
చిరంజీవి సినిమా స్క్రిప్ట్‌కి పూజలు నిర్వహించిన అనిల్ రావిపూడి
‘‘మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక చిరంజీవిగారితో చేయనున్న సినిమాకి సంబంధించిన కథని సిద్ధం చేసేందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్‌ని సెంటిమెంట్‌గా భావిస్తాను. ఇక్కడే నా సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటుంటాను.
ఆ స్క్రిప్ట్‌లను శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్‌గా భావిస్తాను. చిరంజీవిగారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్’లో చిరంజీవిగారిని ఈ చిత్రంలో చూస్తారు. ఒక నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. మే ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా పాల్గొన్నారు. – ‘సాక్షి’, సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment