
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.
‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్‌లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.
తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్‌మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.
ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.
తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్‌లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.
‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.
‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.
‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు.
డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్‌తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు.
ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్‌లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది.
శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.
అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.
అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.
తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment