యువ కథ: మనసు రుచి
వైనతేయ గోదారి ఎర్రగా మారింది. గోదారికి పైన నల్లటి మేఘాలు తప్ప వర్షం లేకపోయినా పై నుంచి పడుతున్న వర్షాలకు కాబోలు రోజు రోజుకి నీరు పోటెత్తుతోంది. బోడసకుర్రు నుంచి పాశర్లపూడికి మధ్య వైనతేయ పాయ పోతూ ఉంటే దాని మీద ఒకటే పంట్ నడుస్తోంది. ఆరోజు అది కూడా రద్దయ్యింది. కారణం పొద్దున వచ్చిన వెంటనే బోడసకుర్రులో సూరన్న కాలం చేశాడు. బోడసకుర్రు రేవు దగ్గర గుమాస్తా ఉద్యోగం సూరన్నది. 70 ఏళ్లు వచ్చినా పని చెయ్యడం మానలేదు. పొద్దున్నే సాధు హోటల్లో రెండు రొట్టెలు ఫట్టు చట్నీ తినడం రేవుకి సైకిలు మీద బయలుదేరడం, టికెట్ కొట్టడం... ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారేమో అని ఫట్టు చట్నీని కాస్త ఎక్కువ చేశాడు సాధు. అప్పుడే తిని వెళ్లిన సూరన్న పోయాడన్న కబురొచ్చింది. సూరన్న పోగానే చుట్టాలకి, పక్కోళ్లకి కుబురు పెట్టాడు పెద్ద కొడుకు లక్ష్మన్న. హైదరాబాదులో ఉంటున్న చిన్న కొడుకు, ఇద్దరు కూతుళ్లు రావాలి. కాలంతో పాటు కదిలిపోయిన కుటుంబాలలో సూరన్న, సూరన్న పెద్ద కొడుకు మాత్రం బోడసకుర్రులోనే ఉండిపోయారు. అందులోను సూరన్నది మరీ చాదస్తం. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ, సాధు టిఫిన్స్ పడాల్సిందే.సూరన్నని బయట పడుకోబెట్టారు. జనాలు ఒక్కొక్కళ్లే పోగయ్యారు. ‘పెద్దాయన కదండీ’ అన్నాడు ముత్యాల వెంకట రత్నం పెద్దోడు లక్ష్మన్నతో. ‘అవునండి మీ వయసే’ అన్నాడు ఏడుస్తూ పెద్దోడు. ‘ఇంతకీ అందరికీ కబురెట్టారా’ అన్నాడు ఊర్లో పెళ్లికి, చావుకి ముందుండి పనులు చూసుకునే యేసునాథం. ‘మహా గొప్ప ఇట్టమండి బాబా.. సూరన్నకి ఫట్టు చట్నీ అంటే’ అన్నాడు అక్కడే ఉన్న సాధు. ‘కాస్త ఆ చట్నీ తీసుకొచ్చి నోట్లో ఏసి చూడు లేచి కూర్చుంటాడేమో’ అన్నాడు యెటకారంగా యేసునాథం. ‘సావు దగ్గర పరాచకాలు ఏంటండీ బాబు’ అన్నాడు పక్కనే ఉన్న ముత్యాల వెంకట రత్నం. ‘మహా గొప్పగా పోయాడయ్యా సూరన్న ..’ అన్నాడు సాధు. ‘మరే.. నీ చట్నీ తిని పోయాడు. తులసి తీర్థంలా పడి ఉంటాది’ అన్నాడు యేసునాథం. సూరన్న బంధు వర్గం పెద్దది. మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ వెళ్లేవాడు. అంచేత ఆయన్ని చూడటానికి కూడా చాలా మంది జనం వచ్చారు. వచ్చినోళ్లందరికీ టిఫినీలు, కాఫీలు చూసుకోమని సాధుకి అప్పచెప్పాడు పెద్దోడు. అంతమంది జనాల్ని చూసిన సాధు ‘ఇంతమందికి రొట్టెలేత్తే రేపు నా పాడే ఎత్తాలి’ అన్నాడు. ‘చావు ఇంట్లో టిఫినీలు పెట్టడమే. శవం లేచే దాకా ఏం తినకూడదు. అందులోను మేము సూరన్న వేలు విడిచిన చుట్టాలాయె’ అంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘మీరు తినద్దు లెండి. యేలు యిడిచిన చుట్టాలు గందా. యిడవనోళ్లు ఉంటారు ఆల్లు తింటారు. అందులోను మా సాధు ఫట్టు చట్నీ అంటే నాకేత్తారు. మీరు తినకపోతే కలిసొత్తాది’ అన్నాడు యేసునాథం. టిఫినీలు పెడతన్నా కూడా సూరన్న పోయాడన్న బాధ మనసులో తొలిచేస్తోంది సాధుకి. అయినా సరే పిల్లా జెల్లా అందరికీ ఇడ్డెనులు వడ్డించేశాడు. ‘డబ్బులు లెక్కట్టుకో మరి’ అని సూరన్న బంధువొకడు అంటే ‘ఇలాటి సోట నాకు లెక్కలు రావు బాబా’ అని నింపాదిగా తన పని చేసుకుంటూ పోయాడు.మొహం ఎర్రబడ్డ సాధుని చూసి ‘పుసుక్కున అనేశాడులేరా. నేను లెంపలేయిత్తాను లే’ అన్నాడు యేసునాథం. సాయంత్రానికి సూరన్న కొడుకు, కూతుళ్లు కన్నీళ్లతో దిగితే .. మనవళ్లు మాత్రం లాప్టాప్లు వేసుకుని దిగారు. తర్వాత రోజు కార్యక్రమాలు. ఈసారి పెద్దోడు చెప్పకుండానే అందరికీ టిఫినీలు తెచ్చేశాడు సాధు– కష్టమైనా దోరగా అందరికీ రొట్టెలు కాల్చి. అలాగే ఇడ్డెనులు కూడా పట్టుకొచ్చేశాడు పెద్ద ఆటోలో. మండువా ఇంట్లో పొద్దు ఎండ పడుతుండగా లాప్టాప్ నొక్కుతున్నాడు సూరన్న రెండో కూతురు రెండో వాడు. సాధు రెండు రొట్టెలు పట్టుకొచ్చి ‘ఈ రెండు తినెయ్యండి’ అన్నాడు. ‘సాధు.. బాగున్నావా’ అని అడిగాడు. ‘చాలా పెద్దోడు అయిపోయేరు. సాలా సిన్నప్పుడు సూసాను’‘చట్నీ ఏం మారలేదు సాధు’ అన్నాడు. చిన్నగా నవ్వి ‘నేను మారలేదులెండి. ఇది యేటి బాబు’ అని అడగ్గానే ‘నేను చేసే పని సాధు. ఇంతకి ఇవ్వాళ హోటల్ వదిలి వచ్చేశావా’ ‘అంతే కదా బాబు. మనిషిని మించిన పనులేముంటాయ్ సెప్పండి. నా సేత అయ్యింది సేద్దామని వచ్చాను సేత్తన్నాను’లాప్టాప్ మూసేసి విస్తరిలో ఇచ్చిన రొట్టెలను మూడు గరిటెల చట్నీతో గబాగబా తిని, పోయి తాత దగ్గర కూర్చున్నాడు. ‘ఆకుని కూడా వదలలేదు. ఏం చట్నీ నో ఏమో’ అని విసుక్కుంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘సూరన్న గారికి కూడా చాలా ఇట్టం అండి సాధు ఫట్టు చట్నీ అంటే. ఊరంతా కూడా ఇట్టం అనుకోండి’ అన్నాడు టీలు ఇస్తూ ఇరటం రాంబాబు. ‘అబ్బో గొప్పే.., నేను చేసిన చట్నీలకు ఈ ఆకులు కూడా మిగలవు’‘అంటే మీరొండినవి కాకుండా ఆకులు తినేత్తారా అండి’ అల్లం వేసిన టీ ఆమెకు అందిస్తూ. ‘మీ ఊరంతా యెటకారమేరా. ఎప్పుడు ఎవరు తిన్నంగా సమాధానం చెప్పరు’‘మా ఊరెంట గోదారి యెళ్తాది అండి. అది కూడా అంతేనండీ తిన్నంగా యెల్లదు’‘ఊరుకోరా ఇరటం పెద్దావిడతో’ అన్నాడు సాధు టిఫినీలు అందిస్తూ. సూరన్న వేలు విడిచిన మేనత్తగారి తోడికోడలు మనవరాలికి ఆకలంటే ఆవిడ సాధుని పిలిచి ‘టిఫిన్స్ ఏం తెచ్చావురా’‘సావు ఇంట టిఫినీలే ..’ అన్నాడు రాంబాబు. ‘నువ్వు ఊరుకోరా. రొట్టెలు అయిపోయాయ్ అమ్మా. ఇడ్డెనులు ఉన్నాయి’ ‘అరే .. నా మనవరాలు ఇడ్డెన్లు తినదే’ ‘మీరు తాపీగా టీ తాగుతూ కూర్చోండి. నే పెట్టేత్తాను’ అని ఒక అరిటాకు కోసుకొచ్చి కడిగి చిన్న ముక్క కింద కోసి వేడి వేడి మూడు ఇడ్డెన్లు వేసి ఫట్టు చట్నీ వేశాడు. మారాం చేస్తున్న పిల్లని బుజ్జగించి ఒక వేలుడు చట్నీని నాకించగానే తింటానంది. చిన్న ఇడ్లీని ఎక్కువ చట్నీలో ముంచి పెడితే మొత్తం కానిచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆవిడ ‘మా సూరన్న చెప్తుంటే ఏదో అనుకున్నాను’ అని అదే అరిటాకులో ఇంకో నాలుగు ఇడ్డెన్లు వేయించుకుని .. ఐదు గరిటెల చట్నీతో ముగించింది.చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం. ‘మహత్యం ఏముంది అండి. నలుగురు మెచ్చేలా ఉండాలనుకుంటాను అంతే’ అన్నాడు సాధు. ‘పెహిడెంటు గారొచ్చేత్తన్నారండోయ్’ అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వార్డ్ మెంబెర్ వరాలి మొగుడు వెంకట్రావ్ . ‘పెహిడెంటు గారే.. ఆయనకు సెంటిమెంట్లు గందా’ అన్నాడు యేసునాథం. ‘ఆయనే కాదండి మాజీ పెహిడెంటు గారు కూడా వచ్చేత్తన్నారు’‘ఒకే ఒరలో రెండేసి కత్తులు .. సూరన్న మీద ప్రేమే’ ‘అంటే ఒక్కోసారి ఎండా వాన ఒకేసారి ఒత్తాయి కదా అండి’ అన్నాడు వరాలి మొగుడు వెంకట్రావ్ .‘మనిసి బతికుండగా ఎవరూ మాట్టాడరండి. పోయాక అదేమంటారు.. సూక్తి వాక్యాలు చెప్తారు ఆయన గురించి’ అన్నాడు సాధు వెంకట్రావ్కి టిఫిన్స్ అందిస్తూ. ‘నేనలా కాదండోయ్ యేసునాథం గారు .. మిమ్మల్ని, సాధుని పలకరిత్తున్నానా. పోయాక మీ గురించి సుత్తి వాక్యాలు చెప్పకుండా ఉంటానా’‘అది సూక్తి .. సుత్తి కాదు వరాలు మొగుడోయ్’ అన్నాడు యేసునాథం. వచ్చిన ప్రెసిడెంట్ గారు వాళ్లు సూరన్న గణాన్ని పరామర్శించి నేరుగా సాధు టిఫిన్లు తీనేసి వెళ్లిపోయారు.ఆ రోజు కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఆ తర్వాతి పది రోజులు సాధు హోటలు నడపడం ఆపై సూరన్న ఇంటికి వచ్చి సాయం చెయ్యడం ఇలా సాగిపోయింది . సూరన్న బంధుగణం సాధు హోటల్ చట్నీ రుచి మరిగారు. రొట్టె ఒకటి ఐదు రూపాయిలు ఎంత తిన్నా తక్కువే. మరి ఇంత తక్కువ రేటా అని ఆశ్చర్యపోయేవారు. అలా అని రూపాయి ఎక్కువ తీసుకునేవాడు కాదు. కొంతమంది హైదరాబాదు వచ్చేసి వ్యాపారం పెట్టుమని ఈ టిఫినీకి బోళ్లు లాభం అని చెప్పేవారు. సాధు చిన్నగా నవ్వి ఊరుకునేవాడు .ఇదంతా గమనిస్తున్న సూరన్న రెండో కూతురి కొడుకు వైకుంఠ సమారాధన అయిపోయిన తర్వాతి రోజు తెల్లారకుండానే సాధు హోటలుకి వెళ్లి కూర్చున్నాడు.‘అప్పుడే వచ్చేశారేటండి. టిఫినీకి చాలా టైమ్ పడతాది’ అన్నాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన సాధు. ‘నువ్వు చట్నీ ఎలా చేస్తావో చూద్దాం అని’ అన్నాడు. ‘కూర్చోండి అయితే’ అని. దేవుడికి దండం పెట్టి లేత కొబ్బరి కాయని తెచ్చి మెత్తగా కోరి పక్కన పెట్టుకున్నాడు. ‘ఫట్టు చట్నీ అంటే ఏంటి సాధు’ ‘ఈ యేలప్పుడు నేను కూర్చుని శ్రద్ధగా చేత్తానండి. ఇది ఎంత చేసినా ఒక్కోసారి ఎనిమిదింటికల్లా అయిపోతాది. అప్పుడు రెండోది చేస్తాను. అదేటో మరి ఫట్టు చట్నీకి ఉన్నంత రుచి రెండో దానికి రాదంటారు. నిజానికి రెండూ ఒకటే’ మాట్లాడుతూనే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలని, కరివేపాకుని, కొత్తిమీరని చెక్కులా తరిగి పక్కన పెట్టుకున్నాడు.‘ఫట్టు చట్నీ అంటే ఫస్ట్ చట్నీ యా’ అనుకుని నవ్వుకున్నాడు తనలో తానే. సాధు కొబ్బరాకు మట్టలు అన్నీ పొయ్యిలోకి పెట్టి మండించి తరిగిన సామాన్లతో పాటు పోపేసి నీళ్లు మరిగించాడు. ఇంక మరుగుతున్న నీళ్లలో శనగపిండి వేసి మరిగాక కొబ్బరి అందులో వేశాడు. అంతే .. వేడిగా కాలిన పెద్ద పెనం మీద పల్చని మినప రొట్టెను వేశాడు.‘సాధూ రొట్టెకి ఐదు రూపాయిలు ఏం మిగుల్తుందయ్యా’ ‘ఏదో మిగులుతుందని ఏదైనా చెయ్యాలి అంటారా. మొన్నటి దాకా 2 రూపాయిలు ఉండేది ..ఊర్లో వాళ్లు కిట్టదని 5 రూపాయిలు చేశారు’‘కొనేవాళ్లు పెంచారన్నమాట. రేపు సరుకుల రేట్లు అవీ ఇంకా పెరిగితే’ఇదిగోండి అని వేడి రొట్టెని చట్నీకి కలిపి ఇచ్చి ‘ఈ రోజు ఉండగా రేపటి గురించి ఎందుకు బాబా! అయిపోయిన నిన్నటి గురించి ఎందుకయ్యా! నచ్చిన పనిని నచ్చిన మనషుల మధ్య ఇట్టంగా చేస్తూ పోతే చాలదా’ అన్నాడు. చట్నీ అదే రుచి. ఆనందంతో డబ్బులు ఎక్కువ ఇస్తుంటే ‘కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడు, అత్యాశ లేని జీవితం, నవ్వుతూ మాట్టాడే మనుషులు .. మాకు ఇవి చాలండి. అందులోను నాకు లెక్కలు రావండి’ అన్నాడు డబ్బులు తీసుకోకుండా. ఆ తర్వాత ఆ కుర్రాడు హైదరాబాద్ వచ్చి సాధు ఎలా చేశాడో అలానే చేస్తే దాని రుచి పడలేదు. నోట్లో వేసి ఊసేశాడు. సాధు ఫట్టు చట్నీ రుచి ఏ చీకు చింతా లేకుండా ఇష్టంగా చేసే సాధు చేతిది.. దానిలో పడ్డ సామాల్ది కాదు. చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం.