
యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు.
పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా, సుభిక్షంగా పరిపాలించేవాడు. సోమదత్తుడు సత్య ధర్మాలను పాటించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. సాధు సజ్జనులను సముచితంగా గౌరవించేవాడు. సోమదత్తుడి వైభవం నానాటికీ ద్విగుణం కాసాగింది. అతడి వైభవం శత్రువులకు కంటగింపుగా మారింది. ఎవరికి వారే అతడిపైకి యుద్ధానికి వెళితే ఎదిరించడం సాధ్యం కాదని తలచి, శత్రువులందరూ సోమదత్తుడికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అందరూ కలసి అతడిపై యుద్ధం చేసి, అతడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తీర్మానించుకున్నారు.
శత్రువులందరూ అదను చూసుకుని, సోమదత్తుడి రాజధాని మహిష్మతీపురాన్ని నలువైపుల నుంచి ముట్టడించారు. శత్రువుల దురాక్రమణ సంగతి తెలియగానే, సోమదత్తుడు సైన్యాన్ని ఆయత్తం చేసి, యుద్ధానికి బయలుదేరాడు. వేలాది అక్షోహిణుల చతురంగ బలాల మధ్య భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా గజ తురగాలు నేలకొరిగాయి. వేలాది రథాలు విరిగిపోయాయి. యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
రాజ్యం శత్రువశం కావడంతో సోమదత్తుడు తన భార్య దేవికతో కలసి అడవుల్లోకి చేరుకున్నాడు. అడవులలో ప్రయాణిస్తుండగా, వారికి గర్గ మహాముని ఆశ్రమం కనిపించింది.మహర్షిని ప్రార్థిస్తే, తమ కష్టాలు తీరవచ్చని భావించింది దేవిక.ఆమె ఆశ్రమం వద్దకు చేరుకుని, గర్గ మహాముని ముందు మోకరిల్లింది.‘మహర్షీ! శరణు శరణు! శత్రువుల చేతిలో ఓటమి చెంది నా పతి రాజ్యభ్రష్టుడయ్యాడు. భర్తతో కలసి నేను అడవుల పాలయ్యాను. నా పతిని మీరే రక్షించాలి’ అని ప్రార్థించింది.గర్గ మహాముని ఆశ్రమం వెలుపలకు వచ్చాడు.
ఆశ్రమం వెలుపల దీనవదనంతో నిలుచున్న సోమదత్తుడు కనిపించాడు.
గర్గుడు రాజ దంపతులను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు.‘రాజా! ఇది గార్గ్యాశ్రమం. ఇక్కడ భయమేమీ లేదు. నీకొచ్చిన కష్టం దుస్సహమైనది. విజయ సిద్ధి కలిగించే మంత్రాన్ని నువ్వు అనుష్ఠించలేదు. అందువల్లనే నీకు ఈ దుస్థితి వాటిల్లింది. ఎలాంటి కష్టాలు వాటిల్లినా, ధైర్యం రాజ లక్షణం. ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డడమే క్షాత్రధర్మం. అందువల్ల ధైర్యంగా ఉండు. పరిస్థితులు చక్కబడతాయి’ అని సోమదత్తుడికి నచ్చజెప్పాడు గర్గ మహాముని.
‘మునీశ్వరా! నా కష్టాలు గట్టెక్కే మార్గం బోధించండి. ఈ గడ్డుకాలాన్ని దాటడానికి నేను ఆచరించవలసిన వ్రతమైనా, జపించదగ్గ మంత్రమైనా సెలవీయండి. అందుకు పాటించవలసిన నియమాలను ఆదేశించండి’ అని వినయంగా అభ్యర్థించాడు సోమదత్తుడు.
‘రాజా! సమస్త బాధలను తొలగించి, అఖండ విజయాలను అందించే అమోఘమైన విద్య ఒకటి ఉంది. అది పంచముఖ ఆంజనేయ విద్య. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను’ అని పలికి, గర్గుడు ఇలా చెప్పాడు:
‘వైశాఖమాస కృష్ణపక్ష దశమి రోజున గాని, ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున గాని, మాఘం మొదలుగా మొదటి ఐదు మాసాలలో వచ్చే మొదటి శనివార దినాలలో గాని, మృగశిరా నక్షత్రం వచ్చే రోజున గాని, శ్రావణ పౌర్ణమి రోజున గాని, కార్తీక శుక్ల ద్వాదశి రోజున గాని, మార్గశిర శుక్ల త్రయోదశి రోజున గాని హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు పవిత్ర తోరాన్ని పదమూడు ముడులతో ధరించి, వ్రతదీక్ష చేపట్టాలి.
బంగారం, వెండి, రాగి వంటి లోహపు రేకుల మీద చెక్కిన హనుమద్ యంత్రం గాని, భూర్జపత్రం లేదా తాళపత్రం మీద గీసిన యంత్రం గాని, లేదా పిండిలో గీసిన యంత్రం గాని, పూర్ణకుంభం లేదా హనుమద్ప్రతిమను గాని పూజామండపంలో నెలకొల్పి ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రతపూజ పరిసమాప్తం అయిన తర్వాత పదమూడు నేతి అప్పాలను వాయనంగా ఇవ్వాలి. గురువుకు ధనధాన్యాదులను కానుకగా ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు అన్న సమారా«ధన చేయాలి. గొప్ప సంకల్పసిద్ధి కోరేవారు పదమూడేళ్ల పాటు ఈ హనుమద్వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాలి. దీనివల్ల హనుమదనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఘనవిజయాలు దక్కుతాయి.’
గర్గుడు చెప్పిన హనుమద్వ్రత విధానాన్ని సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. గర్గుని ఆధ్వర్యంలోనే భార్యా సమేతుడై, హనుమద్వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. హనుమదనుగ్రహంతో ఖడ్గసిద్ధి పొందినవాడై, శత్రువులను దునుమాడి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత సోమదత్తుడు గర్గుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయనకు ఘనంగా ధన ధాన్యాలను, గోవులను సమర్పించి, సత్కరించాడు.
సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment