
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.
సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.
పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.
జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?
వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.
దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్‌లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.
శరవేగంగా జ్యోతిష వ్యాపారం
ఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్‌సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్‌సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.
ఆసియా దేశాల్లో..
భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి.
మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.
జపాన్‌లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్‌ను రూపొందించుకుంటారు. జపాన్‌లో గ్రెగేరియన్ కేలండర్‌ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.
మయాన్మార్‌లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్‌గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్‌లో ఇప్పటికీ పాటిస్తారు.
పాశ్చాత్య దేశాల్లో..
ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్‌సైట్‌లు, యాప్‌లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.
ఆఫ్రికా దేశాల్లో..
ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు.
ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment