జయరాం, తనకు కాబోయే అల్లుడు ప్రవీణ్ పక్కనే నిలబడి మాట్లాడతా వుండాడు.‘రేయ్ చిన్నోడా, ఇప్పుడేలరా ఈ పెండ్లిసూపులు. ఒకేసారి లగ్నపత్రిక రాయించుకోని ఒచ్చేద్దామంటే ఇనవు’ ప్రవీణ్ నవ్వతా ‘నా కోసరం గాదు. నీ ముద్దుల కూతురు ఉంది కదా, ఆయమ్మ ఆగిత్యమే’ అన్నాడు. ‘చిన్నప్పట్నించి అనుకున్న సంబంధానికి మళ్లీ పెళ్లిచూపులేంట్రా. ఏంటో ఈకాలం పిల్లలు’ అన్నాడు.
దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటోంది శిరీష. ప్రవీణ్ మాటలకి కోపమొచ్చేసింది ఆమెకు. కానీ అది సమయం సందర్భం కాదని ఏం మాట్లాడకుండా గమ్మునే ఉండిపోయింది.
అరగంటలో పెండ్లిచూపుల కార్యక్రమం అంతా అయింది. వచ్చే మంగళవారం లగ్నపత్రిక రాయించుకొద్దాం అని రెండు కుటుంబాలు అనుకునేశాయి. ఇద్దరూ ఉండేది అదే ఊళ్లో. జరగాలి కాబట్టి జరిపించినట్టుగా ఉంది తంతు.‘ఎల్దాం పదండి’ అంటా అమ్మాయి తరుపువాళ్లు బయల్దేరతా ఉంటే శిరీష ‘మీరు బొండి, నాకు పవిగాడితో కాస్త పాతబాకీల ముచ్చట ఉంది. తేల్చుకొనొస్తా’ అనింది. శిరీషకు ఎప్పుడూ ఎవురూ అడ్డు జెప్పింది లేదు. అట్లే కానియ్యమని బయల్దేరి పోయినారు. ప్రవీణ్ మిద్దె మీద ఎండబెట్టిన మిరక్కాయలని గోతాంలో ఏస్తాన్నాడు. వానొస్తాదని నమ్మకమొచ్చేలా ఇంకోసారి ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినపడింది. ఎండ కూడా తన పెగ్గి తగ్గించుకుంటాంది.
‘అత్తా.. పవీ ఏడా’ అనడిగింది శిరీష నవ్వతా. అత్త కూడా నవ్వతా పైకి చూపెట్టింది. మూటగట్టిన మిరక్కాయల గోతాంని లోపలికేసి కిందకు దిగిన ప్రవీణ్ చెయ్యి కడుక్కుని తుడుచుకుందామని అట్టా ఇట్టా చూశ్నాడు. శిరీష అగుపడ్నాది. దగ్గరకెళ్ళి చీర కొంగు బట్కోని తుడుసుకోబోయినాడు, శిరీష వెంటనే వెనక్కి జరిగి – ‘రేయ్.. కొత్త చీరరా’ అనింది. ప్రవీణ్ రెండు చేతులూ ఏసేసరికి చేతుల తడి నడుముకు తగిలింది. శిరీష వెంటనే ప్రవీణ్‌ను ఎనక్కి తోసేసి, ‘మండుతాది వాయ్’ అనింది కోపంగా. ‘లాస్టు మూడు నెలలుగా నాకు మండినట్టా?’ అనేసి బాల్కనీ వైపుగా నడిచి అక్కడ అలానే కింద కూర్చుండిపోయినాడు. ‘అబ్బా .. మళ్ళీ మొదలు పెట్నావా?’ అంటూ పక్కనే ఒచ్చి కూర్చొనింది శిరీష.
ప్రవీణ్ తలవంచుకున్నాడు. వోని గెడ్డం పట్టుకొని పైకి లేపింది. వోని కండ్లు ఎర్రగా నరాలు తేలేసి ఉన్నాయ్. ‘దీనికి ఎందుకురా పవీ ఏడవడం? ఏమన్నా అంటే ఇట్టా ఆడపిల్లలా ఏడుస్తావ్..’ అనేసి కండ్లు తుడిచింది శిరీష. ‘ఏం, ఆడపిండ్లోల్లే ఏడసాల్నా? మొగపిండ్లోల్లు యాడ్సకూడదు అని యాడైనా రాసుండాదా ఏం..?’ అన్నాడు ప్రవీణ్ కండ్లు తుడుసుకుంటా. శిరీష నవ్వి ‘సర్లే , మళ్ళీ ఏడుద్దువులే గానీ, ఈ మూడు నెలలు ఎట్లున్నావ్‌రా నాతో మాట్లాడకుండా, నన్ను సూడకుండా?’ అనింది. ‘అదేమంత కష్టం కాదులేమే, నువ్వే మళ్లీ పలకరిస్తావ్ అని నాకు దెల్సు. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నా’ అన్నాడు ప్రవీణ్. ‘ఉద్యోగం మానేశ్నావంట ? ఏంది కత?’ ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
‘అక్కడ టౌన్లో ఉండబుద్ధి గాట్లేదు మే. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉద్యోగం నావల్ల కాదు ఇంక. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడనియ్. అప్పటిదాకా నువ్వున్నావ్‌గా, ఏం చూస్కోవా నన్ను?’ ‘నేను చూసుకుంటాలే గానీ, ఈలోపు నీ చేయి కంట్రోల్‌లో లేకుంటే ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా.’‘మరెట్టాగే? ఇంకెన్నాళ్ళు ఇట్టా దూరంగా ఉండాల నీతో?’‘రేయ్ తిక్క సన్నాసీ.. వయసు శానా ఆట్లే ఆడమంటాది. కొన్నిదినాలు ఆగు, పెండ్లైపోనీ’అని గట్టిగా ఒక ముద్దిచ్చి ఆడ నుంచి ఇంటికి బోయింది శిరీష.మూడు నెలల క్రితం శిరీష ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఏకాంతం చూసి చనువు చూపించబోయాడు.
లాగిపెట్టి కొట్టింది. పద్ధతి ప్రకారం ఉండకపోతే పెళ్లీగిళ్లీ జాన్తానై అంది. ‘అసలు మూడు నెలలు కనపడకుండా వినపడకుండా నిష్టగా ఉంటేనే పెళ్లి’ అంది. ఆ మాటను అంత పట్టింపుతో అనకపోయినా ప్రవీణ్ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇద్దరి వైఖరిలో మార్పు గమనించి పెద్దవాళ్లు ఇది ఎటుపోయి ఎటొస్తుందోనని పెళ్లికి వేగం తెచ్చారు. అది కూడా జనం కోసం జరిపించాల్సిన ఒక తంతే. ప్రవీణ్, శిరీష మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలు. ఆ రేతిరి మిద్దె మీద చాప ఏస్కొని అటూ ఇటూ దొర్లుతున్నాడు ప్రవీణ్. నిద్ర పట్టక కింద వీధిలో కొచ్చి సిగరెట్ వెలిగించినాడు. శిరీష గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మొబైల్ చూస్కున్నాడు.
గీత నుంచి మళ్ళీ మెసేజ్– ‘మేల్కొనే ఉన్నావా?’ అని. దాన్ని పట్టించుకోకుండా ‘డార్లింగ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు.
నిద్ర మత్తులో ఫోన్ ఎత్తినాది శిరీష. ‘ఏంది పవీ ఈ టైములో ఫోను’ ‘నిద్రపట్టట్లే మే’ ‘పడుకుంటే అదే వస్తాదిలే. పడుకో పవీ’ అంటూ ఫోన్ పెట్టేశ్నాది శిరీష. ఇంతలో గీత నుంచి మళ్ళీ మేసేజ్– ‘పడుకునేశ్నావా’ అని. ‘లేదు’ వెంటనే ఫోన్ రింగయ్యింది. గీత నుంచి ఫోన్.‘హలో’ అన్నాడు ప్రవీణ్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘ఏం జెయ్యట్లా. నిద్రపట్టకపోతే అలా బయటకొచ్చినా’ ‘బయటికి అంటే మీ ఇంటి ముందుకా ?’‘అవును. అయినా యాడైతే నీకు తేడా ఏముందే, నువ్వుండేది బెంగుళూరులో గదా’‘రామాలయం వీధి వైపు నడుస్తున్నావా?’‘అవును. అంత కరెక్టుగా ఎట్టా జెప్పినావ్?’
‘ఇంకొంచెం ముందుకి నడువు అలాగే’ అట్టాగే ముందుకి పోయిన ప్రవీణ్‌కి ఎదురుగా చెయ్యి ఊపుతూ ఎవరో కనబడ్డారు. ఈ టైంలో ఎవరా అని చూస్తే గీత! ‘ఒసేయ్, నువ్వేందే ఈడ ? బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినావ్?’ అన్నాడు. ‘సాయంత్రం ఒచ్చినాన్లే గానీ, దా ఇక్కడ చలిగా ఉంది లోపలికెళ్దాం.’ ‘ఈ టైంలో ఎందుకులేమే, తెల్లార్నంక మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రవీణ్. ‘అబ్బా, ఏంగాదు రా ప్రవీణ్’ అంటూ బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది గీత. ప్రవీణ్ ఇల్లంతా చూస్తూంటే ‘ఎవరూ లేరు. అందురూ పెండ్లికి ఎలబారిపోయినారు. నువ్వూ నేనే ఉండాం’ అనేసి సోఫాలో కూర్చునింది. బయట వర్షం మొదలైంది. మెల్లగా ఊపందుకుంది. ‘ఈ రేతిరికి వాన ఇంకా గెట్టిగా పడేట్టుగా ఉండాది మేయ్. ఇంకా పెరిగే లోపు నేను ఇంటికెళ్ళిపోతా’ అన్నాడు ప్రవీణ్.
‘సర్లే ఎల్దువులే గానీ, కాసేపు ఉండు ప్రవీణ్’ అనింది. ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకునింది. ప్రవీణ్ గుండె వేగం ఆ పిల్లకి కూడా తెలుస్తాంది.‘నువ్వంటే చిన్నప్పట్నుంచీ ఇష్టంరా ప్రవీణ్. కానీ నీకేమో ఆ శిరీష అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ జెప్పలా నీకు. కానీ నువ్వు కావాలి’ గీత కండ్లు మూసుకునింది. మొహాన్ని మొహానికి దగ్గిరగా తెచ్చాడు ప్రవీణ్. పెదాల మీద ముద్దు పెడతాడు అనుకునింది. అయితే ప్రవీణ్ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ‘ఇట్టా చేయడం తప్పు మేయ్’అన్నాడు. వెంటనే కండ్లు తెరిచేశ్నాది గీత.
‘నా శిరీషకు నేను అన్యాయం చేయలేను. ఈ వయసులో మనందరికీ ఒకేలా ఉంటుంది. అదే మాట శిరీషతో అంటే– ఉంటుంది. నాకూ ఉంటుంది. కాని ఆగాలి కదా అని ఆగడం నేర్పింది. నీకూ అదే మాట చెప్తున్నా. వయసు ఆడించినట్టు మనం ఆడకూడదు’ అనేసి పైకి లేచాడు.
‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా
ఏం కాలేదు అంటావ్.
అంతేనా ?’
అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.
గీత ఏం మాట్లాడకుండా నిలబడింది. కండ్లు తుడుచుకొని, ‘నాదే తప్పు. మీ మధ్య దూరుండకూడదు. పెండ్లెప్పుడు అనుకుంటా ఉండారు?’ అనడిగింది.‘రెండు నెలల్లో. కానీ అంత దూరం మంచిది కాదనిపిస్తాంది’ అంటూ నవ్వినాడు ప్రవీణ్. గీత కూడా నవ్వింది. ‘సరే మేయ్ నేను పోతా’ అనేసి వానలోనే తడ్సుకుంటా ఇంటికి పోయి మిద్దె మీదకెల్నాడు ప్రవీణ్. అక్కడ చాప, దిండు రెండూ తడిసి ముద్దయిపోయున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే శిరీష వొచ్చినాది. ఆరేసున్న బొంత, చాప, ఎండబెట్టిన దిండు అన్నిటినీ చూస్తూ నిలబడింది. ‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.
‘ఇది. ఈ కంట్రోల్ ఉండాల్ననేరా మూడు నెలలు నన్ను కల్సొద్దు అని కండిషన్ బెట్టి కూర్సోబెట్టింది. కానీ నిన్ను నమ్మినా, ఈ వయసును నేను నమ్మలేను పవీ’ అంది. ‘మరేం చేద్దాం?’ అన్నాడు ప్రవీణ్. వారం తర్వాత ప్రవీణ్, శిరీషల పెండ్లి ఘనంగా జరిగింది.
ఆ రేతిరి, దాదాపు ఒంటిగంట ప్రాంతంలో.. ‘ఏంది పవీ, ఇంకా ఒంటి గంట కూడా కాలేదు. అప్పుడే పడుకుంటే ఎట్టా?’‘అట్టా కాదు లెమ్మే, నాకు నిద్దొరస్తాంది’ అన్నాడు ప్రవీణ్. శిరీష నవ్వతా అనింది ‘నాకు రాట్లేదు’
Comments
Please login to add a commentAdd a comment