యువ కథ: కావడి | yuva katha magazine storie | Sakshi
Sakshi News home page

యువ కథ: కావడి

Published Sun, Dec 15 2024 11:58 AM | Last Updated on Sun, Dec 15 2024 12:41 PM

yuva katha magazine storie

ఆడిమాసం పెట్టినాది. ఇది చిత్తూరు జిల్లాకే యిశేషం. యీ మాసంలోనే మురగడుకి వూరంతా కలిసి కావడి ఎత్తుతారు. రెండు మూడు దినాల పండగిది. పయనిగాడు కాలేజీ నుంచి వస్తా ‘పల్లె సింగారించుకుందో లేదో? వాళ్ళమ్మ వాకిలి కడిగిందో లేదో? నాయన నాన్నారం పోయి సరుకులు తెచ్చాడో లేదో?’ అని యోసన చేస్తూన్నాడు. వచ్చీరాగానే ‘రేయ్‌.. పయనిగా రేపు మర్శటి దినం ఆడి కిర్తిక కదా! రామగిరి మురగడుకి గుండు కొట్టి రా..  పన్నెండో తర్గతి పాసయ్యిపూడస్తావు’ అన్నాడు నాయన. ‘నాయనా అక్కడేముండాది? మనూరోళ్ళతో కల్సి తిర్తినికి పోతా’ మనస్సులో యింకేదో దాస్తూ.‘రామగిరి మురగడు గుళ్ళో నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి. కార్వేటినగరం గుడి కోనేటిలో నీళ్ళు అన్ని వైపులా సమానంగా ఉంటాయి. అందుకే దాన్ని స్కంద పుష్కరిణి అంటారు. అంతేగాదబ్బాయా.. ఆ కోనేరు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి కోనేరు తెల్సునా?’ 

‘అవునా! ఇదంతా నీ కాడ కొత్తగా యింటున్నా’ అని నోరెళ్ళబెట్టాడు పయని.‘నిజిమేరా! నువ్వు పుడితే నీకు పయని మురగడు దగ్గిర గుండు కొట్టిస్తామని మొక్కుకున్నాం. పయనికి పోయే బయిసు లేదు. కనీసం రామగిరి కన్నా పోయి మొక్కు చెల్లించుకురారా’ అన్నాడు దిగులు పడుతూ పయని నాయన. ‘నేనొంటరిగా యట్ల పోయేది? నేను పోనుబో’ అని మొండికేసినాడు.‘నా మాటిను అబ్బాయా.. మొక్కొని పోకపోతే మనకు చేటు జరగతాది.. నీ యిష్టం మళ్ళా..’ అని భయపెడుతున్నాడు పయని నాయన.‘నిజింగానే మురగడు చేటు చేస్తాడా? అయితే పోతాలే! కానీ వొగ కండిషన్‌.. రాణి అత్తోల్లతోనే పోతా..’‘వాళ్ళు పోయేది తిర్తినికి కదరా?’‘అవును. నేను కూడా తిర్తినికే పోతా. అక్కడ వుండేది కూడా మురగడే కదా!’ అన్నాడు పయని. ‘సరే! పొయిరాపోరా అతి నాకొడకా. కానీ గుండు కొట్టించుకొని రా.. కొట్టకపోతే మురగడే కొట్టిస్తాడు సూస్కో’ అని ఆర్డరు వేశాడు పయని నాయన.

‘పన్నెండు పాసుకాక మునుపే గుండెందుకు కొట్టించాలి? సరే అత్త కూతురు జయలచ్చిమితో పోవాలంటే సరేని జెప్పాలి కాబట్టి ఊ.. కొడదాం’ అని గంగెద్ది మాదిరి తలూపాడు పయని.∙∙ భరణి కిర్తిక దినం పొద్దు మొల్సినాది.  అత్తిల్లు చేరినాడు పయని. ‘మురగడుకి యిట్టమైన ఎరిక్కా పూలు (జిల్లేడు పూలు, పాల పూలు) కావాల’ అన్నది రాణత్త. ‘వొకే నిమిషంలో అటు పోయి యిటు వచ్చేస్తా’ అని వుసారుగా వురకపోయాడు పయని. ‘రేయ్‌.. ఆగురా! జయలచ్చిమిని కూడా తీస్కుబో’ అనింది రాణత్త. లచ్చిమి పయని ఇద్దరు కల్సి జోడేసుకొని పాల సెట్టుకాడికి యలబారినారు. ఒక్కోపువ్వే కోస్తూ లచ్చిమి పైనున్న పేమని ఎలాగైనా తెలియజెప్పాలి అనుకున్నాడు పయని. ‘ఎరిక్కా పువ్వా.. ఎరిక్కా పువ్వా.. నువ్వు నాకిస్టమే ఎరిక్కా పువ్వా.. నేను నీకిస్టమా ఎరిక్కాపువ్వా’ అని పాటందుకున్నాడు పయని. ‘పాల మొగ్గా.. పాల మొగ్గా.. పువ్వు ముదరాల పాల మొగ్గా.. వేచుంటావా పాల మొగ్గా.. వేచి సుస్తా పాల మొగ్గా’ అని పయని పాటకు ఎదురు పాట విసిరింది లచ్చిమి. ఖాళీ కడుపులోకి పాయసం పోసినట్టు కుశాలు పడి అరమైలు దూరం యట్టబోయిందో తెలీకుండా గిల్లుకుంటూ గిచ్చుకుంటూ కొంపకొచ్చారిద్దరు. 

ఎరిక్కా మాల కట్టారు. వొగరికొకరు మెడల దగ్గిర ఎరిక్కా మాలను పెట్టి చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అబ్బుటికే సూరీడు నడుచ్చికెక్కాడు. వంటకాలు వొక్కోయింటి సుట్టూరం గుమగుమ లాడుతున్నాయి. రాతిరికి వడలు, పులుసన్నం పొట్లాలు చుట్టుకున్నారు. ఒక్కోకింట్లో వొక్కోబ్బుడు నడింట్లో ఆకేసి ‘హరోం హర.. హరోం హర’ అని మొక్కిన శబ్దాలు వినిపిస్తున్నాయి. కావిడెత్తని కిరుస్తూ యిళ్ళకు, హిందూ యిళ్ళకు కావిడెత్తే యిళ్ళు సిన్న పిల్లలతో గుండు గిన్నెల్లో అన్నాలు పంచుతున్నారు. తలనిండా వెండెంటికల పెద్ద మనుషులు, రెండు మూడు బంగారెంటికల నడి మనుషులు కలుసుకొని వూరి తలారితో మిద్దింగు మురగయ్యను, ఆచారి కిష్టయ్యను పిలిపించారు. పసి పిల్లలు చొక్కా నిక్కర్లేసుకొని బొమ్మల కోసరం పోతుంటే, పయని యీడోల్లు లచ్చిమి యీడున్న పడుసు పిల్లల కోసం పోతున్నారు. కావిడెత్తే వాళ్ళు పసుపు బనీను, పసుపు పంచితోంటే కావిడెత్తనోళ్ళు కొత్త బట్టలతో వున్నారు. 
మిద్దింగు మురగయ్య దొంకలబడ్డ బనీనుతో డమరు వాయిస్తుంటే ఆచారి కిష్టయ్య నిగనిగలాడే తెల్ల చొక్కాయితో పాటలందుకున్నాడు. పిల్లలు డాన్సులేస్తున్నారు. అందరూ నెత్తిలో రైలు పట్టాలు మాదిరి మూడు యిబూది పట్టలు, దానిపైన చందనం కుంకుమాలద్ది భత్తి పరవశంతో ఉన్నారు. కావిడెత్తే వాళ్ళు మెడలో పూలమాలతో, కావడికి పసుపు కుంకుమలు పెట్టి, బంతి పూలు, చామంచి పూలు, ఎరిక్కా మాలలు చుట్టి గలగలా గంటలూపుతున్నారు. వీధంతా పట్టరాని జనాలతో కిక్కిరిసిపోతున్నాది. గ్రామ దేవత గెంగమ్మకు పూజలు జేసి, వూరిడిచి పుత్తూరు రైల్వే టేషనుకు పూడ్సినారు. 

ఆరు గంటలకు గరుడాద్రి రైలు బండి పట్టాలకొచ్చింది. ఒక నిమిషానికే ఈగల మాదిరి గుంపుగా రైలెక్కినారు. ‘బోయ్‌’ మని హారన్‌ కొడుతా బయల్దేరింది రైలు. సమోసాలు, చాయ్, వేంపుడు చెనిక్కాయలు, యల్లరికాయలు ( కీర దోస కాయ) అమ్మేవాళ్ళొస్తున్నారు. ‘పయనిగా ఏమైనా తీస్కోరా. తిందాం’ అని రాణత్త అడిగితే, ‘వొద్దు అత్తా. యిదంతా తినకూడదు. దుడ్లు వేస్టు’ అన్నాడు పయని. తలకొట్టుకున్నారు వూరోళ్ళు పయని పిసినారితనం జూసి.చూస్తుండగానే తిర్తిని వచ్చినాది. రైలు కిటికీల నుంచి ధగ ధగ యలిగిపోతున్న తిర్తిని కొండని జూసి ‘హరోం హర హరోం హర’ మంటూ అరుస్తూ దిగినారు. రాతిరి పడుకునేకి దుప్పట్లు ఎత్తుకొని ప్లాటుఫారం పైన జాగాలు వెతుక్కొని బుక్‌ చేసుకున్నారు. పయనిగాడు ఉసారుగా ముందుగానే బుక్‌చేసి పెట్టాడు. ఊరు వూరంతా కల్సి నెలవంక సుట్టూరా కూర్చున్నట్టు తిండి సుట్టూరా కూర్చున్నారు. అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు వొగరికొకరు పంచుకుంటున్నారు. జయలచ్చిమి పులుసన్నాన్ని వుండగా జేసి పయనికి పెట్టింది. 

ముసిముసి నవ్వులు నవ్వతాండాది రాణత్త. ముచ్చట్లు, కబుర్లు చెప్పుకుంటూ తిన్న తర్వాత కొంతమంది పక్కనేవున్న కమలా సిన్మా కోటాయికి ఫస్టు షో, సెకండ్‌ షో కోసం పూడ్సినారు. మరికొంత మంది రోడ్లెంబడి షికారుకు పోయినారు. ఇంకొందరు ముచ్చట్లు పెట్టుకొంటుంటే, పిల్లలంతా వచ్చి పోయే రైలు బండ్ల బోగీలను లెక్కిస్తా కూర్చున్నారు. అంతలోకి ‘అయ్యో యమ్మా.. నా సంచిని రైలులోనే వదిలేశాను’ అని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తాండాది నడీడున్న వల్లెమ్మ. 

అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.  ‘యామంటున్నావే పాపిస్టిదాన. సంచిని వదిలేశావ? యాముంది అందులో? అంత మతిమరుపు యాందిమే నీకు’ అని రాణత్త కోపంగా అరుస్తున్నాది. ‘అయ్యో! అక్కా కావాలని చేస్తానా? ఆ సంచిలోనే మురగడుకి వుండీలో వేస్తానని మొక్కున్న బంగారు వేలు, వెండి శూలం, సెల్లు ఫోను, దుడ్లు, బట్టలన్నీ వున్నాయక్కా, యింక నా బిడ్డల గతేంది, మా ఆయనకాడ నేనెట్ల బతికి బట్టకట్టేది నాయనా’ అని గుండెలు బాదుకుంటాంది. ‘మనం దిగిన రైలు బండి మద్రాసు చేరుంటాది. యింకో రైలెక్కి మద్రాసు సెంట్రలుకు పోతే సంచి దొరకొచ్చు. నేను పోయి సూస్తా’ అని యనక బండెక్కి పోయినాడు పయని. 

ఊరంత కళ్ళలో వత్తులేసుకొని పయని కోసరం ఎదురుచూస్తాన్నాది. మద్రాసు నుంచి వచ్చే రైళ్లు చానా తిర్తినిలో ఆగి మరలా తిర్పితి వైపుగా పోతున్నాయి. కానీ పయని మాత్రం ఏ రైలు నుంచి దిగలేదు. జయలచ్చిమి ‘సంచి లేకున్నా సరే, పయని జాగిర్తగా తిరిగొస్తే చాలు’ అనుకుంటూ దిగులుగా సూస్తున్నాది. తమ్ముడు కొడుకు యామైనాడో? యప్పుడొస్తాడోని కూతురికి తోడుగా కూర్చుంది రాణత్త. 
రాతిరి రెండు గంటలప్పుడు.. పయనిగాడు సంచిని తెచ్చాడు. వల్లెమ్మ కంటిలో కన్నీటి పొర కమ్ముకున్నాది. పయనికి చేతులెత్తి మొక్కినాది. రాణత్త, లచ్చిమి పయనిగాన్ని సూసి వూపిరి పిల్చుకున్నారు. 

‘పయనిగాడు మొనగాడురా’ అని ఊరంతా పొగడాతంటే లచ్చిమి మన్సు పొంగిపోతాండాది. అందరూ నిమ్మళంగా పొనుకున్నారు. పయని.. లచ్చిమిని సూస్తా కూసున్నాడు. వచ్చిన కస్టం చాలదని ఒక మనిషి  ముఖానికి మాస్క్‌ పెట్టుకొని నైసుగా రాణత్త పక్కన కూసున్నాడు. మెల్లగా కాళ్ళకున్న గొలుసును యిప్పుతున్నాడు. పయని పొనుకున్నట్టే పొనుకొని గబుక్కున లేసి దొంగను పట్టుకుని రైలు పోలీసులకు అప్పగించాడు. ‘వెరీ గుడ్‌. వి సెల్యూట్‌ టు యువర్‌ బ్రేవరీ’ అన్నారు పోలీసులు. జయలచ్చిమి, రాణత్త, వూరోళ్ళ ముందు  యీరో అయిపూడ్సినాడు పయని.
∙∙ 
 ఆడి కిర్తిక దినం పొద్దు మొల్సినాది. నాలుగున్నరకి టేషను కమ్మీలకు తగిలించున్న కావల్లకి యదురుంగా కర్పూరం అంటించి ‘హరోం హర.. హరోం హర ’ అని మూడు తూర్లు అరిసి, కర్పూరం సుట్టూ వూగించి భుజాలకెత్తుకున్నారు. కోనేటిలో తానం చేసి, కావల్లను కడిగి కొత్త పూలను చుట్టి, యిబూదితో అడ్డం బొట్లు గీసుకొని, టెంకాయలు కొట్టి, కర్పూరం యలిగించి మళ్ళా మూడు సూర్లు ‘హరోం హర’లు సెప్పి కొండెక్కారు. కొండపైన గుండు కొట్టుకునే వాళ్ళు కొట్టుకున్నారు.‘సార్‌ తమరికి నాయన సెప్పింది గుర్తులేదా?’ అంది జయలచ్చిమి. ‘గుర్తుంది. కానీ పాసయితే కొడుదాంలె. ఇప్పుడెందుకు’ అన్నాడు పయని. ‘మొక్కొని గుండు కొట్టకపోతే మురగడే నీకు కొట్టిస్తాడాగు’ అంది జయలచ్చిమి. ‘సూస్కుందాంలె. యాదైతే అదయితాద’న్నాడు ధీమాగా! 

ఎవరికి కావల్సింది వాళ్ళు కోరుకుంటూ దేముడికి దండం పెట్టుకున్నారంతా. అగ్గి గుండంలో కర్పూరం, టెంకాయలు వేసి మొక్కులు చెల్లించుకొని ఒక్కచోటుకు చేరారు. అందరొచ్చారో లేదో లెక్కపెట్టుకుని, దారెంట ఉన్న అంగళ్ళను సూసుకుంటా కొండ దిగడం మొదలుపెట్టారు. ఎవరికి కావల్సింది వాళ్ళు, యాడ సలీసుగుంటే ఆడ కొనుక్కుంటున్నారు. పయని మాత్రం తన దగ్గరున్న యాభై రూపాయల నోటును యాభై లచ్చల సూర్లు ఆ నోటుందో లేదో అని తడుముకుంటూ వున్నాడు. 

బ్లేడుతో చేతులను కోసుకుంటా రక్తాన్ని పసిపాపల పైన పోస్తా జాటీలతో కొట్టుకుంటా ‘రుయ్‌.. రుయ్‌’ మని భార్య దరువేస్తే చేతులు చాచి దుడ్లు అడుక్కుంటూ కొందరు.. దారాల పైన నడుస్తూ కోతులతో మ్యాజిక్కులు, సర్కసులు చేస్తా మరికొందరు.. భత్తి పేరుతో ఎండిన డొక్కలకి కొంకీలు గుచ్చుకుని బిచ్చమెత్తుకుంటూ బిడ్డలకు బరువైన ముసలోళ్ళు.. ‘దేముడు దగ్గిరే వున్న వాళ్ళని దేముడెందుకు కాపాడలేకపోతున్నాడు? జానెడు కడుపు కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని పనులు, ఎన్ని బాధలు? చేతి కోతలు ఆరొచ్చేమో కానీ కడుపు కోతలు? కళ్ళు చెమర్చి ఏమీ చెయ్యలేక గమ్మున వెళుతున్నాడు పయని. బాగా బలిసినోళ్ళు ఖద్దరు బట్టలేసుకుని పుణ్యం కోసం ‘అన్నదానం.. రాండి.. రాండి’ అని అరుస్తుంటే బక్క జీవులంతా దేముడు ప్రసాదం దొరకడమే అదృష్టం అనుకుని తినొస్తున్నారు. 
ఎండ నడినెత్తికెక్కినాది. 

రైల్వే టేషనుకు పోయే దోవలో ‘మోర్‌ మజ్జిగ.. మోర్‌ మజ్జిగ’ అని పిలుస్తుంటే పయని వెళ్ళాడు. కొత్తి మీర, పచ్చి మిరప వేసిన పాల పెరుగు వాసన నోరూరిస్తుండగా గబ గబ తీసుకొని గుట గుట రెండు గిలాసులు తాగినాడు. మూడో గిలాసు కూడా తీసుకుని తాగబోతుండగా.. ‘బాబు వొగ గ్లాసు మోర్‌ యిరవై ఐదు రూపాయలు అయినాది’ అన్నాడు. గబుక్కున ఆ గిలాసును పక్కన పెట్టేస్తూ ‘యొవ్‌ ముందే సెప్పాలి కాదుయా? పిలిచి పుణ్యం కోసం దానం చేస్తున్నావని తాగాను’ అన్నాడు అమాయకంగా పయని. ‘హా.. రమ్మంటారు నిన్ను. మూస్కొని దుడ్లు యిచ్చి పో’ అన్నాడు. చేసేదేమి లేక తన దగ్గిరున్న యాభై రూపాయలనిచ్చాడు. ఊరోళ్ళందరూ నవ్వినారు. యిరో జీరో అయిపూడ్సినాడు. యంటికలుండగానే గుండు కొట్టిన మాదిరి అయిపూడ్సినాది యవ్వారం. నాయన మాటలు గుర్తొచ్చినయ్‌ పయనికి. మురగడు మామూలోడు కాదనుకున్నాడు. మారు మాట్లాడకుండా అత్తబెట్టిన చార్జితో రైలెక్కి యిల్లు చేరాడు.

పొంగలి పెట్టి నడింట్లో వేసి మొక్కుకున్నారు. తిర్తిని నుంచి తెచ్చిన బొరుగులు, హల్వా, పొంగలి, బేరికాయలు పందేరాలు మొదలైనాయి. జయలచ్చిమి కూడా ఫలాలు, పొంగలి, బేరికాయలు, బొరుగులు తీసుకుని పయని యింటికి వచ్చినాది. ‘హలో సార్‌.. అన్నీ టయాలు వొగిటి గావు. యిదిగో నీకోసం వాచ్‌’ అని చేతిలో పెట్టి ముదిగారంగా బుగ్గలు గుద్దేసి దూడ పిల్ల మాదిరి ఎగురుకుంటూ యల్లిపూడ్సినాది. ఒక పక్కగా జత కట్టిన పయని తాత పాత కావడి బుట్టీలు నవ్వుతూ నిలబడినాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement