్యకి ఒక నెల ముందు ఫోన్ చేసి ‘అన్నా! నీ కథ రాయాలనుకుంటున్నా, చెప్తావా?’ అంటే ‘ఎందుకు చెప్పను బుజ్జమ్మా? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుండ్ల నీకు’ అన్నాడు.నేను ‘చెప్పేవులే గానీ, చాలా సంవత్సరాలు అయిపోలా, ఇంకా గుర్తుంటదా అన్నా? మళ్లీ మొదటనుండి చెప్పాల్సిందే’ అన్నాను. అందుకు బదులుగా ‘చెప్తా గాని బుజ్జమ్మ, నేనే నీకు ఫోన్ చెయ్యాలనుకుంటా ఉండా, నువ్వే చేశావు! ఈ సంగతి చెప్పు, పాప, అదే నా బిడ్డ నన్ను కలవాలనుకుంటా ఉందంట, ఏం చేయమంటావు చెప్పమ్మా’ అన్నాడు.నేను అది విని ఆశ్చర్యపడి, ఎప్పుడో నాలుగు సంవత్సరాల బిడ్డని కదా అన్న వదిలొచ్చేవు ఇప్పుడేం చదవతావుంది’ అంటే, ‘ఇంజినీరింగ్ బుజ్జమ్మ’ అన్నాడు. ఆరోజే చివరి మాటలు, ఆ తరవాత మాట్లాడింది లేదు, సుధీరన్న ఆయన కథ చెప్పకుండానే తన ఆత్మను తానే హత్య చేసేసి, తన శరీరాన్ని ప్రపంచం మొహాన పారేసి వెళ్లిపోయాడు.సుధీరన్న అందగాడు. నల్లగా ఉంటాడు, కళ్ళు పెద్దవిగా దేవుడికి పెట్టిన కళ్ళలాగా తెల్లగా వెడల్పుగా ఉంటాయి. ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తుతో, వెడల్పయిన భుజాలతో, చెక్కినట్లు వుండే ముక్కుతో పోత పోసిన విగ్రహంలా ఉంటాడు. ఎంతమందిలో వున్నా అందరికంటే భిన్నంగా, తిరిగి చూసేట్టు ఉంటాడు. ఆయన బలమైన శరీరం మనల్ని ఒక వైపు భయపెడుతుంటే, ఆయన పసికందులాటి నవ్వు మనల్ని దగ్గరకి పిలుస్తుంది. ఆయన శరీరము, నవ్వు.. రెండూ ఒకదానికి ఇంకోటి విరోధాభాసం. కానీ వూర్లో ఏమన్నా గొడవలు జరిగితే ఆయనొక్కడే పదిమందిని ఒంటి చేత్తో కొట్టేవాడని అందరూ అంటారు.సుధీరన్న తల్లి, మా పెద్దమ్మ, ఆమె బావను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆమె అయినింటి ఆడపడచు. ఆమె బావ, ఆమె మాటల్లో చెప్పాలంటే ‘రంగు నలుపే కానీ అన్నిందాల ఆమెకి సరయిన జోడీ’. ఆస్తీ పాస్తీ దండిగానే ఉండేవి.అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సుధీరన్న తల్లి దేవసేనకు ఒక అలవాటు వుండేది, అదేమిటంటే అతిగా ఖర్చు పెట్టడం. ఎంత డబ్బునయినాసులువుగా ఖర్చు పెట్టగల మార్గాలు ఆమెకు అనేకం తెలుసు. అలాగే సుధీరన్న తండ్రికి కూడా ఒక బలహీనత ఉండేది, అదేంటంటే భార్య తానా అంటే తందానా అనడం.దేవసేనకు బంధు మిత్రులంటే తగని ప్రీతి. మనుషులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఆమెకు మహా ఇష్టం. అందుకు అనువయిన ప్రతి సందర్భాన్ని ఆమె వాడుకునేది. అదృష్టవశాత్తు ఆమెకు సుధీరన్న ఒక్కడితోనే సంతాన సౌభాగ్యం అడుగంటి పోయింది. అందుకని సుధీరన్నని ఆమె అల్లారు ముద్దుగా పెంచింది. సుధీరన్న ఆడుకోవడానికి పది బొమ్మలు అవసరమయిన చోట ముప్పయ్యారు బొమ్మలు కొనేది.వాటిని కొద్ది రోజులకే వాళ్ళకీ వీళ్లకీ దానం చేసేసి తిరిగి కొత్త బొమ్మలు కొనేది. తన చీరలయినా అంతే, పెళ్ళికో పబ్బానికో ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టుకునేది కాదు. అది వాళ్ళ కులంలో, పెట్టి పుట్టిన వాళ్ళు ఎవరూ చేయరని ఆమె నిశ్చితాభిప్రాయం. అంచేత ఆమె ప్రతినిత్యం చీరలు కొంటూ ఉండేది. ఆమె చీరలు కొనడానికి వాళ్ళ వూరు, వాళ్ళ పట్టణం, వాళ్ళ నగరం, చివరికి వాళ్ళ రాష్ట్రం కూడా దాటి, పక్క రాష్ట్రానికి చీరలు కొనడానికి వెళ్ళేది. ఆ రాష్ట్రంలో ఒకపెద్ద వస్త్ర దుకాణం చెట్టియారు, తెల్లటి ఛాయతో, రింగుల రింగుల తలతో దర్జాగా వచ్చే ఆమె కోసం గావురు గావురుమని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ చెట్టియారు ఆమెకి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పి, ఒక చీర కొనాల్సిన చోట పది కొనిపించేవాడు. ఆమె అలా కొన్నవాటిని బంధు మిత్రులకు ప్రీతిగా పంచి బంధువులు ‘దేవసేన మనసు వెన్న’ అంటే మురిసి కరిగి పోయేది.కొడుకు సుధీర్‌కి సరిగ్గా పదేళ్లు వచ్చేసరికి దేవసేన వాళ్ళ యాబయ్ ఎకరాల మాగాణి ఏడెకరాలయింది. కారణం నువ్వని నోరు తెరిచి ఏనాడు అనని భర్తను పట్టుకుని చేతకాని వాడని, అతని వల్లే తాను, తన బిడ్డ పడరాని కష్టాలు పడుతున్నామని వేధించడం మొదలు పెట్టింది దేవసేన. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె భర్త ఒకరోజు చుక్క పొద్దుకాడ లేచి కట్టు బట్టలతో ఇల్లు విడిచివెళ్ళిపోయాడు. భర్త కొడుకుని, తనను అనాథలను చేసి వెళ్లి పోయాక వున్న ఏడెకరాలను, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెమని అమ్ముకుంటూ కొడుకును పెంచి పెద్ద చేసింది దేవసేన.సుధీరు ఇరవైలలో పడ్డాక అందగాడైన తన కొడుకుకి అయినింటి సంబంధాలు ఎదురు కట్నమిచ్చి చేసుకోవడానికి వెదుక్కుంటూ వస్తాయని దేవసేన కలలు కనడం మొదలు పెట్టింది. కలలు నిజం కాకుండా సుధీరన్న ఇరవైతొమ్మిదేళ్ళ వాడయ్యాడు.ఒక్క సంబంధం కూడా వారి గడప తొక్కలేదు. దేవసేనకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మహిళా ప్రపంచం ఆస్తికి ఇచ్చిన విలువ మనిషికి అతని సౌందర్యానికి ఇవ్వదని గుర్తించింది. కానీ ఆమెకు ఇప్పుడున్న ఆస్తి కేవలం కొడుకు మాత్రమే. ఆ కొడుకును ఎరవేసి ఆమె తిరిగి తన మునుపటి వైభవానికి చేరుకోవాలి. అందుకే ఆమె పెళ్లిళ్ల బ్రోకరుకు ఈసారి సిగ్గు విడిచి గట్టిగా, ఎవరైనా పర్వాలేదు కానీ కాస్త గట్టిగా ఆస్తిపాస్తులు వుండేవాళ్ళను చూడమని చెప్పింది.సుధీరన్నది అతని తండ్రి లాటి స్వభావమే, పదేళ్ల బిడ్డగా తండ్రి వదిలేసి వెళితే తనని పెంచి ఇంత వాడిని చేసిందని తల్లి అంటే అతనికి అపారమైన ప్రేమ, గౌరవమూ. అందుకే తన పెళ్లి విషయంలో తల్లి ఏవేవో ఎత్తుగడలు వేస్తున్నా తనతో చదివిన వనజ తనను ఇష్టపడుతోందని, కులం వేరయినా చక్కగా చదువుకుని టీచరుగా పనిచేస్తుందని తల్లికి చెప్పే సాహసం అతను చేయలేదు.సుధీరన్నకు, మాధురికి ఒక మాఘమాసంలో పెళ్లి జరిగింది. మాధురి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సు. ఒక్కటే కూతురు, ఆస్తిపాస్తులు దండిగా వున్నాయి. సుధీరన్నకంటే కొంచెం పెద్దది. మొదటి భర్త అవమానించి, అనుమానంతో హింసించి విడాకులిచ్చేశాడు. వయసు వచ్చేస్తుంది, ఒకవైపు సమాజం పనీపాటా లేకుండా కూర్చుని ఏదోకటి అంటూ ఉంది. అందుకని మాధురి పెళ్లి చేసుకోవాలనుకుంది. దేవసేనకి కావలసింది మాధురి దగ్గర, మాధురికి కావాల్సింది దేవసేన దగ్గర ఉండడంతో పెళ్లి ఘనంగా జరిగి పోయింది.దేవసేన ప్రపంచమంతా తన భర్త, కొడుకు లాగా తన కనుసన్నలలో మెసులుతుందనే భ్రమలో హాయిగా బతుకుతూ వస్తుంది ఇన్ని రోజులు. మాధురి వచ్చీరావడంతోనే ఆ భ్రమను కాళ్లతో కసపిసా తొక్కి వేసింది. అత్తగారి ఇంటికి దగ్గరగా ఉద్యోగాన్ని బదిలీ చేయించుకోమని అత్త అంటే, నువ్వు నీ ఇంటిలో వుండు నా భర్త నా దగ్గర ఉంటాడని కోడలు అంది. ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద రిజిస్టరు చేయించాలని అత్త అంటే, తన ఆస్తి తను కనబోయే పిల్లలకి చెందుతుందని ఇంకెవరికీ దాని మీద హక్కు లేదని కోడలు అంది. కోడలి మగరాయుడి తనానికి, జమాజెట్టి మాటలకు, కయ్యానికి కాలు దువ్వే తరహాకు దేవసేనకు మూర్ఛ వచ్చినంత పని అయింది. కోడలు తనకు అలివయ్యే ఘటం కాదని తెలుసుకున్నాక, అటునుండి నరుక్కు రావాలని కొడుకును సాధించడం మొదలు పెట్టింది దేవసేన.స్వతహాగా మృదుస్వభావి అయిన సుధీర్‌కి, తల్లి ప్రణాళిక.. ఆశ మొదటి నుండి అర్థం చేసుకున్న సుధీర్‌కి.. మాధురి తరహా ఏమాత్రం నచ్చలేదు. ఆస్తి కోసమే కదా అమ్మ తనని రెండో పెళ్లి అమ్మాయికి ఇచ్చింది.. మరి ఇదేమిటని అతని ధర్మబుద్ధికి తోచింది. అదే అతను భార్యను అడిగాడు. దేవసేనకంటే పదహారాకులు ఎక్కువ చదివిన మాధురికి సుధీర్ ‘చూపుల గుర్రమ’ని, బాగా మెతక అని తెలిసిపోయింది. అందుకే గొడవ చిలికి చిలికి గాలీ వానా అవుతుండగా‘నువ్వు పైన పటారం లోన లొటారం గాడివి’ అనేసింది. అమ్మ కొంగు పట్టుకుని తిరగక నీకు పెళ్ళెందుకు కావాల్సి వచ్చిందని సుధీర్ ముఖాన ఉమ్మింది. ఆ మాట విని, చీమ పైన కూడా చెయ్యి ఎత్తని సుధీర్.. మాధురిపై చెయ్యెత్తాడు. చెయ్యెత్తాడే కానీ చెయ్యి చేసుకోలేదు. కానీ ఆ రాత్రి గడిచి, వేకువయ్యీ అవగానే మాధురి తల్లి, మేనత్త,పెద్దమ్మ మూకుమ్మడిగా బస్సు దిగారు. అలా దిగిన వాళ్ళకి, దేవసేనకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తల్లికి వత్తాసుగా వెళ్లిన సుధీరును భార్య ఆమె తరపున ఆడవాళ్లు అందరూ కలిపి చితక కొట్టారు. సుధీర్ తల్లి ముందరే మాధురి అతనిని పడదోసి, అతని మీద కూర్చుని అతని వృషణాలని గట్టిగా వత్తేసింది. సుధీర్ ఆ నొప్పితో విలవిలలాడుతూండగా, దేవసేన నిర్ఘాంతపోయి చూస్తూండగా.. మాధురిని తీసుకుని ఆమె బంధుబలగం వెళ్లి పోయింది. వెళ్లిన మాధురి వెళ్లినట్లు వుండలేదు. సుధీర్‌పై, దేవసేనపై వరకట్నం కోసం తనను వేధించారని కేసు పెట్టింది.ఒకరోజు ఉదయం పదిగంటలకి దేవసేన, సుధీర్.. వాళ్లకున్న చిన్న జామతోటలో పని చేసుకుంటూ వున్నారు. హఠాత్తుగా చెమటలు కక్కుకుంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు తోటలోకి వచ్చారు ‘సుధీరంటే ఎవరూ?’ అంటూ.సుధీర్.. పోలీసులని చూసి నిర్ఘాంతపోయాడు. కొద్దోగొప్పో చదువుకున్నా అతనికి ఈ పోలీసులు, కేసులు వంటి వాటి గురించి అవగాహన లేదు. తనని వెదుక్కుంటూ పోలీసులు రావడమేమిటో అతనికి అర్థం కాలేదు. పోలీసులను చూడగానే పైకెత్తి కట్టుకున్న పంచె కిందికి దించి నమస్కారం చేసి రెండు కుర్చీలు తెచ్చి వేసి, రెండు నీళ్ల టెంకాయలు కొట్టి వాళ్లకి ఇచ్చి వివరం అడిగాడు. అతని భారీ శరీరాన్ని అతని మృదువయిన గొంతును చూసి వాళ్ళు కొంచెం వివరం బోధపడినట్టు దేవసేన వైపుకి తిరిగి ‘నువ్వేనా దేవసేన అంటే’అని ప్రశ్నించారు. అలా వాళ్ళు తనని బొడ్డుకోసి పేరు పెట్టినట్టు అడగడం నచ్చలేదు దేవసేనకు. అయినా పోలీసులతో మనకెందుకు అని తల ఊపి వూరుకున్నది. వచ్చిన వాళ్ళు టెంకాయ నీళ్లు తాగి తెరిపిన పడ్డాక నిదానంగా మాధురి పెట్టిన కేసు వివరం చెప్పి.. తల్లీ కోడుకులిద్దరూ ఇప్పుడు తమతో రావాల్సి ఉంటుందని అన్నారు. ఆ మాట విని దేవసేన దడుచుకుని ఏడవడం మొదలుపెట్టింది.సుధీర్‌కి నెమ్మదిగా బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. వచ్చిన కానిస్టేబుళ్ళతో చాలా దీనంగా తన తల్లిని వదిలేయమని, తాను వాళ్ళతో వస్తానని, వాళ్ళేం చేయమంటే అది చేస్తానని అన్నాడు. వచ్చిన కానిస్టేబుళ్లలో ఒకావిడకి సుధీర్‌ని చూసి మనసు కరిగిపోయింది. తోటి కానిస్టేబుల్ని పక్కకి తీసుకుని వెళ్లి ‘సరేలే ఈ పిల్లాడు ముఖ్యం కదా మనకి, ఆవిడ కథ తరవాత చూద్దాంలే! ఎక్కడికి పోతుంది!’ అని చెప్పింది. అలా వాళ్ళు సుధీర్‌ని వున్నపళంగా తీసుకెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘తెలిసిన వాళ్ళని పిలిచి సహాయం తీసుకో అమ్మ, రేపో మాపో మేము కాకపోతే ఇంకో పోలీసులు నీ కోసం వస్తారు. ఏం చేద్దాం పాపం చెట్టంత కొడుకుకి కష్టం వచ్చింది. చూస్తే బిడ్డ మంచివాడిలా వున్నాడు’ అని మరో నీళ్ల టెంకాయ తాగి, దేవసేన ఇచ్చిన కవర్లనిండా జామకాయలు కోసుకుని వెళ్లిపోయారు.సినిమాలు చాలా తక్కువ చూసే సుధీర్‌కి పోలీసులు పట్టుకెళుతున్నపుడు జైలు ఎలా ఉంటుందో అనే ఆలోచన చప్పున మనసులోకి వచ్చింది. జైలు జీవితాన్ని చూపించిన సినిమా తాను ఒక్కటి కూడా చూడలేదని అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. భద్రంగా, తల్లిచాటు బిడ్డగా పెరిగిన అతనికి జైలులో వున్న కొన్ని నెలలలో డిప్రెషన్ తారస్థాయికి చేరుకున్నది. పడుకున్నా లేచినా మాధురిని తాను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అతనికి జ్ఞాపకం వస్తూ ఉండేది. తన ఛాతీ మీద పడుకుని ‘ఇక్కడ తల పెట్టుకుని పడుకుని చచ్చిపోతే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు’ అన్న ఆమె మాటలు జ్ఞాపకం వచ్చేవి. తనని ఒకరోజు సాయంత్రం స్నానాల గదిలో వున్నప్పుడు బయట నుండి మాధురి గడియ పెట్టెయ్యడం జ్ఞాపకం వచ్చేది. ఆ రోజు తాను తలుపు కొట్టి, కొట్టి అలిసిపోయి ఒక లక్ష దోమలు తన మీద దాడి చేసి రక్తం పీక్కుతినేయడం జ్ఞాపకం వచ్చేది. ఎందుకలా చేశావని అడిగితే మాధురి చాలా అనాయాసంగా తమాషాకి గడి పెట్టానని, స్నేహితురాలితో మాట్లాడుతూ ఆ విషయం మరచిపోయానని చెప్పడం జ్ఞాపకం వచ్చేది. తను కొట్టే వాడో తిట్టే వాడో అయితే ఆ రోజు మాధురిని ఏదో ఒకటి అనేవాడు కదా? తనసలు నోరు తెరిచి ఒకమాట అనలేదు. మాధురికి ఇవన్నీ గుర్తు లేవా? తన తల్లి ఆస్తి అడిగిందే అనుకో దాన్ని తన పేరు మీదే కదా రాయమంది. రాస్తే ఏంపోయింది? తానే మాధురి సొంతం కదా? ఇంత చిన్న విషయం ఆమెకెందుకు అర్థం కాలేదు?.. ఇలా సుధీర్ ఆలోచనలు సాగిపోయేవి. ఏవేవో తలచుకుని, ఏవేవో గుర్తొచ్చి అతనికి ధారాపాతంగా కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉండేవి. మొదట అతని శరీరం చూసి భయపడ్డ జైలు సహచరులు అతని కళ్ళ నీళ్లు చూసి అతనికి ఆత్మీయులయ్యారు. అలా అనువుగాని చోట కూడా సుధీరన్న బోలెడు స్నేహితులను మూటకట్టుకున్నాడు కానీ, ఏడడుగులు నడిచి గుండెల మీద పడుకోబెట్టుకున్న భార్యకి మాత్రం అతను ఆత్మీయుడు, నమ్మకస్థుడు కాలేకపోయాడు. సుధీరన్న జీవితమనే బుల్లెట్టు బండి అక్కడ సడన్ బ్రేక్ వేసి లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఆయన జైలు నుండి బయటకి వచ్చినా ఆయన జీవితం విషాదమనే కాలబిలం నుండి బయటకు రాలేదు. మొదటి నుండి తండ్రిలేని బిడ్డగా బాగా బతికి చెడిన తల్లి కొడుకుగా అతని చుట్టూ విషాదం గూడు కట్టుకుని ఉండేది. దానిని మోసుకుంటూ ఆయన జీవితాన్ని లాక్కొచ్చేవాడు. నిజానికి తాను ఒక విషాద వలయంలో బతుకుతున్నానని అతనికి గుర్తింపు కూడా లేదు. చాలా ఉత్సాహంగా ఉరుకులు పెట్టే పదేళ్ల అబ్బాయి, తండ్రి అదృశ్యం తరువాత ఎందుకు ముభావం అయిపోయాడో తనలోకి తాను తరచి చూసుకునే శక్తి, జ్ఞానము అతనికి లేకపోయింది. అలా అతను మోసుకుంటూ, పెంచి పెద్దచేసుకుంటూ వచ్చిన విషాదం ఈసారి మాధురి ఘట్టంతో అతనిని పూర్తిగా లోబరుచుకుంది. సుధీరన్న అప్పుడు మొదలుపెట్టాడు తాగడం. మొదట బాధ మరచిపోవడానికి తాగేవాడు. ఆ తరువాత తాగకుండా ఉండలేక తాగేవాడు.కాలక్రమంలో అతనికి విడాకులు వచ్చాయి. మాధురి పిల్లని కూడా అతను చూడకుండా జీవితాన్ని కట్టుదిట్టం చేసుకుంది. తన కొడుకు జీవితం తన కళ్ళ ముందే చిందరవందరగా మారడం చూసిన దేవసేన వైరాగ్యం పేరుతో సుధీర్‌ని ఒంటరిగా వదిలేసి ఎప్పటిలాగే తన స్వార్థం తాను చూసుకుని పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో చేరిపోయింది.మరి విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తరువాత ఏం జరిగిందని సుధీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఎవరూ చెప్పలేక పోయారు.సుధీరన్న చనిపోవడానికి కొంతకాలం ముందు కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలని కొడుకు దగ్గరకి వచ్చిందట దేవసేన. తల్లి వచ్చినప్పటి నుండి కనిపించిన బంధువులకి ‘మా అమ్మ నస భరించలేకుండా ఉండాన’ని చెప్పుకునేవాడట. మళ్ళీ తనే ‘మా అమ్మ నన్ను సాకినట్టు ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డను సాకి ఉండదు’ అనే వాడట. ఏమయిందో ఎవరికీ తెలీదు, ఏం జరిగిందో దేవసేన ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు తల్లి పక్కగదిలో ఉండగానే తల్లికి అన్నము, కూర అన్నీ వండి గిన్నెలో వేసి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్లి వురి వేసుకున్నాడు. దగ్గరి బంధువుతో అంతకు కొన్నిరోజుల ముందు ‘మావా, సస్తే పోతది అనిపిస్తా వుంది. నావల్ల ఎవరికేమి ప్రయోజనం? సస్తే నాకన్నా శాంతి దొరకతది కదా?’ అన్నాడట. ఆ మాటలు విని బంధువు ‘అబ్బయ్య! బలవంతంగా సస్తే నరకానికి పోతామంట. అక్కడ కూడా నీకు మనశ్శాంతి దొరకదు’ అన్నాడట. ఆ మాట విని ‘అంతేనంటావా? అయితే సరేలే!’ అన్నాడట.శవం దగ్గర పొర్లి పొర్లి ఏడుస్తున్న దేవసేనను చూసి ఎవరూ జాలిపడలేదు.మొదటి నుండి దేవసేన తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేదని అందరూ చెప్పుకున్నారు. బిడ్డ.. తల్లి మాట జవదాటేవాడు కాదని, అందుకే అతని జీవితం ఇట్లా నాశనమైందని అనుకున్నారు. పెళ్లయిన తరువాత భార్యాభర్తల మధ్యకి ఎవరూ పోగూడదని, ఈ దేవసేన.. సుధీర్ కాపురంలో చొరబడి నిప్పులు పోసిందని వచ్చిన వాళ్లలో విజ్ఞులు అన్నారు. కానీ శవానికి ఒకవైపు నిలబడి చేతులు కట్టుకుని ఇదంతా వింటున్న సుధీర్ స్నేహితుడు మాత్రం ‘ఏదంటే అది మాట్లాడబాకండి.. వాడికి అమ్మంటే ప్రాణం. ఇప్పుడు లేపి అడిగినా మా అమ్మ దేవత అంటాడు’ అన్నాడు.చంద్రుడిని చూస్తుంటే సుధీరన్న ఎందుకు జ్ఞాపకం వచ్చాడో చెప్పాలి. మేము చిన్న పిల్లలుగా వున్నప్పటి సంగతి.. ఒక రోజు అందరం వెన్నెట్లో ఆటలాడుతూ వున్నాం సుధీరన్న హఠాత్తుగా ఆకాశంలోకి చూసి పక్కనున్న నాతో ‘బుజ్జమ్మ! ఆ చంద్రుడు, దాని పక్కనే వున్న ఆ చుక్కను చూశావా.. వాటిని చూస్తే నాకు మా అమ్మ, నాయన అనిపిస్తారు. చంద్రుడేమో మా అమ్మ. ఆ చుక్కేమో మా నాన్న. మా అమ్మని వదిలేసి నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎలా వెళిపోతున్నాడో చూడు మా నాయన, అందుకే అలా మసక మసకగా వున్నాడు’ అన్నాడు. -
యువ కథ: అడవి
వసంతం తెచ్చిన చివురులతో అడవిలోని చెట్లు రకరకాల వర్ణాలతో పురుడు పోసుకుని వున్నాయి. పూలు పరిమళాలతో తేనెలూరుతూ వున్నాయి. ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ వున్న మేఘనా«థుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞపకాలను మోసుకొనిపోతూ వున్నాడు. ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంత వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ వుంది. అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది. ఇంతలో బాగా ఆకలిగా వున్న ఓ పెద్దపులి వేట కోసం వెదుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది. పులి అలికిడి విన్న ఆవు పులి కళ్లలోని ఆకలిని చూసి వెనువెంటనే ‘ఆగు పులిరాజా ఆగు.. ఒక్కమారు నా మాట ఆలకించు’ అంది. ‘నీ మాటలు ఆలకించే స్థితిలో లేను. ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను’ అంటూ పులి తన పంజా విసిరింది. పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు ‘అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది. ‘ఏమిటా కోరిక?’ ‘ఓ పులిరాజా.. నాకు ఓ యజమాని ఉన్నాడు. అతడు లోకం తెలియని వట్టి అమాయకుడు. కడు బీదవాడు. అతనికి నేనే జీవనాధారం. ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని యెడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు. కావున నేను ఇంటికి వెళ్లి నా యజమానికి ౖధైర్యం చెప్పి మరోవిధంగా జీవనాన్ని వెతుక్కోమని చెప్పి తిరిగి వస్తాను.’ ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ‘నేనేమన్నా వెర్రిదాన్ననుకున్నావా.. నీ కల్లబొల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి?’ అంది. ‘అయ్యో రాజా.. ఇవి మాటలు కావు.. పరమ సత్యాలు. పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికి రాని కడలి వంటిది. నీ ఆకలిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే. కాని ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత’ అంది.ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి ‘శిశిరం చేసిన గాయాలకు ఓర్చి వసంతం కోసం ఎదురు చూసే వనంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళి త్వరగా తిరిగి రా’ అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలు చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది.ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ వున్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూవున్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆవు అడవిలో జరిగినదంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా వుంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి ‘నువ్వు వెళ్ళి రా నీకు ఏమీ కాదు!’ అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు. ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది.ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ వున్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి ‘నీకేమన్నా మతిగాని పోయిందా? ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా సావడానికి! అసలే దానికి పుట్టిన లేగదూడ సచ్చిపోయె. ఇపుడు దాని పాలే మనకు జీవనాధారం’ అంటూ భర్తను కోప్పడింది. ‘ఓసి పిచ్చిదానా! నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా? వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఓ ఆవు ఉండేది. అయితే దానికి లేగదూడ కూడా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది. అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని, అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమిలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. అయితే వేళకాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసిన మా తాత ‘ఏమయి ఉంటుందా?’ అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు. అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనవరాలుకు జరుగుతుంది. అదే తిరిగి వచ్చేస్తుందిలే’ అంటూ నులక తాడు పేనే పనిలో నిమగ్నమయ్యాడు. యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకుని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ వుంది ఆవు. ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంలో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది. ‘ఓ అందగాడా.. నడిజాములో ఆ దివి నుండి ఈ భువిపై దిగిన జాబిల్లిలా ఉన్నావు. నన్ను ప్రేమించవూ?!’ అంటూ పలికింది. కోయిల మాటలు విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది.కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ వుంది. అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి. అప్పుడే ఓ నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళ్తూ వుండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి అ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకుని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామరలను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ వుండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకులుగా ఆవు పై పడుతూ వుండగా ‘నింగీ నేలా సాక్షి.. నన్ను ప్రేమించవూ?!’ అంది కోయిల. ఆవు మారుమాటలాడక కోయిల వంక కనురెప్పయినా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది. కోయిల ఎగరటం మరచి ఆవుతోపాటు పక్కనే నడుస్తూ వుంది. ఆ అడవిలో అవి రెండూ వేటికవే ఆలోచనల ప్రవాహంలో ఒంటరిగా సాగిపోతూ వున్నాయి. ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ వుంది. దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ వున్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ వుంది. అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదలిపోతూ వున్న యేటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ ‘అలలనేం చూస్తావోయీ.. అలల మాటున దాగిన మనసు ఊసును చూడు. ఆకాశమంతా చినుకయి పోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు. నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవూ!?’ అంది కోయిల.సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో వున్నాడు. ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టు పై వాలి చుట్టూ చూస్తూ ఉంది. కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ వున్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ‘ఏమయి ఉంటుంది?!’ అని ఆవు కోయిలకు తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది.రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ వున్నాయి ఆవూ కోయిలా. చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి ‘నేను నల్లగా వున్నాననా నన్ను ప్రేమించడంలేదు!?’అంది.‘లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం. తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను. తిరిగి రాలేను. నీవు అందమైన దానవు. కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు. ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు’ అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి, కోయిల నుండి సెలవు తీసుకుని ఒంటరిగా ముందుకు పయనమైంది. కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చెట్టు పై నుండి గమనిస్తూ వున్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగౌతూ వున్న ఆవును చూస్తూ ‘ప్రేమ అందంగా ఉంటుంది కదూ’ అంటూ పలికింది. కోయిల చిలుక వైపు చూసి ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాని ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది’ అంది. తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు, మోహించే కోరికలను దాటుకుని ఆవు.. పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ వుంది. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకుని ముందుకు పరుగులు తీయసాగాయి. ఆవు వెళ్ళే దారిలో అడవి అంతా అలజడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తూ, ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ వున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చగానూ దట్టమైన పొగతోనూ నిండి ఉంది. ఏమి జరుగుతున్నదో ఆవుకు ఏమీ అర్థం కాలేదు. అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకొస్తూ వున్న అగ్నిని చూపుతూ ‘తప్పించుకొని పారిపోండి... తప్పించుకొని పారిపోండి’ అంటూ అరుస్తూ ఉన్నాయి.సరిగ్గా ఆ సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది. పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది. ‘పులిరాజా! ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో’ అంది ఆవు.‘ఇచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది. మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు’ చెప్పింది పులి. అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి. పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసిన ఆవు ‘రాజా ఏమిటిది? ఎవరు చేశారు ఇదంతా?’ అడిగింది.‘మిత్రమా.. మనిషి! మనిషి చేశాడిదంతా! ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట. అందుకే అగ్గి రాజేశాడు. ఈ అందమైన అడవి.. మన అడవి... ఆకలికి తప్ప అత్యాశకు చోటులేని అడవి.. ప్రేమను కోరే అడవి.. పరవశాల అడవి.. ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చుగాని పెత్తనం ఉంటుందా? అడవికి రాజైనా నేను పెత్తనం చేయనే! ఈ మనిషెంత పతనశీలి? మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పు పెట్టాడు. త్వరపడు మిత్రమా త్వరపడు! ఇక్కడి నుండి బయటపడు’ అంటూ ఆవును త్వరపెడుతూ చుట్టూతా చూసింది పులి.మంటలు కమ్ముకున్నాయి. ‘అయ్యో.. మంటలు మనల్ని చుట్టుముట్టాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. క్షమించు మిత్రమా.. నీ దుస్థితికి కారణం అయినందుకు!’ అంటూ ఆవుని క్షమాపణలు కోరింది పులి. తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి ‘నీలాంటి మంచి మిత్రుడిని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది’ అంది ఆవు పులితో. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది!’ అంది పులి ఆవుతో. మనిషి రాజేసిన అగ్ని అడవిని, అడవిలోని జంతువులతోపాటు ఆ ఇరువురినీ బూడిద చేసింది.ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి వున్న నల్లని పొగ మాటున చావు దుప్పటి కప్పుకుని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు. -
ధౌమ్యుడు అతడి శిష్యులు
ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరుణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ముగ్గురూ చాలా తెలివైన వారు. అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులలో ఆరుణిని పిలిచాడు. ‘మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి, వరిచేనును ముంచేస్తోంది. నువ్వు వెళ్లి, ఆ కాలువకు అడ్డుకట్ట వేసి రా’ అని ఆజ్ఞాపించాడు. ఆరుణి పొలానికి వెళ్లి, గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెచ్చి, గట్టుకు అడ్డుగా వేశాడు. అయినా అది నిలువలేదు. ఇక ఏం చేయాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రి అయినా ఆరుణి ఆశ్రమానికి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. పొలంలో వెదుకుంతుండగా, కాలువ గట్టుకు అడ్డంగా పడుకుని ఉన్న ఆరుణి కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, ‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుడిని పిలిచి, ‘పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజూ ఆవులను మేపి వస్తూండు’ అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు.ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ, చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని చేస్తున్నా ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ‘ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చుని తింటున్నా నేను నీ అంత పుష్టిగా లేను సుమా’ అన్నాడు.‘ఆచార్యా! నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజూ ఎన్నో వంటకాలు దొరుకుతుంటాయి. వాటిని ఆరగిస్తుండటం వల్లనే పుష్టిగా ఉన్నాను’ అని చెప్పాడు ఉపమన్యుడు.‘అలాగైతే, నువ్వు రోజూ సంపాదించే భిక్షను తీసుకొచ్చి నాకు ఇస్తూండు’ ఆదేశించాడు ధౌమ్యుడు.ఉపమన్యుడు ప్రతిరోజూ తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా, ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగా ఉండేవాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు, ‘నువ్వు తెచ్చినదంతా నాకే ఇచ్చేస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు. అదెలా సాధ్యమవుతోంది?’ అని అడిగాడు. ‘ఆచార్యా! పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు ఇచ్చి, రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను’ బదులిచ్చాడు ఉపమన్యుడు. ‘ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే ఇస్తూండు’ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచినా, ఉపమన్యుడు యథాప్రకారమే కనిపించసాగాడు. ‘రెండు పూటల భిక్ష నాకే తెచ్చి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు?’ అడిగాడు ధౌమ్యుడు.‘ఆవుల పాలు తాగుతున్నాను ఆచార్యా!’ అని బదులిచ్చాడు ఉపమన్యుడు.‘పాలు లేక లేగదూడలు బక్కచిక్కిపోతున్నాయి. ఇకపై నువ్వు ఆవుపాలు తాగడం మనుకో’ ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవుపాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచేకొద్ది కృశించసాగాడు.ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని, జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకు వస్తుండగా, దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవులు అలవాటు కొద్ది ఆశ్రమానికి చేరుకున్నాయి గాని, వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు.రాత్రి ఎంతసేపటికీ ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెదుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక, బావిలోంచి ఆర్తనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్లి చూడగా, ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి, ఆశ్వనీ దేవతల మంత్రం ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలనూ నేర్పించి, తనంతటి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో మూడోవాడైన బైదుడికి కూడా ఇలాగే కఠిన పరీక్షలు పెట్టి, వాటిని నెగ్గిన తర్వాత అతడికి కూడా అన్ని విద్యలనూ ఉపదేశించాడు.‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. ∙సాంఖ్యాయన -
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగే కేమెల్ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
Mystery: నేరాన్ని దాచే నేరం!
అది అమెరికా, మిషిగన్ రాష్ట్రంలోని సీడర్ స్ప్రింగ్స్ ప్రాంతం. 1996 ఆగస్ట్ 7, అర్ధరాత్రి 12 దాటింది. రేచల్ టిమెర్మన్ (18) అనే అమ్మాయి, మార్విన్ గేబ్రియల్ (43) అనే ఫ్యామిలీ ఫ్రెండ్ కారులో బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ కారులో మరో ఇద్దరు సుపరిచితులున్నారు. అయితే మార్విన్ ఉన్నట్టుండి కారు ఆపి, మిగిలిన ఇద్దరితో గొడవపడి, కారు దింపేశాడు. రేచల్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తీవ్రంగా హింసించి, అత్యాచారం చేశాడు. ‘ఎవరికైనా చెబితే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని ఆమెను బెదిరించి వదిలిపెట్టాడు. రేచల్కి రెండేళ్ల షానన్ అనే కూతురుంది. ఓ రెస్టరెంట్లో పని చేసుకుంటూ, తల్లిదండ్రులైన వెల్డా, టిమ్‌లకు సమీపంలోనే నివాసముండేది. టిమ్ దంపతులకు తమ కూతురు, మనవరాలంటే ప్రాణం.మార్విన్ చేసిన పనికి రేచల్ మానసికంగా కుంగిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంది. తెలిసినవారిని చూసినా భయపడేది. కొన్ని వారాలు గడిచాయి. ఆమె తీరు గమనించి ఆరా తీస్తూ వస్తున్న తల్లి వెల్డాకు– ఒకరోజు తట్టుకోలేక ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది రేచల్. వెంటనే వెల్డా ధైర్యం చెప్పింది. టిమ్‌ను తోడుగా పంపించి, రేచల్తో మార్విన్ పై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించింది. వెంటనే పోలీసులు మార్విన్ ను అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. తిరిగి రేచల్‌ను మామూలు మనిషిని చేయడానికి టిమ్, వెల్డాలు తీవ్రంగా శ్రమించారు. ‘వాడికి శిక్షపడేలా చేద్దాం. నువ్వు భయపడొద్దు. మనుషులంతా ఒకేలా ఉండరు’ అని ధైర్యం చెబుతూ, సాధారణ జీవితానికి అలవాటు చేశారు.అయితే, విచారణ తేదీ వచ్చిన ప్రతిసారీ మార్విన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని భయపడేది. సుమారు ఆరు నెలల విచారణ తర్వాత మార్విన్ ను జైలుకు పంపారు. తర్వాత రెండు వారాలకే బెయిల్‌పై బయటికి వచ్చిన మార్విన్ – ‘కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని రేచల్‌ను బెదిరించాడు. అయినా భయపడొద్దని టిమ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. మరో ఐదు నెలలు గడిచేసరికి రేచల్ పూర్తిగా మామూలు మనిషయింది. ఒకరోజు సంబరంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నాతో డేటింగ్‌కి ఇష్టపడుతున్నాడు. నా కూతురు షానన్ ని కూడా నాతోనే తీసుకుని రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అని కూతుర్ని తీసుకుని వెళ్లింది.మరుసటి రోజు రేచల్ నుంచి టిమ్‌కు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘నేను సెలవుపై వెళ్తున్నాను’ అని రాసింది. కొన్ని రోజుల ముందే కొత్త ఉద్యోగంలో చేరిన రేచల్ సెలవు పెట్టడం ఏంటనే అనుమానంతో పాటు మార్విన్ కోర్టు వాయిదా దగ్గర పడుతుండటంతో టిమ్‌కు భయం మొదలైంది. వాయిదా రోజుకు కూడా రేచల్ రాలేదు. షానన్ ఏమైందో తెలియలేదు. వాయిదా రోజున రేచల్ రాకపోయేసరికి మరో 11 రోజులకు కేసు వాయిదాపడింది. ఆ 11 రోజులు గడిచాక, వాయిదా నాటికి రేచల్ నుంచి మరో లేఖ కోర్టుకు వచ్చింది. ‘నా అంతట నేనే మార్విన్ తో సంబంధాన్ని కోరుకున్నాను. అతడు నిరాకరించేసరికి ఆ కోపంతోనే అతడిపై అత్యాచారం కేసు పెట్టాను’ అని అందులో రాసింది. దాంతో టిమ్‌తో పాటు అధికారులకు రేచల్ కిడ్నాప్ అయ్యి ఉంటుందనే అనుమానం మొదలైంది. దాంతో ఆమె కోసం గాలింపు మొదలైంది. సరిగ్గా రెండు వారాలకు సమీపంలోనే ఆక్స్ఫర్డ్ సరస్సులో రేచల్ శవమై తేలింది. నోటికి, కళ్లకు పెద్దపెద్ద ప్లాస్టర్స్ చుట్టి, చేతులు, కాళ్లకు రెండు సిమెంట్ దిమ్మలు కట్టి సరస్సులో ముంచేశారు. అంటే ఆ లేఖలు బలవంతంగా రాయించారని అధికారులు నమ్మారు. వెంటనే మార్విన్ ఇంటిని తనిఖీ చేయగా పసిపిల్లల పాలసీసా దొరికింది. అది షానన్ ది కావచ్చని నమ్మారు. పైగా రేచల్ కాళ్లు, చేతులకు కట్టిన సిమెంట్ దిమ్మల్లాంటి దిమ్మలు మార్విన్ ఇంటి ముందున్నాయి. అయితే, అప్పటికే మార్విన్ తప్పించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మార్విన్, షానన్ తో పాటుగా మరో ఇద్దరు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. మొదటి వ్యక్తి వేన్ డేవిస్. అతడు మార్విన్ స్నేహితుడు. అలాగే రేచల్‌పై అత్యాచారం జరిగిన రాత్రి కారులో ఉన్న ఇద్దరిలో ఒకడైన రెండవ వ్యక్తి జాన్ వీక్స్. అతడు మార్విన్కు పరిచయస్థుడు, రేచల్‌కు స్నేహితుడు. ఆమెను డేట్‌కి పిలిచింది అతడేనని తర్వాత విచారణలో తేలింది. రేచల్ అతడ్ని నమ్మే షానన్ తో పాటు అతడితో వెళ్లిందట! వీళ్లందరినీ మార్విన్నే మాయం చేసి ఉంటాడనే క్లారిటీకి వచ్చారు పోలీసులు.కొన్ని నెలలకు న్యూయార్క్ పోలీసులు– రాబర్ట్ అలెన్ అని చెప్పుకుని తిరిగే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాబర్ట్ అలెన్ అనే వ్యక్తి అప్పటికే కనిపించడం లేదని అతడి ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చిందట! అయితే అతడి కార్డ్స్ అన్నీ వాడుకలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు రాబర్ట్ కోసం నిఘా పెట్టారు. చివరికి న్యూయార్క్‌లో పట్టుకున్నారు. అయితే, అతడు రాబర్ట్ అలెన్ పేరుతో చలామణీ అవుతున్న మార్విన్ అని గుర్తించి, పోలీసులు షాక్ అయ్యారు. ‘రాబర్ట్ ఎక్కడ?’ అని మార్విన్ ని నిలదీస్తే తెలియదన్నాడు. ఇక అరెస్ట్ చేసి, తీసుకొచ్చి రాబర్ట్ మిస్సింగ్ కేసుతో పాటు రేచల్ మర్డర్ కేసులో కూడా మార్విన్ ను విచారించడం మొదలుపెట్టారు. రేచల్ హత్యకు తనకు సంబంధం లేదని మార్విన్ వాదించాడు. రాబర్ట్ మిస్సింగ్ కేసులో కొన్ని కీలక ఆధారాలతో కేసు బిగుసుకుంది. మార్విన్ కు మరణశిక్ష పడింది. తర్వాత మార్విన్ అప్పీలు చేసుకోవడంతో మరణశిక్ష రద్దయి, విచారణ మళ్లీ మొదలైంది. ఆ క్రమంలోనే మార్విన్ తన పక్క ఖైదీకి ఆక్స్ఫర్డ్ సరస్సు మ్యాప్ ఇవ్వగా దానిపై ఒక క్లూ ఉంది. ‘3+ 1, ఒక మృతదేహం దొరికింది’ అని రాసుకున్నాడు మార్విన్ . అతడి దృష్టిలో 3 అంటే పాప షానన్, జాన్ వీక్స్, వేన్ డేవిస్ కాగా, 1 అంటే రేచల్ కావచ్చు అని అధికారులు అంచనా వేశారు. సరిగ్గా రేచల్ మృతదేహం దొరికిన ఐదేళ్లకు అదే సరస్సులో వేన్ డేవిస్ మృతదేహం దొరికింది. రేచల్ చనిపోయినట్లే డేవిస్ కూడా చనిపోయాడని రిపోర్ట్స్ తేల్చాయి. డేవిస్‌ని కూడా రేచల్‌ను కట్టినట్లే సిమెంట్ దిమ్మలతో కట్టి, కళ్లకు, నోటికి ప్లాస్టర్స్ వేసి సరస్సులో పడేశారు. మరోవైపు మార్విన్ తన తోటి ఖైదీలతో బిడ్డ (షానన్ )ను ఎక్కడ దాచాలో తెలియక చంపేశాను’ అని చెప్పాడట! అయితే, ఈ కేసులో మిస్ అయిన పాప షానన్, జాన్ వీక్స్, రాబర్ట్ అలెన్ వీరంతా ఏమయ్యారో తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లతో ఇంద్రజిత్‌కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేక్ షబ్బీర్‌కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్‌దేవ్‌పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్‌తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్‌కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్‌పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్‌సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్‌లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్‌లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్‌ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్‌లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్‌బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
సెంచరీకి చేరువలో సైన్స్ ప్రయోగం
సైన్స్ ప్రయోగం ఒకటి ఒకసారి విఫలమైతే రెండోసారి చేస్తారు. అది విఫలమైతే మరోసారి.. ఇలా ఎన్నోసార్లు ఎన్నో పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కాని, ఒకే ప్రయోగాన్ని దాదాపు వందేళ్లుగా చేయటాన్ని చూశారా? ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో, ప్రొఫెసర్ థామస్ పార్నెల్ 1927లో ప్రారంభించిన ‘పిచ్ డ్రాప్’ ప్రయోగం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇటీవల దీనిని ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా సాగుతున్న ప్రయోగశాల ప్రయోగంగా గిన్నిస్ బుక్‌లో చేర్చారు. ప్రొఫెసర్ పార్నెల్, విద్యార్థులకు ఘనపదార్థాలుగా కనిపించేవన్నీ, నిజానికి ఘన పదార్థాలు కావని నిరూపించడానికి ఈ ప్రయోగాన్ని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం, పడవల్లో సీల్ చేయడానికి ఉపయోగించే మందపాటి తారు ద్రవాన్ని ఎంచుకున్నాడు. ముందుగా తారు పదార్థాన్ని వేడి చేసి, ఒక గాజు గరాటులో పోసి, సుమారు మూడు సంవత్సరాలపాటు అలాగే ఉంచాడు. గరాటులో ఆ ద్రవం ఘన స్థితికి వచ్చిన తర్వాత, 1930లో, గరాటు కింద గొట్టాన్ని కత్తిరించాడు. అప్పటి నుంచి పిచ్ పదార్థం దశాబ్దానికి ఒక చుక్క కిందకు పడుతోంది. ఇప్పటివరకు, ప్రయోగం ప్రారంభించిన ఇన్నేళ్లలోనూ కేవలం తొమ్మిది చుక్కలే కిందకు పడ్డాయి. చివరిగా ఏప్రిల్ 2014లో పడింది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ప్రకారం, ఈ ప్రయోగం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఏర్పాటు చేశారు. తారును ఉంచడానికి నిర్దిష్ట పరిస్థితులేవీ లేవు. వేర్వేరు సమయాల్లో వచ్చే ఉష్ణోగ్రత మార్పులే దీనిని ప్రభావితం చేస్తూన్నాయని కొంతమంది వాదన. ప్రస్తుతం మళ్లీ మరో దశాబ్దం ముగుస్తుండటంతో ఈ ప్రయోగంపై మరోసారి ఆసక్తి చెలరేగింది. చూడాలి మరి మరో చుక్క గరాటు నుంచి కిందకు ఎప్పుడు పడుతుందో! -
Mystery: రక్తబంధం
‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్‌లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్‌లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్‌తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్‌తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్‌తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను. బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్కి తెలియదు. ప్రస్తుతం చెట్కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది! ∙సంహిత నిమ్మన