
హిరణ్యకశ్యపుడి వధ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జనరంజకంగా పరిపాలన చేయసాగాడు. ప్రహ్లాదుడి పాలనలో పాతాళలోకంలో శాంతి సామరస్యాలు వర్ధిల్లసాగాయి.ఒకనాడు భృగుమహర్షి కొడుకు అయిన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. ఆయన స్నానం చేస్తుండగా, ఒక భీకరసర్పం ఆయనను కాటువేసి, ఆయన కాలిని చుట్టుకుంది. విష్ణుభక్తుడైన చ్యవన మహర్షి మనసులో విష్ణువును ధ్యానం చేశాడు. పాముకాటు ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అయితే, ఆయన కాలిని చుట్టుకున్న పాము, ఆయనను పాతాళలోకానికి లాక్కుని పోయింది. చ్యవనుడిని పాతాళంలో విడిచి, పాము తన దారిన తాను పోయింది.పాతాళంలో కనిపించిన చ్యవనుడిని ప్రహ్లాదుడు చూశాడు.
బహుశా, ఇంద్రుడు పంపితే వచ్చి ఉంటాడని అనుకున్నాడు.చ్యవనుడి వద్దకు వెళ్లి పలకరించాడు. ‘మహర్షీ! తమరెవరు? ఇలా దయచేశారేమిటి? దేవతలు ఎవరైనా పంపితే వచ్చారా? వారి నుంచి ఏదైనా వర్తమానం తీసుకొచ్చారా?’ అని అడిగాడు.‘ప్రహ్లాదా! అలాంటిదేమీ లేదు. నర్మదా నదిలో స్నానం చేస్తుండగా, ఒక సర్పం నన్ను తీసుకొచ్చి, ఇక్కడ పడేసి పోయింది. నేను భృగుపుత్రుడిని. నన్ను చ్యవనుడు అంటారు’ అని బదులిచ్చాడు.ప్రహ్లాదుడు చ్యవనుడికి అతిథి మర్యాదలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. చ్యవనుడు కాస్త సేదతీరాక, అతడితో ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టాడు.‘మహర్షీ! భూలోకంలో తమరు ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించుకుని ఉంటారు కదా! వాటిలో గొప్ప పుణ్యాన్ని కలిగించే తీర్థాల గురించి చెప్పండి’ అని వినయంగా అభ్యర్థించాడు.
‘నాయనా, ప్రహ్లాదా! భూలోకంలోని భరతఖండంలో నైమిశారణ్యం ఉంది. అది తాపసులకు ఆలవాలం. అక్కడ నైమిశతీర్థం ఉంది. భూలోకంలో ఇది ఉత్తమమైనది. పాతాళంలో చక్రతీర్థం, ఆకాశంలో పుష్కరతీర్థం ఉత్తమమైనవి. వీటిలో స్నానం ఆచరించిన వారికి ఇహపరాలలో సుఖసౌఖ్యాలకు లోటు ఉండదు’ అని చెప్పాడు చ్యవనుడు.కొన్నాళ్లు ప్రహ్లాదుడికి అతిథిగా ఉన్న తర్వాత చ్యవనుడు తిరిగి భూలోకానికి వెళ్లిపోయాడు.చ్యవనుడి మాటలతో ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆయన చెప్పిన తీర్థాలను సందర్శించుకోవాలని అనుకున్నాడు.ఒకనాడు సుముహూర్తం చూసుకుని, పరివారంతో సహా ప్రహ్లాదుడు తీర్థయాత్రకు బయలుదేరాడు.మొదటగా నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సరస్వతీ నదిని దర్శించుకున్నాడు. నదీస్నానం చేసి, అక్కడ పితృతర్పణాలు విడిచాడు. అక్కడ ఉన్న పురోహితులకు విరివిగా అనేక దానాలు చేశాడు.
తర్వాత నైమిశారణ్యంలో సంచరిస్తూ, నైమిశ తీర్థంలో స్నానం చేశాడు. స్నానానంతరం వేటకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు మహర్షులు కనిపించారు. వారికి నీడ కల్పిస్తున్న చెట్టు కొమ్మలకు విల్లంబులు వేలాడుతూ కనిపించాయి. ఆ మహర్షులిద్దరూ నరనారాయణులు. ఆ చెట్టుకు వేలాడుతున్న ధనుస్సుల్లో ఒకటి: శారఙ్గం, మరొకటి: అజగవం. వాటికి తోడుగా రెండు అక్షయ తూణీరాలు. శారఙ్గం నారాయణుడి ధనుస్సు, అజగవం నరుడి ధనుస్సు.తాపసుల వద్ద ఆయుధాలను చూసి, ప్రహ్లాదుడు ఆగ్రహం చెందాడు. ‘మీరు కపట సన్యాసుల్లా ఉన్నారు. నిజంగా తపస్సు చేసుకునేవారే అయితే, మీకు ఆయుధాలెందుకు? మీరు ఆయుధాలనే నమ్ముకుంటే యుద్ధం చేయాలి. తపస్సు చేయదలచుకుంటే, ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవాలి’ అని నిలదీశాడు.
యుద్ధానికి కవ్విస్తున్న ప్రహ్లాదుడితో పోరుకు ముందుగా నరుడు సిద్ధమయ్యాడు. తన అజగవం తీసుకుని, అతడిపైకి శర పరంపర కురిపించాడు. ప్రహ్లాదుడు కూడా వెనక్కు తగ్గకుండా యుధ్ధం చేశాడు. వందేళ్లు పోరు సాగింది. ప్రహ్లాదుడి ధాటికి నరుడు ఇబ్బంది పడుతుండటం చూసి, నారాయణుడు తన శారఙ్గాన్ని అందుకుని, యుద్ధంలోకి దిగాడు. మరో వందేళ్లు పోరు జరిగింది. ఎవరికి ఎవరూ తీసిపోలేదు. ప్రహ్లాదుడికి శక్తి సన్నగిల్లసాగింది. ఓటమి అంచుల్లోకి చేరుకున్నాడు.అంతలోనే అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.ప్రహ్లాదుడు విష్ణువు ముందు మోకరిల్లాడు. ‘స్వామీ! ఏ యుద్ధంలోనైనా గెలుపు నాదే! మరి ఇప్పుడేమిటి ఇలా జరిగింది?’ అని దీనంగా ప్రశ్నించాడు.‘వీరు నర నారాయణులు. నా అంశతో పుట్టినవారు. కారణజన్ములు. వీరివంటి తాపసులతో ఎన్నడూ తగవు పెట్టుకోకు’ అని హితవు పలికాడు శ్రీమహావిష్ణువు.ప్రహ్లాదుడు వారి ముందు మోకరిల్లి, క్షమాపణలు చెప్పి, తిరిగి పాతాళానికి వెళ్లిపోయాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment