యువ కథ: కనురెప్పలే సాక్షిగా | Yuva Katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: కనురెప్పలే సాక్షిగా

Published Sun, Mar 16 2025 8:11 AM | Last Updated on Sun, Mar 16 2025 8:11 AM

Yuva Katha magazine stories

తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్‌ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్‌. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్‌ను పొజిషన్‌లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు.

 ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్‌ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.

ఫైవ్‌ హిల్స్‌ ప్యాలస్‌ హోటల్‌ ..
నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్‌ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్‌ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్‌ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్‌ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్‌కి సైగ చేశాడు అర్జున్‌. వారు తమతో పాటుగా స్నిఫర్‌ డాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.

తక్షణమే అర్జున్‌ అతని టీమ్‌ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్‌ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్‌ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్‌ను కలవరపరిచింది. వెంటనే హోటల్‌ లోపలకు పరుగు తీశాడు. అర్జున్‌ టీమ్‌ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్‌ వాళ్లు స్నిఫర్‌ డాగ్స్‌తో హోటల్‌ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. 

అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్‌లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్‌ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్‌లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్‌ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్‌ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.

అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్‌ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్‌ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్‌ను పొజిషన్‌లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్‌ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. 

ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్‌ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47  రైఫిల్‌ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్‌ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.

అర్జున్‌ గాలిలోకి డైవ్‌ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్‌ రైఫిల్‌ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్‌ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్‌ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్‌. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్‌ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్‌.

 కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి  కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్‌.. నేను మీ గులాం.. నసీర్‌ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్‌.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్‌ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్‌ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్‌కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.

రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఆఫీస్‌..
మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్‌ మినిస్టర్‌ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్‌ మినిస్టర్‌ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్‌ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్‌ హిల్స్‌ ప్యాలస్‌ హోటల్‌ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్‌ .. నాకు రెండుగంటలు  టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్‌ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్‌లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్‌ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.
అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్‌ చేశాడు. పేపర్‌ వెయిట్‌ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్‌ వెయిట్‌ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్‌ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్‌ వెయిట్‌ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్‌ సేవర్‌ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్‌! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్‌ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.

‘కమాన్‌ .. అర్జున్‌ కమాన్‌.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్‌ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్‌ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్‌.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్‌ హిల్స్‌ ప్యాలస్‌ హోటల్‌ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్‌ వంక చూశాడు. అర్జున్‌ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్‌ కళ్ళు అక్కడ ఆన్‌ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.

అర్జున్‌ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్‌ లాటరల్‌ స్కె›్లరోసిస్‌ వ్యాధి వలన స్టీఫెన్‌ హాకింగ్‌ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్‌ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్‌! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్‌. ‘అర్జున్‌ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.

అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్‌.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్‌’ అన్నప్పుడు కనురెప్పలు  కదిలించాడు అర్జున్‌. ఎన్‌ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్‌ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్‌ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్‌ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్‌ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్‌కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement