
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్‌లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.
ఫల్లాస్‌ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్‌బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు.
చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి.
(చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..)
Comments
Please login to add a commentAdd a comment